'భారత్ ఓటమికి కోహ్లీనే కారణం'
టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్స్ మ్యాచ్ లో భారత్ ఓటమిపై వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ లెండిల్ సిమ్మన్స్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ మ్యాచ్ లో భారత్ ఓటమికి స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీనే కారణమని పేర్కొన్నాడు. అతని ప్రవర్తన కారణంగానే తాను అలాంటి గొప్ప ఇన్నింగ్స్ ఆడి సమాధానం చెప్పానని అభిప్రాయపడ్డాడు. ఆండ్రీ ఫ్లెచర్ స్థానంలో తనకు దక్కిన అవకాశం వినియోగించుకుని జట్టుకు విజయాన్ని అందించానని సిమ్మన్స్ పేర్కొన్నాడు.
వాంఖడేలో జరిగిన ఆ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. విరాట్ 47 బంతుల్లో 89 పరుగులు చేసి భారీ స్కోరులో మరోసారి భాగస్వామి అయ్యాడు. అనంతరం చేజింగ్ కు దిగిన వెస్టిండీస్ ఏడు వికెట్ల తేడాతో భారత్ పై విజయాన్ని సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ ను ఓడించి టీ20 ప్రపంచకప్ ను రెండోసారి కైవసం చేసుకుంది.
తాను బ్యాటింగ్ చేస్తుండగా.. కోహ్లీ తనపై నోరు పారేసుకున్నాడని సిమ్మన్స్ పేర్కొన్నాడు. తన బ్యాటుతోనే అతడికి సమాధానం చెప్పి, విరాట్ ఒక్కడు మాత్రమే బెస్ట్ బ్యాట్స్ మన్ కాదని నిరూపించాలని భావించినట్లు వెల్లడించాడు. విరాట్ ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు చాలా ఆవేశంగా, దురుసుగా ప్రవర్తిసాడని, బ్యాటింగ్ మాత్రం గుడ్ అని చెప్పుకొచ్చాడు. భారత్ కు అభిమానుల మద్ధతు చూసి తాను షాక్ తిన్నానని, తన కెరీర్ లో ఈ ఇన్నింగ్స్ హైలెట్ గా నిలుస్తుందన్నాడు. నిజానికి ఆ మ్యాచ్ లో సిమ్మన్స్ రెండుసార్లు క్యాచ్ ఔట్ కాగా, ఆ బంతులు నోబాల్స్ కావడంతో ఊపిరి పీల్చుకున్న విషయం తెలిసిందే.