పికాసో గారి దెయ్యం
మిస్టరీ
పికాసో ప్రసిద్ధ చిత్రం ‘బాతింగ్ వుమన్ ఇన్ బ్లూరూమ్’లోని సౌందర్యం గురించి మాత్రమే మనకు తెలుసు. తాజా విశేషం ఏమిటంటే, అందులో ఒక ‘రహస్యం’ కూడా దాగి ఉంది.
ఆ చిత్రంలో ఒక అపరిచితుడు దాగి ఉన్నాడు! ఇదేమి విచిత్రం... చిత్రంలో చిత్రమేమిటంటారా? అయితే అసలు విషయంలోకి వచ్చేద్దాం. ప్యారిస్‌లో 1901లో ‘బాతింగ్ ఉమన్...’ చిత్రాన్ని చిత్రించాడు పికాసో. ఇది ఆయనకు ఎంతో పేరు తెచ్చింది.
కట్ చేస్తే...
వాషింగ్టన్ డి.సీలోని ‘ది ఫిలిప్స్ కలెక్షన్’ గ్యాలరీ సంరక్షకురాలు పెట్రికా ఫవెరో ‘బాతింగ్ వుమన్...’ చిత్రాన్ని లోతుగా పరిశీలించారు. సైనికులు ఉపయోగించే నైట్ విజన్, రిమోట్ సెన్సింగ్ సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన ప్రత్యేకమైన కెమెరాతో సూక్ష్మ పరిశీలన చేశారు. (మామూలు కంటికి కనిపించని దృశ్యాలను దీని ద్వారా చూడడం వీలవుతుంది) ఈ క్రమంలోనే... చిత్రం వెనుక ‘చిత్రం’ కనిపించి ఆమెను ఆశ్చర్యానికి గురి చేసింది.
చేతికి ఉంగరాలు, గెడ్డంతో ‘అంతర్గత చిత్రం’లో ఉన్న వ్యక్తి ఎవరు? అది పికాసో సెల్ఫ్పోర్ట్రయిట్ అనేది కొందరి అంచనా. పికాసోకు సన్నిహితుడైన ఆర్ట్ డీలర్దని మరి కొందరి అంచనా... ఈ చర్చ నేపథ్యంలోనే కొందరు వింత వాదన ఒకటి వినిపించారు. అంతర్ చిత్రంలో కనిపించేది పికాసో దెయ్యమని, తాను ప్రేమించిన ప్రతి చిత్రంలోనూ ఇలా పికాసో దెయ్యమై కొలువుంటాడని!
ఒక పోర్ట్రయిట్ వేయడం, ఒకవేళ అది నచ్చకపోతే దాని మీదే మరో పోర్ట్రయిట్ వేసి రీవర్క్ చేయడం అనేది పికాసో అలవాటు అని, పికాసో గీసిన ‘ఉమెన్ ఐరెనింగ్’ పెయింటింగ్‌లోనూ ‘హిడెన్ ఇమేజ్’ కనిపిస్తుందని కళాచరిత్రకారులు కాస్త గట్టిగా చెప్పేసరికి దెయ్యం కథలు తగ్గుముఖం పట్టాయి.