8,9 తేదీల్లో సీఎం పర్యటన
ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
నక్కపల్లి: ఈనెల 8,9 తేదీల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా పర్యటన ఖరారైందని జిల్లా కలెక్టర్ యువరాజ్ తెలిపారు. తొమ్మిదో తేదీన నక్కపల్లి చినజీయర్‌స్వామినగర్‌లో ముఖ్యమంత్రి పాల్గొనే మహిళా సదస్సు వేదిక ఏర్పాట్లను ఆదివారం కలెక్టర్ పరిశీలించారు.
సభా నిర్వహణపై స్థానిక అధికారులకు తగు సూచనలు చేశారు. 8వ తేదీన జరిగే అంతర్జాతీయ గిరిజిన దినోత్సవంలో సీఎం పాల్గొంటారని ఈ దినోత్సవం ఎక్కడ జరిపేదీ త్వరలో నిర్ణయిస్తామని తెలిపారు. తొమ్మిదో తేదీన ఉపమాక వేంకటేశ్వరస్వామిని చంద్రబాబునాయుడు దర్శించుకుంటారని, అనంతరం మహిళా సదస్సులో పాల్గొంటారని తెలిపారు. కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, డీఆర్డీఏ పీడీ సత్యసాయిశ్రీనివాస్, సీఈవో మహేశ్వరరెడ్డి, ఆర్డీవో సూర్యారావు, తహశీల్దార్ జగన్నాథరావు పాల్గొన్నారు.
ఉగ్గినపాలెంలో స్థల పరిశీలన
కశింకోట: మండలంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటనకు అనువైన ప్రాంతాలను ఎంపిక చేయడానికి ఆదివారం జిల్లా కలెక్టర్ యువరాజ్ పరిశీలించారు. ఉగ్గినపాలెం వద్ద అమలోద్భవి హోటల్ వద్ద ఖాళీ మైదానాన్ని, తాళ్లపాలెంలోని ఎస్సీ హాస్టల్ పక్కనున్న స్థలాన్ని పరిశీలించారు. సుమారు రెండు వేల మంది రైతులు, డ్వాక్రా మహిళలతో ముఖ్యమంత్రి ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించాలని యోచిస్తూ స్థలాలను తనిఖీ చేశారు.
అలాగే హెలిపాడ్ కోసం కూడా స్థల పరిశీలన చేశారు. ఆయన వెంట ఆర్డీఓ వసంతరాయుడు, తహసీల్దార్ కె.రమామణి, దేశం పార్టీ నేతలు పాల్గొన్నారు.