బుద్ధుడు పలికిన రోజు
బౌద్ధంలో ఆషాఢ పున్నమికి ఎంతో ప్రాధాన్యత ఉంది.
ధర్మ ప్రచారానికి తొలి అడుగు వేసిన రోజు అది. బౌద్ధ సంఘం పుట్టిన రోజు.
ధర్మం అడవుల్ని వదిలి ప్రజల్లోకి నడక సారించిన రోజు.
అది రుషి పట్టణంలోని లేళ్ళ వనం.వనమంతా పచ్చదనం పరచుకుని ఉంది. ఆ రోజు ఆషాఢ పున్నమి.వనం మౌనముద్రలో ఉన్న మునిలా ఉంది. నిశ్శబ్ద పరీమళాలు వెదజల్లుతోంది.వనం మధ్య మట్టి దిబ్బ మీద కూర్చొని దూరంగా తమ వైపుకే వస్తున్న వ్యక్తికేసి కన్నార్పకుండా చూస్తున్నారు ఓ ఐదుగురు తపోధనులు. ఆ వచ్చే వ్యక్తిని అల్లంత దూరాన్నుండే ఆనవాలు పట్టారు. వెంటనే వారి ముఖాల్లో కొద్దిపాటి అయిష్టత తొంగి చూసింది. కానీ... ఆ వ్యక్తి ప్రశాంత గంభీరగమనం వారికి విజ్ఞాన వసంతాగమనంలా అనిపించింది. అతని నిర్మల వదనం ఓ అహింసా సదనంలా తోచింది. జ్ఞాన పుంజాలు వెదజల్లే అతని రూపం దివ్యతేజం విరజిమ్మే ధర్మదీపంలా కనిపించింది.
వారి కోసం ఆయన రెండు నెలల నుండి నడచుకొంటూ, వారి కోసమే వెతుక్కుంటూ వస్తున్నాడు. ఎంతో కాలంగా అనేక మార్గాల్లో సాధన చేసి, చివరికి తనదైన ధ్యాన మార్గంలో జ్ఞానాన్ని సాధించిన ఆ జ్ఞాన స్వరూపుడు... తాను కనుగొన్న జ్ఞానాన్ని తన పాత మిత్రులైన ఈ ఐదుగురికి చెప్పాలని బుద్ధ గయ నుండి వస్తున్నాడు.
ఒకప్పుడు జ్ఞానసాధనలో ఈ ఆరుగురు కలసి గయకు సమీపంలోని నిరంజనా నదీ తీరంలో హఠయోగ సాధన చేశారు. ఆ సాధనలో క్రమేపీ ఆహారం మానిన ఆయన చిక్కిశల్యమైపోయాడు. చివరికి చావుకు దగ్గరయ్యాడు. శరీరాన్ని ఇలా ఎండ కట్టుకోవడం వల్ల రోగం దుఃఖం తప్ప జ్ఞానం రాదని గ్రహించాడు. ఆ కఠోర తపస్సు విరమించాడు. తిరిగి మితంగా ఆహారం తీసుకోవడం ప్రారంభించాడు. దాన్ని చూసిన మిగిలిన ఐదుగురు ‘ఇతను యోగ భ్రష్టుడయ్యాడు’ అని నిర్ణయించుకొని, అతణ్ణి వదిలిపెట్టి, ఇదిగో ఈ కాశీ సమీపంలోని, సారస పక్షుల నివాసమైన సారనాథ్‌లోని ఈ జింకలవనంలో ఉంటున్నారు. తపోసాధన సాగిస్తున్నారు.
ఈ ఐదుగురు తనను వదలివచ్చాక ఆయన గయకు చేరాడు. బోధి వృక్షం క్రింద కూర్చొని ‘ధ్యానం’ అనే తన విధానాన్ని కనుగొన్నాడు. చివరికి గత వైశాఖి పౌర్ణమి రోజున దుఃఖ నివారణా మార్గాన్ని కనుగొన్నాడు. జ్ఞానోదయం పొందాడు. అనాత్మ, అనిత్యం అనే తన తత్త్వాల్ని దర్శించాడు. దుఃఖం పోవాలంటే ఆచరించాల్సిన మార్గాన్ని తెలుసుకున్నాడు. జ్ఞానం, శీలం, ధ్యానంతో కూడిన ఎనిమిది అంగాల్ని పాటిస్తే దుఃఖ విముక్తి కలుగుతుందని కనుగొన్నాడు. తాను కనుగొన్న ఆ మార్గాన్ని ప్రబోధించడానికి ఇలా కాలినడకన రెండు నెలలు నడచి నడచి చివరికు వారి దగ్గరకు వచ్చాడు.
ఆ వచ్చిన మహాజ్ఞాని ఎవరో కాదు. భగవాన్ బుద్ధుడే!
అయితే, తాము వచ్చేశాక సాగిన బుద్ధుని సాధన, పొందిన జ్ఞానోదయం ఇవేవీ ఆ అయిదుగురికి తెలియదు.అందుకే ఇప్పటికీ ‘యోగభ్రష్టుని’గానే భావించారు. అందుకే వారి ముఖాల్లో అయిష్టత పొడచూపింది. ‘గౌరవించకూడడు’ అనుకొన్నారు. కానీ... ఆయన ఒక్కొక్క అడుగు వారికి దగ్గరగా వచ్చే కొద్దీ... ఆయన పరిపూర్ణ జ్ఞాన స్వరూపం సాక్షాత్కారం అయ్యే కొద్దీ... వారి ఆలోచనలు మారిపోయాయి. వారికి తెలియకుండానే లేచి నిలబడ్డారు. వినయంగా నమస్కరించారు. గౌరవంగా ఆహ్వానం పలికారు. సముచితమైన ఆసనం చూపించారు.
అయినా పాత మిత్రునిలాగానే భావించి ‘‘ఓ! గౌతమా’’ అని సంబోధించారు. ‘‘మిత్రులారా! దుఃఖ నివారణా మార్గం కనుగొన్నాను. ధ్యాన సాధనతో జ్ఞానోదయం పొందాను. బుద్ధుని పొందాను. సంబుద్ధుణ్ణయ్యాను’’ అని తాను కనుగొన్న విషయాల్ని ప్రబోధించాడు బుద్ధుడు.
బుద్ధుడు ప్రపంచ మానవాళి దుఃఖ నివారణ కోసం, సరైన మార్గం కనుగొన్నాడని ముందుగా ఆ ఐదుగురిలో పెద్దవాడైన కౌండిన్యుడు గ్రహించాడు. వెంటనే ఆయన అంజలి ఘటించి ...
‘‘గౌతమా’’ అని ఒక మిత్రుణ్ణి సంబోధించినట్లు సంబోధించకుండా.. ‘‘భగవాన్! నన్ను మీ అనుయాయిగా స్వీకరించండి. మీ మార్గంలో నడవనీయండి’’ అని వినమ్రంగా అడిగాడు. అందుకు బుద్ధుడు అంగీకరించి, మొదటిగా కౌండిన్యుణ్ణి తన అనుయాయిగా స్వీకరించాడు. ఆ తర్వాత వరుసగా బప్ప (కశ్యపుడు), బద్దియుడు (భద్రియుడు), అస్సజి (అశ్వజిత్తు), మహానాములు బుద్ధుని ప్రబోథీల్ని అర్ధం చేకున్నారు. వారంతా ఆయన అనుయాయులుగా మారారు. ‘‘భగవాన్! మహా శాస్తా!’’ అంటూ ప్రణమిల్లారు.
(భగవా అంటే భగ్నకరోతి దు:ఖం ఇతి భగవా అని. దీనికి దుఃఖాన్ని భగ్నం చేసేవాడా అని అర్ధం. ‘శాస్తా’ అంటే ‘మహాగురువు’ అని).
ఆయన వారికి తాను కనుగొన్న అష్టాంగ మార్గం (ధర్మచక్ర ప్రవర్తన సూత్రం), అనాత్మవాదం (అనాత్మ లక్షణ సూత్రం) ప్రబోధించాడు.
ఇదే ... బుద్ధుని తొలి ప్రవచనం.
అప్పటి వరకూ ఉన్న సంప్రదాయం ప్రకారం ఋషులు, ప్రబోధకులు అడవుల్లో ఆశ్రమాల్లో జీవిస్తూ, బోధిస్తూ ఉండేవారు. ఈ సంప్రదాయాన్ని బుద్ధుడు మార్చివేశాడు. ‘ప్రజల వద్దకే దార్శికులు. ప్రజల కోసమే వారి ప్రబోధాలు’ అనే నిర్ణయాన్ని తీసుకొన్నాడు. ధర్మాన్ని, దుఃఖ నివారణా మార్గాన్ని ప్రజలందరికీ అందించాలి అని నిర్ణయించుకొని ‘బహుజన హితాయ - బహుజన సుఖాయ’ అనే నినాదం అందుకొన్నాడు. అందుకోసం ‘‘బౌద్ధ సంఘం’’ స్ధాపించాడు. తన ధర్మాన్ని అవలంబించి, ప్రచారం చేస్తూ, కాలినడకన తిరుగుతూ, భిక్ష మీద జీవించే వారితో ఆ సంఘం ఉంటుంది. వారే భిక్షువులు. వారే ధర్మాన్ని నిరంతరం కదిలే చక్రంలా అన్ని దిశలకూ నడిపిస్తారు. ధర్మచక్ర ప్రవర్తనం చేస్తారు.
అలా ఆ మొదటి ఐదుగురితో బౌద్ధ సంఘం సారనాథ్‌లో ఏర్పడింది. ధర్మచక్రం నడక ప్రారంభించింది. బౌద్ధంలో ఆషాఢ పున్నమికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ధర్మ ప్రచారానికి తొలి అడుగు ఈ రోజు. ఇది బౌద్ధ సంఘం పుట్టిన రోజు. ధర్మం అడవుల్ని వదిలి ప్రజల్లోకి నడక సారించిన రోజు. అందుకే ... అశోకుడు మహాశాస్త (మహా గురువు) అయిన బుద్ధునికీ, అతని ధర్మానికీ గుర్తుగా సారనాథ్‌లో ధర్మచక్ర మహాస్తూపాన్ని నిర్మించాడు. వేల సంవత్సరాలుగా బౌద్ధులు దీన్ని ఈ ఆషాఢ పున్నమిని ‘‘ధర్మ చక్ర ప్రవర్తన దినంగా’, ‘గురు పున్నమిగా’ జరుపుకొంటున్నారు. మన జాతీయ చిహ్నంలోని అశోక ధర్మ చక్రం సారనాథ్‌లోని ఈ ధర్మచక్రమే. ఈ ఆషాఢ పున్నమి అవనిపై ధమ్మ పరీమళాలు విరజిమ్మిన పున్నమే!
- బొర్రా గోవర్ధన్ (రేపు గురుపూర్ణిమ)