మహిళా రైతుల శ్రమను గుర్తిద్దాం!
: దేశవ్యాప్తంగా గ్రామీణ మహిళా శ్రామికుల్లో 74 శాతం కంటే ఎక్కువ మంది వ్యవసాయంలో పనిచేస్తున్నారు.
: రెండున్నర ఎకరాల పొలంలో పురుషుడు 1,212 గంటలు పనిచేస్తే, స్త్రీ 3,845 గంటలు పని చేస్తుంది.
: రెండున్నర ఎకరాల పొలంలో స్త్రీలు 557 గంటలు నాట్లు వేస్తారు. 640 గంటలు కలుపు తీస్తారు. 384 గంటలె నీటి పని చూస్తారు.
: 650 గంటలు పెండ ఎరువు మోస్తారు. 984 గంటలు కుప్పలేసి నూర్చుతారు.
: మహిళలకు పురుషుల కన్నా 20-25 శాతం తక్కువ వేతనాలు అందుతున్నాయి.
: మూడింట రెండొంతులు పని చేస్తున్న మహిళలకు లభిస్తున్న ఆదాయం మూడింట ఒక వంతు మాత్రమే.
: మన దేశం (2011 జనాభా గణన)లో మూడున్నర కోట్ల మంది మహిళలు సాగుదారులుగా నమోదయ్యారు.
: తెలంగాణలో 11,50,039 మంది, ఆంధ్రప్రదేశ్‌లో 9,84,179 మంది మహిళా సాగుదారులున్నారు.
వ్యవసాయ పనులతో మమేకమయ్యే వారిలో అత్యధికులు మహిళలే. రైతు కుటుంబాల్లోని మహిళలు.. మహిళా కూలీలు.. మహిళా మత్స్యకార్మికులు.. అటవీ ఉత్పత్తులు సేకరించి జీవనం సాగించే ఆదివాసీ మహిళలు.. ఆహారోత్పత్తి ప్రక్రియ అన్ని దశల్లోనూ అనుదినం చెమట చిందించే వీరంతా మహిళా రైతులే. అయినా వీళ్లకు రైతులుగా కనీస గుర్తింపు లేకపోవడం అన్యాయం. తెల్లారితే పొలానికెళ్లి పనులు చేసే రైతు మహిళలకు భూమి హక్కు కల్పించాలని, వారి పేర్లను రెవిన్యూ రికార్డుల్లో ‘సాగుదారులు’గా రాయించడం కనీస ధర్మమని ప్రముఖ మహిళా రైతు ఉద్యమ నేత కురుగంటి కవిత అంటున్నారు. మహిళలను రైతులుగా గుర్తించి, పురుష రైతులతో సమానంగా వనరులు కల్పిస్తే పంటల ఉత్పాదకత పెరుగుతుందనడానికి రుజువులున్నాయంటున్నారు.
దేశవ్యాప్తంగా 400కు పైగా రైతు సంఘాలు, మహిళా సంఘాలు, వినియోగదారులు, ఇతర పౌర సంఘాలతో కూడిన సమాఖ్య ‘ఆశా’ (అలియన్స్ ఫర్ సస్టయినబుల్ అండ్ హోలిస్టిక్ అగ్రికల్చర్)కు ఆమె సారథ్యం వహిస్తున్నారు. ఆమె తల్లిదండ్రులు కురుగంటి గంగాభవాని (తూ.గో. జిల్లా పలివెల), రమేశ్‌ది (గుంటూరు). హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎం.ఏ. చదివిన తర్వాత ఐదేళ్లపాటు జహీరాబాద్ ప్రాంతంలో డీడీఎస్ మహిళా రైతుల అభ్యున్నతికి పనిచేశారు. తదనంతరం బెంగళూరు కేంద్రంగా ‘ఆశా’ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. ఇటీవల ఏర్పాటైన జాతీయ మహిళా హక్కుల వేదిక (మకాం) ఈనెల 17 నుంచి 3 రోజుల పాటు బాపట్లలో తొట్టతొలిగా జాతీయ మహిళా రైతుల సమ్మేళనం నిర్వహించనుంది (mahilakisan.makaam@gmail.com). ఈ సందర్భంగా ఆమె ‘సాగుబడి’తో ముచ్చటించారు. ముఖ్యాంశాలు..
మహిళా రైతులంటే ఎవరు?
సొంత భూమిలో గానీ, కౌలు భూమిలో గానీ వ్యవసాయ పనుల్లో పాల్గొనే రైతు కుటుంబాల్లోని మహిళలు.. మహిళా కూలీలు.. మత్స్యకార కుటుంబాల్లో మహిళలు.. పశువులను పోషించుకుంటూ పొట్టపోసుకునే మహిళలు.. అంతేకాదు, అడవుల్లో దొరికే ఉత్పత్తులను సేకరించుకుంటూ జీవించే మహిళలు.. వీరంతా మహిళా రైతులే. స్వామినాథన్ కమిషన్ ఐదో నివేదిక ఇచ్చిన తర్వాత 2007లో మన దేశంలో రైతుల కోసం మొట్టమొదటిగా ప్రత్యేక విధానం రూపొందింది. అందులో రైతు అంటే చాలా విస్తృతమైన నిర్వచనం ఉంది. సొంత భూమిలో లేదా కౌలు భూమిలో పంటలు పండించేవారు, రైతు కూలీలు, మత్స్యకారులు, పశుపోషకులు, అడవుల మీద ఆధారపడి జీవించే వాళ్లు.. వీళ్లంతా రైతులే. అయితే, ఇప్పటికీ గ్రామీణ ప్రాంతానికెళ్లి ఈ ఇంట్లో రైతు ఎవరు అనగానే.. ఆ ఇంటామె ఎంత పని చేసినా కూడా మగవాళ్ల వైపు చూపెట్టడం సర్వసాధారణం.. రైతు అనగానే భూమిపై యాజమాన్య హక్కు ఉన్న వ్యక్తి మాత్రమే అనే తప్పుడు అభిప్రాయం ఉంది. ఎవరి పేరు మీద భూమి పట్టా ఉందో వారిని మాత్రమే రైతుగా గుర్తించడం వల్ల చాలామంది రైతులను మనం గుర్తించలేకపోతున్నాం. ఇలా గుర్తింపునకు నోచుకోలేకపోతున్న వారిలో కౌలుదారులున్నారు, మహిళా రైతులున్నారు...
‘టైమ్ పావర్టీ’ అంటే?
మహిళా రైతులకున్న పెద్ద దారిద్య్రం బొత్తిగా తీరిక లేకపోవడం. పొద్దున లేచి కుటుంబంలోని బాధ్యతలు, వ్యవసాయ పనులు వాళ్లే చేయాలి. వంట చేసే బాధ్యత వాళ్లదే కాబట్టి కుటుంబంలో అందరూ సరిగ్గా తిన్నారా? లేదా? ఆహార భద్రత అందుతున్నదా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఈవిడ మీదే పడుతుంది. పంటకాలమంతా మహిళా రైతులు పనిచేసినా కూడా మార్కెటింగ్ విషయం వచ్చేటప్పటికి మగ రైతులే తెరపైకి వస్తారు. అమ్ముకొని వచ్చిన తర్వాత ఆమెకి ఎంత చేతికి వస్తుందో కూడా తెలియదు. ఎంతోకొంత ఆమె చేతికొచ్చినా అది కుటుంబాన్ని నడిపించడం కోసమే ఖర్చుపెట్టాలన్నట్లుంటుంది. ఆదాయ వ్యయాలపైన ఆమెకు ఎటువంటి నియంత్రణా ఉండడం లేదు. చాలా అధ్యయనాల్లో తేలింది ఇదే..
మహిళా రైతులకు గుర్తింపు సమస్య సామాజికంగానూ, ప్రభుత్వపరంగానూ ఉందంటారా?
రెండు విధాలా ఉంది. సామాజికంగా చూస్తే.. వ్యవసాయ పనుల్లో తలమునకలయ్యే ఒక మహిళ తనను తాను రైతుగా గుర్తించుకోలేకపోవడం దగ్గరి నుంచి మొదలవుతుంది సమస్య. వాళ్లు గుర్తించరు, వారి కుటుంబాల్లో మగవాళ్లు గుర్తించరు, సమాజం గుర్తించదు. ప్రభుత్వపరంగా చూస్తే.. పహాణీ రికార్డులో భూమి పట్టాదారుతోపాటు సాగుదారు ఎవరని వేరే కాలమ్ ఉంటుంది. సాధారణంగా మగ రైతే పట్టాదారై ఉంటారు. సాగుదారు కూడా ఆయన పేరే రాస్తున్నారు. సాగుదారుగానైనా ఆ రైతు భార్య పేరు రాస్తే.. ఆమె పేరిట బ్యాంకు రుణం వచ్చే అవకాశం ఉంటుంది. పంట నష్టపోతే ఆమె బీమా పరిహారం పొందే హక్కుంటుంది. పంట నూర్చాక తన పేరు మీదే అమ్ముకునే అవకాశం ఉంటుంది..
పట్టాదారుడైన రైతు భార్య పేరును రెవిన్యూ రికార్డుల్లో సాగుదారుగా రాయిస్తే మహిళా రైతుల శ్రమకు గుర్తింపు వస్తుందా?
మన దేశంలో ఏ ప్రాంతంలోనైనా.. ప్రతి ఎకరంలోనూ జరిగే వ్యవసాయ పనుల్లో మగ వాళ్లకన్నా మహిళలే ఎక్కువ సేపు పనిచేస్తున్నారు. నాట్లు.. కోతలు.. విత్తనాలు జాగ్రత్త చేయడం.. ఇలా ప్రతి పనిలోనూ మహిళల పాత్రే ఎక్కువ. కొన్ని పంటల్లో అయితే పురుషులు పనిచేసే రోజుల (మేల్ డేస్) కన్నా మహిళలే ఎక్కువ రోజులు పనిచేస్తారు. అందుకే.. ఒకవేళ మహిళా రైతుల శ్రమను, వారి అస్థిత్వాన్ని కనుక మనం అధికారికంగా గుర్తించదలచుకుంటే.. భర్త పేరుతో పట్టా ఉన్నప్పుడు భార్య పేరును సాగుదారుగా రాయమంటున్నాం. ఎందుకంటున్నామంటే.. మహిళా రైతులు రోజూ పొలానికెళ్లి పనిచేస్తారు. తమ కుటుంబ ఆస్తి అయిన పొలాల్లోనే కూలి పని చేసినట్లు అయిపోతోంది. వారి శ్రమకు గుర్తింపు దొరకడం లేదు.
పొలం పనులకు కూలికి వచ్చే మహిళలకైనా ఏ రోజు కూలి డబ్బు ఆ రోజు వస్తుంది. మహిళా రైతులు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వారి చేతుల్లోకి వస్తుందో లేదో కూడా తెలియదు. ఉత్తమ సేంద్రియ రైతులుగా పేరు తెచ్చుకుంటున్న వారి పొలాల్లో కూడా నిజానికి అతని భార్య లేదా తల్లి నిరంతరం పనిచేస్తుంటారు. కానీ, పేరు వీళ్లకొస్తుంది. రైతు సంఘాల పోరాటాల్లో పాల్గొనే నేతలు కూడా ఆ పని చేయగలుగుతున్నారంటే కుటుంబంలోని మహిళా రైతు క్షేత్రస్థాయిలో తెరవెనుక ఉండి అందించే తోడ్పాటే కారణం. వాళ్లకో గుర్తింపు ఇవ్వాలి. వాళ్ల పనిని తగ్గించగలగాలి. అప్పుడు తమ సాధికారత కోసం వేరే మార్గాలు వెతుక్కోగలుగుతారు.. ఇదీ మేం చెబుతున్నది. సవాలక్ష బాధ్యతల మధ్య బొత్తిగా తీరిక లేకపోవడం (సమయాభావ దారిద్య్రం లేదా టైమ్ పావర్టీ) అనేది మహిళా రైతులకున్న పెద్ద సమస్య...
మహిళా రైతుల సంక్షేమం కోసం మీరు కోరుతున్నదేమిటి?
భారతీయ మహిళల స్థితిగతులపై కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ నియమించిన జాతీయ ఉన్నత స్థాయి కమిటీలో గ్రామీణ మహిళల పక్షాన నేను సభ్యురాలిగా ఉన్నాను. వివిధ రాష్ట్రాలకు వెళ్లి అధ్యయనం చేసి, పరిశోధన చేసి నివేదిక అందించాం. మహిళా రైతులకు సంబంధించి ముఖ్యంగా 4 అంశాలను ప్రస్తావించాను. మహిళా రైతులకు (అస్థిత్వ) గుర్తింపు ఇవ్వాలనేది ఒక మాట. వనరులపై హక్కులు ఎలాగైనా కల్పించాలనేది రెండో మాట. వీళ్లకు భూమిపై హక్కున్నా, లేకపోయినా.. మగ రైతులతో సమానంగా సేవలు పొందే హక్కుండాలి. ఇప్పుడు.. వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన చేస్తున్నప్పుడు ఇది మహిళా రైతులకు ఎంత మేరకు పనికొస్తుంది అని ఆలోచిస్తున్నదా? కొత్త విత్తన రకం తయారు చేస్తున్నప్పుడో.. కొత్త యంత్రం తయారు చేస్తున్నప్పుడో ఇవి ఉపయోగమేనా అని మహిళా రైతులను అడుగుతున్నారా? విస్తరణాధికారులు గ్రామాల్లోకి వస్తే మహిళా రైతులతో మాట్లాడతారా? మహిళా రైతులకు శిక్షణ ఇస్తారా? ఇప్పుడు మగ రైతులకు అందుతున్న ఈ సంస్థాగత సేవలతో సమానంగా మహిళా రైతులకు అందించాలి. ఇక నాలుగోది.. వ్యవసాయానికి సంబంధించి విధాన నిర్ణయాలు తీసుకునే అన్ని కమిటీల్లోనూ మహిళా రైతులకు చోటు కల్పించాలి. చోటు కల్పించిన వెంటనే వాళ్లు మాట్లాడలేకపోవచ్చు. కానీ, కొన్నాళ్ల తర్వాతయినా తమకు ఉపయోగపడే పనుల గురించి నోరెత్తి అడిగే పరిస్థితి వస్తుంది.
మహిళా రైతుల సాధికారతతో సాగు సంక్షోభం తగ్గుతుందా?
మహిళా రైతులను మగ రైతులతో పాటు సమానంగా హక్కులు కల్పించి నట్ట్టయితే పంటల ఉత్పాదకత 25-40 శాతం మేరకు పెరుగుతుందని తేల్చిచెప్పిన అంతర్జాతీయ స్థాయి అధ్యయనాలున్నాయి. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించాలనుకున్నా.. గ్రామీణ మహిళల అభ్యున్నతికి పాటుపడమని చెప్తున్న అధ్యయనాలున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో మహిళా రైతుల స్థితిగతులేమిటి?
మహిళా రైతుల సాగుబడిలో ఉన్న కమతాల (ఫిమేల్ ఆపరేషనల్ హోల్డింగ్స్) సంఖ్య దేశవ్యాప్తంగా 12 శాతం ఉంటే.. ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. 2011 నాటి వ్యవసాయ గణాంకాల ప్రకారం.. ఇది తెలంగాణలో 34 శాతం కాగా, ఆంధ్రప్రదేశ్‌లో 28 శాతంగా ఉంది. కేరళ, తమిళనాడు, కర్ణాటకల్లో కూడా ఇంతకన్నా తక్కువగానే ఉన్నాయి. ఈ లెక్కలు చూసి అంతాబాగుందని అనుకోలేం. వీరిలో పట్టాదారులు తక్కువ. ఆదాయాలు తగ్గిపోతుండడంతో మగవాళ్లు వ్యవసాయాన్ని వదిలేస్తుండడంతో ఆ భారం ఎక్కువగా మహిళల భుజాలపై పడుతున్న ధోరణి (ఫెమినైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్) తెలుగు రాష్ట్రాల్లో ప్రబలంగా కనిపిస్తోంది. కౌలు సేద్యం విస్తరించడం, చిన్న, సన్నకారు కమతాలకు వర్తించే సంక్షేమ పథకాలు ఎక్కువగా ఉండటం, మహిళా రైతులకు రాయితీ పథకాలు ఉండటం ఇందుకు దోహదం చేసి ఉంటాయి. మహిళల సాధికారత కోసం కాకుండా.. ప్రభుత్వ సబ్సిడీలను అధికంగా రాబట్టడం కోసం మహిళలకు భూమి హక్కు ఇస్తున్న పరిస్థితి ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో మహిళా రైతుల సాగుబడిలో ఉన్న కమతాల సంఖ్య ఎక్కువగా ఉన్నందు వల్ల ఉత్పాదకత పెరిగిందా..?
మహిళా రైతులకు భూమి హక్కుతో పాటు మగ రైతులకు సమానంగా ఇతర ప్రోత్సాహకాలు కల్పిస్తే మహిళలు ఇంకా బాగా చేయగలుగుతారు. మరింత సమర్థవంతంగా నిర్వహించే సామర్థ్యం మహిళలకు ఉంది. తెలుగు రాష్ట్రాల్లో సాగుదారులుగా నమోదైన మహిళల్లో కౌలుదారులే ఎక్కువ కనిపిస్తున్నారు. వీళ్లకు భూమి హక్కు కల్పించి, ఇతర సపోర్ట్ సిస్టమ్స్ అభివృద్ధి చేయాలి. పితృస్వామిక వ్యవస్థ కల్పించిన ఆంక్షలూ తొలగాలి. ఆ పరిస్థితుల్లో పంటల ఉత్పాదకత కూడా పెరుగుతుంది.
ప్రకృతి/ సేంద్రియ సేద్యం మహిళా రైతులకు తోడ్పడుతుందా?
తప్పకుండా. ప్రకృతి వ్యవసాయంలో విష రసాయనాల వాడకం ఉండదు కాబట్టి, మహిళా రైతులు, కూలీలకు ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి. రసాయనిక పురుగుమందులు, కలుపు మందులు చల్లిన తర్వాత చాలా రోజుల పాటు ఆ విష ప్రభావం ఉంటుంది. పొలాల్లో ఎక్కువ సేపు పనిచేసేది మహిళలే కాబట్టి వీరంతా గాలి ద్వారా, చర్మం ద్వారా విష ప్రభావానికి గురవుతున్నారు. ప్రకృతి వ్యవసాయంలో పంటల జీవవైవిధ్యం ఉంటుంది కాబట్టి.. మహిళల పాత్ర వ్యవసాయంలో మరింత కీలకంగా మారుతుంది. సహజాహారంతో కుటుంబ ఆరోగ్యం బాగుపడితే మహిళలపై భారం తగ్గుతుంది. అయితే, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం అంటే ఇందుకోసం రూ. పది కోట్లో రూ. వంద కోట్లో ఖర్చుపెట్టడంతోనే పని పూర్తవదు. రసాయనిక ఎరువులు, విషరసాయనాల వాడకాన్ని అత్యంత కఠినంగా అదుపు చేయాలి. సిక్కిం అదే చేసింది. కేరళ ప్రభుత్వం అతి ప్రమాదకరమైన పురుగుమందుల లెసైన్స్‌లు రద్దు చేసింది. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం అనివార్యం. వినియోగదారుల్లో కూడా చైతన్యం కలిగించడం, ప్రత్యేక మార్కెటింగ్ వ్యవస్థను నిర్మించడం అంతే అవసరం. అయితే, వ్యవసాయ సంక్షోభం తీరాలంటే ప్రభుత్వాలు మొదట రైతులకు ఆదాయ భద్రత కల్పించడంపై పూర్తిస్థాయి దృష్టిని కేంద్రీకరించాల్సి ఉంది.
కురుగంటి కవిత
(kavitakuruganti@gmail.com)
ఇంటర్వ్యూ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్