చెరువులోపడి వ్యవసాయ కూలీ మృతి
∙కుమారుడికి పాలు పట్టేందుకు ఇంటికి వస్తుండగా ప్రమాదం
నల్లబెల్లి : వ్యవసాయ కూలీ పనులకు వెళ్లిన ఓ తల్లి తన చిన్నారి కుమారుడికి పాలు ఇచ్చేందుకు కొద్ది సమయం ముందుగా ఇంటికొస్తుండగా ప్రమాదవశాత్తు చెరువులోపడి మృతి చెందింది. ఈ ప్రమాదం మండలంలోని శనిగరంలో ఆదివారం జరిగింది. ఎస్సై, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. శనిగరం గ్రామానికి చెందిన మామిడిపల్లి సరిత(25) వ్యవసాయ కూలీ పనులు చేస్తూ జీవిస్తోంది. ఇదే క్రమంలో ఆదివారం కూలీ పనులకు వెళ్లింది. తన కుమారుడికి పాలు ఇచ్చేందుకు పనులు వేగంగా పూర్తి చేసుకుంది. సాయంత్రం తోటి కూలీ మంద రజితతో కలిసి ఇంటికి తిరిగొస్తుండగా శనిగరం మైసమ్మచెరువులో ప్రమాదవశాత్తు పడిపోయింది.
రజిత చెరువులోకి దూకి సరితను కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. అనంతరం పరిసర ప్రాంతాల రైతులు సరితను చెరువు కట్టపైకి తీసుకొచ్చారు. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా సరిత కన్నుమూసింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకొని బోరున విలపించారు. మృతురాలికి భర్త రవి, కుమార్తె సంధ్య, కుమారుడు చింటు ఉన్నారు. ఎస్సై మేరుగు రాజమౌళి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.