సీబీఎస్ఈ స్కూళ్లకు గట్టి వార్నింగ్
న్యూఢిల్లీ: తన పరిధిలోని పాఠశాలలకు సీబీఎస్ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) గట్టి హెచ్చరికలు జారీ చేసింది. పాఠశాలలు వ్యాపార కేంద్రాలుగా మారొద్దంటూ మందలించింది. సేవలు అనేవి సామాజిక బాధ్యతతో చేయాలే తప్ప వ్యాపారం మాదిరిగా కాదని చురకలంటించింది. పుస్తకాలు, యూనిఫామ్లు, స్టేషనరీ వస్తువులను సీబీఎస్ఈ పాఠశాలల్లో విక్రయిస్తున్నారని, ఇది నిబంధనలకు విరుద్ధం అని, ఇక నుంచి అలాంటి పనులు చేసే స్కూళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
స్కూళ్లలో, బయటి ముందుగా నిర్ణయించిన కొన్ని ప్రాంగణాల్లో ఎక్కువ మొత్తంలో పాఠశాలకు సంబంధించిన వస్తువులు అధిక మొత్తాలకు విక్రయిస్తూ తమను ఇబ్బంది పెడుతూ వాణిజ్యకేంద్రాలుగా పాఠశాలలు మారుతున్నాయని చిన్నారుల తల్లిదండ్రుల నుంచి తమకు ఫిర్యాదులు అందాయని, ఇది నిబంధనలకు పూర్తి విరుద్ధమైన చర్య అని హెచ్చరించింది. పాఠశాలలు సామాజిక సేవా కేంద్రాలుగా కొనసాగాలే తప్ప ఎప్పటకీ వ్యాపార కేంద్రాలుగా మారొద్దని సూచించింది. విద్యాసంస్థల అంతిమ లక్ష్యం నాణ్యమైన విద్యనందించడమేనని స్పష్టం చేసింది.