లేచి నిల్చుంటేనే కూత ఆగుతుంది!
ఈ ఏడాదైనా పొదుపొద్దున్నే లేచి వాకింగో, రన్నింగో, జాగింగో లేకపోతే జిమ్మింగో చేసేస్తానంటూ చాలా మంది కొత్తసంవత్సర శపథాలు చేస్తుంటారు. రాత్రికి రాత్రి అలారమ్ పెట్టేసుకొని పొద్దున్న అది మోగగానే ఒక్క నొక్కు నొక్కి హాయిగా కునుకు కంటిన్యూ చేస్తారు. తిరిగి లేచాక అరే.. ఈ రోజూ లేవలేకపోయామే అని బాధపడిపోతుంటారు. అలాంటి వారికోసమే ఓ కొత్త గ్యాడ్జెట్ రూపుదిద్దుకుంది. పేరు ‘రగ్గీ’. 15.5x23.5 సైజులో ఉండబోయే ఈ వెల్కమ్ మ్యాట్‌లో అలారమ్ క్లాక్ ఇమిడి ఉంటుంది.
అది ఉదయం మోగడం మొదలు పెట్టాక మీరు లేచి దానిపై కాసేపు నిల్చుంటేకానీ ఆగదు. దానికి స్నూజ్ బటన్ కూడా ఉండదు. నచ్చిన పాటను కూడా యూఎస్బీ ద్వారా అలారమ్‌గా పెట్టుకునే ఆప్షన్ ఉంది. మూడు ఏఏ బ్యాటరీలు వేస్తే ఏడాది వరకు చూసుకోనక్కర్లేదు. టామ్ అనే వ్యక్తి రూపొందించిన ఈ అలారమ్ మ్యాట్.. ‘కిక్‌స్టార్టర్’ వెబ్సైట్ ద్వారా ఇప్పటికే 70 వేల అమెరికా డాలర్ల వరకు ఫండింగ్ పొందింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే సెప్టెంబరులో ఇది మార్కెట్లోకి రావచ్చు.