మహిళా మెజిస్ట్రేట్‌కు ఉద్వాసన
తిరువొత్తియూరు మెజిస్ట్రేట్ కోర్టు మహిళా న్యాయమూర్తి
జయసూర్యకు ఉద్వాసన పలికారు. అవినీతి ఆరోపణలపై సాగిన
విచారణలో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
సాక్షి, చెన్నై : చెన్నై తిరువొత్తియూరు అప్పాస్వామి ఆలయం వీధిలో మెజిస్ట్రేట్ కోర్టు ఉంది. ఇక్కడ మహిళా న్యాయమూర్తిగా జయ సూర్య రెండు సంవత్సరాలుగా పనిచేస్తూ వచ్చారు. ఇటీవలి కాలంగా ఆమెపై ఆరోపణలు బయలు దేరాయి. కేసుల వ్యవహారంలో, నిర్ణయాలు, తీర్పులు, బెయిల్ తదితర విషయాల్లో అవినీతి చోటు చేసుకుంటున్నట్టుగా బయలు దేరిన ఈ ఆరోపణలు హైకోర్టుకు సైతం చేరాయి. హైకోర్టు రిజిస్ట్రార్‌కు సెషన్స్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి, జిల్లా మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తుల ద్వారా నివేదికలు చేరి ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో శుక్రవారం హఠాత్తుగా సెషన్స్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి భవతారణి, జిల్లా మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి జయచంద్రన్ తిరువొత్తియూరు కోర్టులో పరిశీలనలు నిర్వహించారు.
పొద్దు పోయే వరకు ఈ పరిశీలన, తనిఖీలు సాగి ఉన్నాయి. ఇందులో మహిళా న్యాయమూర్తి అవినీతి బండారం వెలుగులోకి వచ్చి ఉన్నది. పలు కేసుల్లో అవినీతి దొర్లి ఉన్నట్టు తే లడంతో పాటుగా ట్రెజరీకి పంపించాల్సిన జరిమానాల్లోనూ చేతి వాటం చూపించినట్టు తేలింది. అలాగే, కోర్టు వ్యవహారాల్లో నిర్లక్ష్యం, అలసత్వం, అవినీతి తాండవం చేసి ఉన్నట్టుగా గుర్తించి ఉన్నారు. ఈ తనిఖీల అనంతరం రాత్రి పొద్దు పోయాక, ఆమెకు ఉద్వాసన పలుకుతూ నిర్ణయం తీసుకుని ఉన్నారు. ఈ నిర్ణయం శనివారం ఉదయం తిరువొత్తియూరు కోర్టుకు చేరింది. జయ సూర్యను తాత్కాలికంగా తొలగిస్తూ, ఆ కోర్టు వ్యవహారాల బాధ్యతలను పూందమల్లి కోర్టు న్యాయమూర్తికి అదనంగా అప్పగించారు. మహిళా న్యాయమూర్తి అవినీతి ఊబిలో కూరుకు పోయి పదవిని కోల్పోయిన సమాచారం న్యాయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.