Woman fired
-
అమెరికాలో మహిళ కాల్పులు: పలువురు మృతి
వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పులు అలజడి సృష్టించాయి. బాల్టిమోర్ పట్టణంలో గురువారం గుర్తుతెలియని మహిళ విచ్చలవిడిగా కాల్పులు జరపడంతో పలువురు మృతిచెందగా, మరికొందరు గాయపడినట్లు తెలిసింది. నిందితురాలు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. ఔషధాలను నిల్వ ఉంచిన గోదాము వద్ద ఉదయం జరిగిన ఈ దాడిలో ముగ్గురు మరణించగా, ఇద్దరు గాయపడినట్లు స్థానిక మీడియాలో వార్తలొచ్చాయి. హర్ఫోర్డ్ కౌంటీ పోలీసు అధికారి జెఫ్రీ గెహ్లార్ వివరాలు వెల్లడిస్తూ మృతులు, క్షతగాత్రుల సంఖ్యను ధ్రువీకరించలేదు. నిందితురాలి వద్ద ఒకటే తుపాకి ఉందని, సంఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా బలగాలు ఆమెను నిలువరించే క్రమంలో కాల్పులకు దిగలేదని తెలిపారు. కౌంటీకి ఉగ్రముప్పు లేదని స్పష్టం చేశారు. కాలిఫోర్నియాలోని యూట్యూబ్ ప్రధాన కార్యాలయంలో ఇరాన్ మహిళ ముగ్గురిని కాల్చి చంపి తనని తాను కాల్చుకున్న సుమారు ఐదు నెలల తరువాత మరో మహిళ అమెరికాలో తుపాకితో విధ్వంసం సృష్టించింది. -
గడ్డివాములో యువతి సజీవ దహనం !
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా జర్కన్పల్లి మండలం పుప్పల్లపల్లి గ్రామ శివారులో శుక్రవారం దారుణం చోటు చేసుకుంది. కొంతమంది ఆగంతకులు యువతిని గడ్డివాములో వేసి కాల్చి వేశారు. దాంతో మంటలు భారీగా ఎగసి పడటంతో స్థానికులు గడ్డివాము వద్దకు చేరుకున్నారు. దాంతో ఆగంతకులు అక్కడి నుంచి పరారైయ్యారు. స్థానికులు వెంటనే స్పందించి మంటలార్పి వేశారు. అనంతరం గడ్డివాములోని మృతదేహన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు పుప్పల్లపల్లి గ్రామానికి చేరుకుని యువతి మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే అప్పటికే సదరు మృతదేహం గుర్తించడానికి వీలు లేని విధంగా కాలిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా సదరు మహిళను తీసుకువచ్చి ఇక్కడ దహనం చేశారా ? లేక వేరే చోట హత్య చేసి ఇక్కడ కాల్చి వేశారా? అన్న కోణంలో దర్యాప్తు సాగుతుంది. అందులోభాగంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.