'నన్ను వ్యభిచారిణి, సైకో అన్నా ఫరవాలేదు'
న్యూఢిల్లీ: 'ఒక మహిళ చురుకుగా ఉందనుకోండి, ఆమెను వ్యభిచారిణిగా భావిస్తారు. అదే మహిళ ఏదైనా రంగంలో విజయాలను సాధించిందనుకోండి, సైకో అని ముద్రవేస్తారు. ఈ రెండింటింటిలో నన్ను ఏదనుకున్నా ఫరవాలేదు. ఎందుకంటే నేను ఎవరికోసమో బతికేదాన్నికాదు నా కోసం, నాకు నచ్చినట్టు జీవించేదాన్ని' అంటూ హృతిక్ రోషన్ తో న్యాయపోరాటం చేస్తోన్న తనపై వస్తున్న ఆరోపణలకు ధీటుగా స్పందించారు జాతీయ ఉత్తమ నటి కంగనా రనౌత్. ఓ జాతీయ చానెల్ కు బుధవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలె చెప్పుకొచ్చారామె.
'నా మైండ్ షార్ప్ గా ఉంటుంది. దుర్భలమైన శరీరం. ఇందుకు నేను గర్విస్తా. నాపై వచ్చే విమర్శలకు సక్సెస్ తోనే సమాధానమిస్తా. నేను సెల్ఫ్ ప్లీజర్ ని.. పీపుల్స్ ప్లీజర్ ను కాను. ఇక్కడ ఆడవాళ్లను ఇంకా ఒక వస్తువుగానే ట్రీట్ చేస్తుండటం దారుణం. ఒక అమ్మాయి చనిపోవాలనుకుంటే ఆత్మహత్యే అవసరంలేదు.. ఆమె సాధించే విజయాలు, ఎదురయ్యే విమర్శలే ఆమెను చంపగలవు. ఎవరికైనాసరే, చీకటి రోజులు తప్పవు. కానీ మళ్లీ మనవైన రోజులు వస్తాయని నా నమ్మకం' అని తనపై తనకున్న నమ్మకాన్ని వెల్లడించారు కంగన.
చిన్న గ్రామం నుంచి ఇప్పుడున్నస్ధాయికి చేరుకోవడంలో తన జీవన ప్రయాణం అత్యద్భుతంగా సాగిందని, తాను తనలాగే ఉంటాను తప్ప మరొకరిలా ఎన్నటికీ మారబోనని కంగనా చెప్పారు. హృతిక్ రోషన్ తో వివాదాన్ని న్యాయపరంగానే ఎదుర్కొంటానని బదులిచ్చారు. నిజానికి ఇలా పోరాడటం కష్టం. నేను వేసే ప్రతి అడుగులో ఆటంకాలున్నాయని తెలుసు. అయినాసరే, వెళుతోన్నది సరైనదారే కబట్టి ముందుకే వెళతానని పేర్కొన్నారు. నటుడు 'క్రిష్ 3' తర్వాత సన్నిహితులుగా మారిన హీరో హృతిక్ రోషన్, కంగనా రనౌత్ లు ఇటీవల గొడవపడటం, ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదులు చేసుకోవడం, విషయం న్యాయపోరాటం వరకు వచ్చిన సంగతి తెలిసిందే.