రెక్కల బల్లి!
జీవ ప్రపంచం
బ్రెజిల్‌లోని పరాన రాష్ట్రంలో క్రూజైరో ప్రాంతంలో రెక్కలబల్లి(టెరోసార్)కు సంబంధించిన శిలాజాలను ఇటీవల కనుగొన్నారు. వాటి రెక్కల పొడవు సుమారు ఎనిమిది అడుగులు.
రెక్కల బల్లులకు సంబంధించిన ఎముకలు ఇంత పెద్ద మొత్తంలో కనుక్కోవడం ఇదే తొలిసారి. ‘టెరోసార్’ అనే గ్రీకు పదానికి ‘రెక్కల బల్లి’ అని అర్థం. అయితే చాలామంది దీన్ని ‘రెక్కల డైనోసర్’ అని పిలుస్తున్నారు. ఇది సరైనది కాదంటున్నారు జీవశాస్త్ర నిపుణులు. ‘‘రెక్కల బల్లులు ఒకే ప్రాంతంలో గుంపులుగా నివసించేవి. ప్రస్తుతం మేము కనుగొన్న ప్రాంతం అలాంటి వాటిలో ఒకటి’’ అంటున్నాడు ‘ఫెడరల్ యూనివర్శిటీ ఆఫ్ రియోడిజనీరో’కు చెందిన పరిశోధకుడు డా.కెల్నర్. ఇవి అంతరించడానికి కరువు పరిస్థితులు లేదా ఎడారి తుపానులు కారణమని శాస్త్రవేత్తలు అంచనా వేశారు.
‘శక్తిమంతమైన విమానం’గా పేరున్న రెక్కల బల్లి శరీరాకృతిలో కాలక్రమంలో మార్పులు వచ్చాయి. మొదట్లో అవి నోటి నిండా పళ్లు, పొడవాటి రెక్కలతో ఉండేవి. ఆ తరువాత కాలంలో తోక పొడవు తగ్గింది. పళ్లు చాలా తక్కువగా కనిపించేవి. కొన్నిటికైతే అసలు పళ్లే ఉండేవి కావు. ఇటలీ శాస్త్రవేత్త కొసిమో 1784లో తొలిసారిగా రెక్కలబల్లికి సంబంధించిన శిలాజాన్ని కనుగొన్నాడు. అయితే దీన్ని ‘సముద్రపు జీవి’గా ఆయన పొరబడ్డాడు. కసుమి సాటో అనే జపాన్ శాస్త్రవేత్త ఆధునిక పక్షులతో పోల్చుతూ రెక్కలబల్లి మీద పుస్తకం కూడా రాశాడు.
రెక్కలబల్లి గంటకు 120 కిలోమీటర్ల దూరం ప్రయాణించేది. అలా వేలాది కిలోమీటర్ల దూరాన్ని సునాయాసంగా ప్రయాణించే సహజశక్తి దానికి ఉంది. డైనోసర్ల దాయాదులుగా చెప్పబడే రెక్కల బల్లులు కాల్పనిక సాహిత్యం, సినిమాలలో డైనోసర్ల స్థాయిలో పేరు తెచ్చుకోనప్పటికీ 1912లో అర్థర్ కానన్ రాసిన ‘ది లాస్ట్ వరల్డ్’ నవలలో, ‘కింగ్‌కాంగ్’ ‘వన్ మిలియనీర్స్ బి.సి’ సినిమాలలో వీటి ప్రస్తావన కనిపిస్తుంది. రెక్కల బల్లుల గురించి వివిధ దేశాల్లో లోతైన పరిశోధనలు ఎన్నో జరిగాయి. ప్రస్తుతం కనుగొన్న శిలాజాలు... పాత పరిశోధనలకు సరికొత్త సమాచారాన్ని అందించవచ్చు.