జర్మనీ అనుబంధ సంస్థను విక్రయించిన సుజ్లాన్
* 1.2 బిలియన్ డాలర్లకు సెన్వియాన్ అమ్మకం...
* రుణ భారం తగ్గించుకునేందుకు చర్యలు...
న్యూఢిల్లీ: పవన విద్యుత టర్బయిన్ల తయారీ దిగ్గజం సుజ్లాన్ ఎనర్జీ... రుణ భారం తగ్గించుకోవడంపై దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా తమ జర్మనీ అనుబంధ సంస్థ సెన్వియాన్ను 1.2 బిలియన్ డాలర్ల(దాదాపు రూ.7,200 కోట్లు) మొత్తానికి విక్రయించింది. అమెరికాకు చెందిన ప్రైవేటు ఈక్విటీ(పీఈ) ఫండ్ సెంటర్బ్రిడ్జ్ పార్ట్నర్స్ ఎల్పీతో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సుజ్లాన్ ఒక ప్రకటనలో పేర్కొంది.
డీల్లోని కొన్ని షరతుల మేరకు మరో 5 కోట్ల డాలర్లు కూడా తమకు లభించే అవకాశం ఉందని తెలిపింది. తమ కంపెనీకి ఉన్న సుమారు రూ.16,500 కోట్ల రుణ భారంలో కొంత మొత్తాన్ని చెల్లించేందుకు ఈ అమ్మకం నిధుల్లో రూ.6,000 కోట్లను ఉపయోగిస్తామని వివరించింది. మిగతాది వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వినియోగించనున్నట్లు తెలిపింది. ఈ చర్యల నేపథ్యంలో 2016లో కంపెనీ లాభాల్లోకి రానుందని సుజ్లాన్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ అమ్మకం ఒప్పందం ఈ ఏడాది మార్చికల్లా పూర్తవ్వొచ్చని అంచనా వేసింది.
దేశీయంగా, అధిక వృద్ధికి అవకాశాలున్న మార్కెట్లపైనే ఎక్కువగా దృష్టిపెట్టనున్నామని సుజ్లాన్ చైర్మన్ తులసి తంతి చెప్పారు. దీన్ని తెలివైన నిర్ణయంగా ఆయన పేర్కొన్నారు. 2007లో సెన్వియాన్ను సుజ్లాన్ దాదాపు 1.63 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. కాగా, సబ్సిడీరీ అమ్మకం వార్తలతో సుజ్లాన్ షేరు ధర భారీగా దిగజారింది. గురువారం బీఎస్ఈలో 7.45% క్షీణించి రూ.15.91 వద్ద ముగిసింది.