వీరేందర్‌కు స్వర్ణం
న్యూఢిల్లీ: విశ్వ క్రీడల్లో రెజ్లింగ్ భారత్‌ను మరోసారి ఆదుకుంది. గత శనివారం బల్గేరియాలోని సోఫియాలో ముగిసిన డెఫిలింపిక్స్ (బధిరుల ఒలింపిక్స్) క్రీడల్లో భారత్‌కు లభించిన ఏకైక పతకం రెజ్లింగ్ నుంచి వచ్చింది. పురుషుల 74 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో వీరేందర్ సింగ్ పసిడి పతకాన్ని గెల్చుకున్నాడు. ఫైనల్లో అతను టర్కీకి చెందిన ఒగుజ్ డొండెర్‌ను ఓడించాడు. లండన్ ఒలింపిక్స్‌లో పతకాలు నెగ్గిన స్టార్ రెజ్లర్లు సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్‌లతో కలిసి ఢిల్లీలోని ఛత్రశాల స్టేడియంలో వీరేందర్ సాధన చేస్తుంటాడు.
ఈ ప్రత్యేక ఒలింపిక్స్‌లో 28 ఏళ్ల వీరేందర్ పతకం నెగ్గడం ఇది వరుసగా మూడోసారి కావడం విశేషం. 2005 మెల్బోర్న్ డెఫిలింపిక్స్‌లో వీరేందర్ స్వర్ణం సాధించగా... 2009 చైనీస్ తైపీ డెఫిలింపిక్స్‌లో కాంస్యం నెగ్గాడు. హర్యానా పవర్ కార్పొరేషనల్లో గుమాస్తాగా పని చేస్తున్న వీరేందర్ 2008 ప్రపంచ బధిరుల చాంపియన్‌షిప్‌లో రజతం గెలిచాడు.