‘చింతలపూడి’ పనులకు ఆటంకం
చింతలపూడి: చింతలపూడి మండలం కాంతంపాలెం గ్రామంలో చింతలపూడి ఎత్తిపోతల పథకం కాలువ తవ్వకం పనులను బుధవారం రైతులు అడ్డుకున్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయిన రైతులకు ఎకరాకు ప్రభుత్వం రూ.30 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ ఆందోళనకు దిగారు. గ్రామానికి చెందిన అబ్బిరెడ్డి సత్యవతి, నాగబాబుకు చెందిన భూముల్లో తవ్వకం పనులను ప్రారంభించడానికి వచ్చిన యంత్రాలను అడ్డుకుని నష్టపరిహారం ఇవ్వకుండా పనులు ప్రారంభిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం బలవంతంగా తమ భూములను లాక్కోవాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ సందర్భంగా రైతు నాయకుడు చిట్లూరి అంజిబాబు మాట్లాడుతూ అధికారులు రైతులకు ఇవ్వాల్సిన నష్టపరిహారం విషయంలో పక్షపాతం చూపుతున్నారని విమర్శించారు. దెందులూరు నియోజకవర్గంలో పట్టిసీమ కాలువకు భూములు పోగొట్టుకున్న రైతులకు రాజకీయ ఒత్తిళ్లతో ఎకరాకు రూ.30 లక్షలు ఇచ్చారని, ఇక్కడ మాత్రం జిరాయితీ భూములకు తక్కువ ఇస్తామంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏలూరు ఆర్డీవో చక్రధరరావు సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో చర్చించారు. బుధవారం ఇరిగేషన్ శాఖ మంత్రి ఉమామహేశ్వరావు, పీతల సుజాతతో నష్టపరిహారం విషయమై సమావేశం ఉందని, సీఎం పర్యటన ఉండటంతో గురువారం మంత్రులతో చర్చిస్తామని ఆర్డీవో అన్నారు. మంత్రులతో సమావేశం పూర్తయ్యేవరకు పనులు నిలిపివేస్తామని చెప్పారు. తహసీల్దార్ టి.మైఖేల్రాజ్ ఆయన వెంట ఉన్నారు.