సబ్‌కలెక్టరేట్‌లో మహిళ ఆత్మహత్యాయత్నం
మదనపల్లె రూరల్: నేరారోపణలపై పోలీసులు విచారణకు తీసుకెళ్లిన తన కుమారుడి ఆచూకీ లేదని పేర్కొంటూ స్థానిక పీఅండ్‌టీ కాలనీకి చెందిన జమ్రుద్బేగం సబ్‌కలెక్టరేట్‌లో శనివారం ఆత్మహత్యకు యత్నించింది. విషయం తెలుసుకున్న సబ్‌కలెక్టర్ వెట్రిసెల్వి అక్కడికి చేరుకుని మహిళను నిలువరించారు. సమస్య ఏమిటో చెప్పకుండా, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడంపై మందలించారు. బాధితురాలు మాట్లాడుతూ తనకు ముగ్గురు కొడుకులు ఉన్నారని తెలిపింది. చిన్న కొడుకు హుస్సేన్ ఆర్ఆర్ స్ట్రీట్‌లోని శ్రీనివాసులు వస్త్ర దుకాణంలో పనిచేస్తున్నాడని పేర్కొంది. నెలక్రితం దుకాణంలో జరిగిన దొంగతనంలో హుస్సేన్ ప్రమేయముందని పేర్కొంటూ వన్‌టౌన్ పోలీసులు అతన్ని తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టారని తెలిపింది. పదిరోజుల తర్వాత తిరిగి పోలీసులు ఇంటికి వచ్చి రెండో కుమారుడు నయాజ్‌ను విచారణ నిమిత్తం స్టేషన్‌కు తీసుకురావాలని చెప్పడంతో తానే]∙స్వయంగా తీసుకెళ్లానని చెప్పింది. తన కళ్లెదుటే కొడుకును కానిస్టేబుళ్లు నరేష్, సుకుమార్ విపరీతంగా కొట్టారని వాపోయిం ది.
‘నీ కొడుకు తర్వాత వస్తాడుపో’ అని చెప్పారని, రెండు రోజులైనా తన కొడు కు ఇంటికి రాలేదని కన్నీంటి పర్యంతమైంది. స్టేషన్లో విచారిస్తే వెళ్లిపోయాడని, రెండు, మూడు రోజుల్లో వస్తాడని పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని వాపోయింది. 20 రోజులైనా తన బిడ్డ కనిపించకపోవడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆత్మహత్యకు యత్నించాల్సి వచ్చిందని బోరుమంది. స్పందించిన సబ్‌కలెక్టర్ వెంటనే డీఎస్సీ రాజేంద్రప్రసాద్, సీఐ నిరంజన్‌కుమార్, ఎస్ఐ సుకుమార్, కానిస్టేబుల్ నరేష్‌ను పిలిపించి విచారించారు. దొంగతనం విషయమై పిల్లలిద్దరినీ స్టేషన్‌కు పిలిపించిన మాట వాస్తవమేనని తెలిపారు. విచారణ తర్వాత ఇంటికి పంపేశామని చెప్పారు. దొంగతనం బయటపడితే ఎక్కడ డబ్బులు కట్టాల్సి వస్తుందోనన్న భయంతో ఆత్మహత్య నాటకాలు ఆడుతోందని చెప్పారు. రెండో కుమారుడి అదృశ్యంపై తమకు ఎలాంటి ప్రమేయం లేదని వివరణ ఇచ్చారు. మహిళ మాత్రం తనకు న్యాయం చేసేంతవరకు వెళ్లేది లేదని మొండికేయడంతో పరిష్కారం కోసం డీఎస్పీ ఆఫీసుకు తీసుకెళ్లారు.