హైదరాబాద్‌లో ఎన్నెన్ని వింతలో.. !
సాక్షి, హైదరాబాద్: చినుకు పడితే.. వణికిపోయే పరిస్థితి హైదరాబాద్ వాసిది. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు నగరవాసులకు చుక్కలు చూపించాయి. ప్రత్యక్ష నరకమంటే ఎలా ఉంటుందో రుచిచూపించాయి. వరుస వర్షాలు.. ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ట్రాఫిక్ జామ్‌లు, చెరువులను తలపిస్తున్న రోడ్లు, నీటమునిగిన కాలనీలు.. పాలకులు భాగ్యనగరాన్ని విశ్వనగరం చేస్తామని చెప్తున్నా.. చిన్న వానలకే అతలాకుతలం అయ్యే పరిస్థితి నెలకొంది.
తాజా వర్షాలకు నగరంలో పలు వింతలు చోటుచేసుకున్నాయి. నగరం రోడ్ల మీద ఎప్పుడైనా పడవల్లో ప్రయాణించారా? కానీ ఆ లోటును తాజా వర్షాలు తీర్చాయి. సరదాగా కాకపోయినా తాజా వానలకు పడవలో తప్ప బయట కాలుపెట్టలేని పరిస్థితి. దీంతో నీటిమునిగిన రామాంతపూర్లాంటి పలు ప్రాంతాల్లో సిటీ జనులు పడవల్లో బయటకు వచ్చారు. ఎప్పుడూ వాహనాలతో రద్దీగా ఉండే సిటీ రోడ్లపై పడవల్లో ప్రయాణిస్తూ.. 'ఇదేమీ లాహిరి.. ఇదేమీ అలజడి' అంటూ పాడుకున్నారు. అక్కడెక్కడో ఉన్న వెనీస్ నగరం హైదరాబాద్‌కు వచ్చేసినట్టు ఫీలయ్యారు.
ఒకే రోజు.. నాలుగు కాలాలు!
కాలం మారింది. కాలాలు మారిపోయాయి. ఒకప్పుడు వానకాలం తర్వాత చలికాలం, చలికాలం తర్వాత ఎండాకాలం వరుసగా వచ్చేవి. కానీ, ఇప్పుడిది కలికాలం కదా.. అన్నీ ఒకే రోజు కనిపిస్తున్నాయని నగరవాసులు చమత్కరిస్తున్నారు. తాజా వర్షాలకు నగర వాతావరణంలో గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఉదయం చలి, మధ్యాహ్నం ఎండ, సాయంత్రం వర్షాలు.. ఇలా భిన్నమైన పరిస్థితి.. ఇలా ఒకే రోజు భిన్న కాలాలు చూసే అదృష్టం హైదరాబాద్‌లోనే ఉంటుందంటూ నెటిజనులు.. సోషల్ మీడియాలో, వాట్సాప్‌లో జోకులు పేలుస్తున్నారు. నగరంలో ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు వసంతకాలం, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎండాకాలం, సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల వరకు వర్షాకాలం, రాత్రి 10 గంటల ఉదయం 6 గంటల వరకు చలికాలం.. ఇలా ఒకేరోజు నాలుగు కాలాలను చూసే అదృష్టం నగరవాసికి దొరుకుతుందని ఛలోక్తులు విసురుతున్నారు.