వారి చూపు ట్రంప్ వైపే!
లాస్ ఏంజిల్స్: అమెరికాలోని శ్వేతజాతీయులు అక్కడ పెరిగిపోతున్న విభిన్న జాతుల కల్చర్ పట్ల భయాందోళనలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. వారిలో ఉన్నటువంటి భయాలు రిపబ్లికన్ ప్రెసిడెంట్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు లాభం చేకూరుస్తాయని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా సైకాలజిస్ట్ బ్రెండా మేజర్ నిర్వహించిన పరిశీలనలో తేలింది. మల్టీ కల్చరల్ విధానం పట్ల అమెరికన్లంతా సంతృప్తిగా లేరని, ఇలాంటి వారు ట్రంప్‌వైపు చూస్తున్నారని ఆమె తెలిపారు. శ్వేతజాతీయులు చాలా వరకు జాతి విభిన్నతను ప్రమాదకరమైనదిగా భావిస్తున్నారని ఆమె వెల్లడించారు.
ట్రంప్ మొదటి నుంచీ చెబుతున్న మాటలు, చేస్తున్న వాగ్దానాలు ఇలాంటి వర్గాలకు చేరువచేసేలా ఉన్నాయి. ముస్లింలను దేశంలోకి రానివ్వొద్దు అని చెప్పడం, మెక్సికో సరిహద్దులో గోడకడతాననడం, విదేశీయులు అమెరికా ఉద్యోగాలను కొల్లగొడుతున్నారని పదేపదే చెప్పడం లాంటి యాంటి ఇమ్మిగ్రెంట్ విధానాలతో ట్రంప్ శ్వేతజాతి సాంప్రదాయవాదులకు చేరువయ్యారు.