'సెమీఫైనల్స్ లో నేనే చెత్త ఆటగాడిని'
లండన్ : ఫ్రెంచ్ ఆటగాడు రిచర్డ్ గాస్కెట్ తనను ఓ చెత్త ఆటగాడిగా అభివర్ణించుకున్నాడు. అసలు విషయమంటే.. వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్లోకి ప్రవేశించిన నలుగురు ఆటగాళ్లలో తాను మాత్రం ఓ చెత్త ఆటగాడినని గాస్కెట్ పేర్కొన్నాడు. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఫ్రెంచ్ ఓపెన్-2015 ఛాంపియన్ వావ్రింకాపై 6-4, 4-6, 3-6, 6-4, 11-9 తేడాతో గెలుపొందిన విషయం విదితమే.
మూడు గంటల పాటు జరిగిన సుదీర్ఘపోరులో వావ్రింకాపై గెలిచిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రోజర్ ఫెదరర్, నొవాక్ జోకోవిచ్, ఆండీ ముర్రెలు దిగ్గజ ఆటగాళ్లని, వారితో పోలిస్తే తాను సాధారణ ఆటగాడినని చెప్పాడు. గాస్కెట్ ఎనిమిదేళ్ల తర్వాత గ్రాండ్‌స్లామ్ టోర్నీ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో జోకోవిచ్ తో తలపడనున్నాడు. ఫెదరర్ 7 సార్లు గెలవగా, 2013, 2014లలో ముర్రె, జోకోవిచ్ లు ఛాంపియన్లుగా నిలిచిన విషయం తెలిసిందే. ఎలాగైనా పోరాడి జోకోవిచ్‌పై నెగ్గి ఫైనల్లోకి ప్రవేశించాలనేది తన ముందున్న లక్ష్యమని గాస్కెట్ పేర్కొన్నాడు.