రేపు సివిల్స్ ప్రిలిమినరీ
జిల్లాలో తొలిసారి పరీక్ష నిర్వహణ
23 సెంటర్ల ఏర్పాటు
హాజరుకానున్న 10,585 మంది అభ్యర్థులు
విద్యా కేంద్రం వరంగల్‌కు అరుదైన గుర్తింపు
సాక్షిప్రతినిధి, వరంగల్ :విద్యా కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్‌కు మరో అరుదైన గుర్తింపు దక్కింది. దేశంలోనే అత్యున్నతమైన సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష ఇక నుంచి వరంగల్లోనూ జరగనుంది. ఆదివారం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) ఈ పరీక్ష నిర్వహించనుంది.
దేశవ్యాప్తంగా 74 కేంద్రాల్లో నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురంలో ప్రిలిమ్స్ పరీక్ష జరుగుతుంది. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత వరంగల్‌లోనే పరీక్ష కేంద్రం ఉంది. మన జిల్లాలో పరీక్ష నిర్వహణకు 23 సెంటర్లు ఏర్పాటు చేశారు. ఈ పరీక్షకు 10,585 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.10 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.10 వరకు పరీక్ష జరగనుంది.
పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్
పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు. సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్–2016 పరీక్ష నిర్వహణకు ఏప్రిల్ 27న యూపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రిలిమ్స్ పరీక్ష కేంద్రాన్ని వరంగల్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. తెలంగాణలో ఇప్పటి వరకు కేవలం హైదరాబాద్‌లోనే సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష కేంద్రం ఉండేది. తాజాగా వరంగల్లోనూ ఏర్పాటు చేస్తుండడంతో ఉత్తర తెలంగాణలోని ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల అభ్యర్థులకు ఉపయోగపడుతుంది. రైల్వే, రోడ్డు రవాణా పరంగా వరంగల్‌కు మెరుగైన సౌకర్యాలు ఉన్నాయి. ఉత్తర, దక్షిణ భారతదేశాలకు వరంగల్ రవాణా పరంగా అనుసంధానంగా ఉంటుంది. ఈ కారణాలతో సివిల్స్ పరీక్షకు వరంగల్‌లో కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని యూపీఎస్సీ నిర్ణయించింది.