భారతీయ సంతతికి చెందిన వ్యక్తికి మరణశిక్ష
సింగపూర్: మత్తుమందును అక్రమ రవాణా చేస్తున్న కేసులో భారతీయ సంతతికి చెందిన ప్రభాకరన్ శ్రీ విజయన్‌పై నేరం రుజువు అయింది. ఈ నేపథ్యంలో అతడికి మరణశిక్ష విధిస్తూ సింగపూర్ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ మేరకు స్థానిక మీడియా మంగళవారం తెలిపింది. మలేషియా జాతీయుడైన ప్రభాకరన్ శ్రీ విజయన్ 2012లో తన కారులో దాదాపు 25 కేజీల మత్తుమందు మలేసియా జోహర్ బారు నుంచి అక్రమంగా తరలిస్తున్నాడు. కాగా ఉడ్‌ల్యాండ్ చెక్‌పోస్ట్ సమీపంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా అతడి కారులో భారీగా మత్తు మందు ఉన్నట్లు గుర్తించారు.
మత్తుమందును స్వాధీనం చేసుకుని... అతడిని అరెస్ట్ చేశారు. అనంతరం అతడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. దీంతో దాదాపు రెండేళ్లు విచారణ అనంతరం నిందితుడికి జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. 15 కేజీల మించి ఎవరైనా మత్తుమందు అక్రమ రవాణా చేస్తే సింగపూర్ కోర్టు మరణశిక్ష విధించే సంప్రదాయం ఉన్న సంగతి తెలిసిందే. మలేసియాలో ప్రభాకరన్ పెట్రోల్ బంకులో పని చేస్తున్నాడని మీడియా తెలిపింది.