వితరణ శీలి..
బఫెట్..
ఇది పేరు మాత్రమే కాదు..
కార్పొరేట్ ప్రపంచంలో ఒక బ్రాండ్
ఇంత సంపాదించినా బఫెట్ ఉండేది మాత్రం 1956లో ఒమహాలో తాను కొన్న ఇంట్లోనే. అప్పట్లో 40వేల డాలర్లకు కొన్న ఆ ఇంట్లోనే నిరాడంబరంగా జీవిస్తుండటం మరొకరికి సాధ్యం కాదేమో!!
ఇన్వెస్ట్మెంట్ గురు అన్నా... దాన కర్ణుడన్నా... ఏదన్నా బఫెట్టే. తండ్రి హోవార్డ్ బఫెట్ ఓ స్టాక్‌బ్రోకర్. ఎంపీ కూడా. తల్లి లీలా స్తాల్. 1930లో నెబ్రాస్కాలోని ఒమహాలో పుట్టిన బఫెట్... 26 ఏళ్లకే పార్ట్నర్షిప్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేయటంతో పాటు 35 ఏళ్లకల్లా బెర్కషైర్ హాతవేను తన నియంత్రణలోకి తెచ్చుకున్నారు. మీడియా, బీమా, ఎనర్జీ, ఆహార - శీతల పానీయాల రంగాల్లో భవిష్యత్తును ఊహించి చేసిన పెట్టుబడులు... ఆయన్ను ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిని చేశాయి. ఆ సంపదే ఆయన్ను గొప్ప వితరణశీలిగా మార్చింది. అందుకే... వ్యాపార ప్రపంచంలో అందరూ గౌరవించే వ్యక్తి బఫెట్.
11 ఏళ్లకే ఇన్వెస్ట్మెంట్ మొదలెట్టిన బఫెట్.. తండ్రి బ్రోకింగ్ సంస్థలో సిటీస్ సర్వీస్ షేర్లు మూడింటిని 38 డాలర్ల వద్ద కొన్నారు. వెంటనే అది 27 డాలర్లకు పడిపోయింది. కానీ ఓపిగ్గా ఎదురుచూశారు. చివరికి 40 డాలర్ల వద్ద అమ్మి కాస్త లాభం సంపాదించారు. అయితే అది 200 డాలర్లకు వెళ్లినపుడు... ఆ లాభాన్ని సొమ్ము చేసుకోనందుకు బాధపడ్డారు. మార్కెట్లో ఓపిక ఎంత ముఖ్యమో చెప్పటానికి దీన్నొక ఉదాహరణగా చెబుతారాయన.
ఈ సహనమే ఆయన బెర్కషైర్ సామ్రాజ్యాన్ని రూ.11.5 లక్షల కోట్ల వార్షికాదాయం, 3 లక్షలకు పైగా ఉద్యోగుల స్థాయికి చేర్చింది. అటు ఆయన ప్రారంభించిన ‘వితరణ ఉద్యమం’ ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచంలో ఉద్యమం స్థాయికి చేరుకుంది. తన సంపదలోంచి ఏకంగా 83 శాతాన్ని (30.7 బిలియన్ డాలర్లు) విడతల వారీగా బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్‌కు ఇస్తానని 2006లో ప్రకటించారు. వేరొక సందర్భంలో తన సంపదలో 99 శాతాన్ని దాతృత్వానికే ఖర్చు చేస్తానని కూడా చెప్పారాయన.
ప్రపంచ దాతృత్వ సూచీలో మనమెక్కడ? (ర్యాంకుల వారీగా)
వరల్డ్ గివింగ్ ఇండెక్స్ అనేది ఓ వార్షిక నివేదిక. సమాచారాన్ని సేకరించేది మాత్రం గ్యాలప్ పోల్ ద్వారానే. 1000కి పైగా ప్రశ్నలతో రూపొందించిన పత్రాన్ని 140కిపైగా దేశాల్లో శాంపిల్ పద్ధతిలో అన్ని వర్గాల ప్రజల ముందూ ఉంచి సమాధానాలు రాబట్టే పోల్ ఇది. దీని ఆధారంగా చారిటీస్ ఎయిడ్ ఫౌండేషన్ (సీఏఎఫ్) తొలిసారి 2010లో ఈ నివేదికను విడుదల చేసింది. తాజాగా ఈ ఏడాది విడుదల చేసిన నివేదికలో మన స్థానం ఏకంగా 106. మన పక్కనున్న మరో అగ్రదేశం చైనా స్థానం 144. ఈ జాబితాలోని టాప్-10 దేశాలివీ...
దాతృత్వానికీ ఓ లెక్కుంది!
అమెరికానే కాదు. ప్రపంచమంతటా ఒకటే తీరు. దానం చేస్తే పదిమందికీ తెలియాలి. ఆలయాల నుంచి షాదీఖానాల వరకూ అదే తీరు. ఇక పైస్థాయిలో వర్సిటీల నుంచి మ్యూజియంలలో కూడా ఈ ధోరణి కనిపిస్తుంది. అంతెందుకు! రోడ్డు పక్కనున్న చిన్న పార్కును నిర్వహిస్తున్న కార్పొరేట్ సంస్థ పేరు... అక్కడే పెద్ద బోర్డుపై కనిపిస్తుంది. ఈ ధోరణి కాస్త ఎక్కువ కావటంతో విమర్శలొచ్చిన కొన్ని సంఘటనలు చూద్దాం...
►న్యూయార్క్‌లోని లింకన్ సెంటర్‌కు చెందిన అవెరీ ఫిషర్ హాల్‌ను నవీకరించటానికి న్యూయార్క్ వ్యాపారవేత్త డేవిడ్ గెఫెన్ 100 మిలియన్ డాలర్లిచ్చారు. అయితే అవెరీ ఫిషర్ హాల్ పేరును డేవిడ్ గెఫెన్ హాల్‌గా మార్చాలని షరతు పెట్టారాయన. మరి 1994లో మరణించిన దాత ఫిషర్ సంగతేంటి? ఆ పేరును మార్చేస్తే ఫిషర్ ఫ్యామిలీ ఊరుకుంటుందా? లింకన్ సెంటర్ యాజమాన్యం ఫిషర్ కుటుంబీకులతో బేరం పెట్టింది. చివరకు 15 మిలియన్ డాలర్లకు వారు నిరభ్యంతరం చెప్పారు. అలా ఫిషర్ పేరు చెరిగిపోయి ఆ హాలుకు గెఫెన్ పేరొచ్చింది. ఉన్న పేరును మార్పించేసి మరీ తన పేరు పెట్టుకున్న గెఫెన్ దానికి విరాళమిచ్చినట్లు లేదని, వేలంలో కొనుక్కున్నట్టే ఉందని విమర్శకులంటున్నారు.
► సిటీ గ్రూప్ మాజీ సీఈఓ స్టాన్ఫోర్డ్ వీల్ భార్య జోవన్ వీల్ది మరీ చిత్రమైన విరాళం. ఆమె న్యూయార్క్‌లోని పాల్ స్మిత్ కాలేజీకి 20 మిలియన్ డాలర్ల విరాళమిస్తానన్నారు. కాలేజీ పేరును జోవన్ వీల్ -పాల్స్మిత్ కాలేజీగా మార్చమన్నారు. యాజమాన్యం సరేనంది. ఇది ఒకరకంగా లంచం ఇవ్వటమేనని, కాలేజీ చరిత్రను వంచించటమని పూర్వ విద్యార్థులు గోలపెట్టారు. కోర్టుకూ వెళ్లారు. పేరు మార్చటానికి వీల్లేదని కోర్టు స్పష్టం చేయటంతో... విరాళం ఇవ్వకూడదని జోవన్ వీల్ నిర్ణయించారు. పాల్ స్మిత్ కాలేజీ విద్యార్థులంతా ఫేస్బుక్లో ఈ డీల్‌ను ఎండగట్టారు.