శాతవాహనులు.. సామాజిక, సాంస్కృతిక చరిత్ర
మత్స్యపురాణం ప్రకారం శాతవాహనులు 19 మంది రాజులు. ఈ రాజ్య స్థాపకుడు సిముకుడు తన నాణేలపై ఒక వైపు ఏనుగు బొమ్మ, మరోవైపు ఉజ్జయిని ముద్రలను ముద్రించాడు. ఇతని పాలనను వ్యతిరేకిస్తూ ప్రజలు తిరుగుబాటు చేసి చంపేశారని జైన మత గ్రంథాలు తెలుపుతున్నాయి. తర్వాత కన్వ లేదా కృష్ణుడు దక్షిణ భారతదేశంలో భాగవతం మతాన్ని స్థాపించాడు. ఇతను శ్రావణుల కోసం నాసిక్‌లో ఒక గుహాలయం నిర్మించాడు.
మొదటి శాతకర్ణి:
మత్స్యపురాణం మొదటి శాతకర్ణిని మల్లకర్ణిగా పేర్కొంది (మత్స్య పురాణానికి వ్యాఖ్యానం రాసింది- యజ్ఞశ్రీ శాతకర్ణి, 27వ రాజు). ఇతని కాలంలో మగధలో చివరి మౌర్య రాజు బృహద్రదుడుని అతని సేనాని పుష్యమిత్రుడు చంపి శుంగ రాజ్యాన్ని స్థాపించాడు. మొదటి శాతకర్ణి కాలంలో శాతవాహనులు స్వతంత్రులుగా మారారు. ఇతను.. మారాఠా రాజు ఖ్యాకైరో కుమార్తె దేవినాగానిని వివాహం చేసుకున్నాడు. తొలిసారి దక్కన్ రాజ్యంలో అశ్వమేధ యాగాలు నిర్వహించాడు. దీంతో అతణ్ని ‘దక్షిణాపథపతి’ అని పిలిచేవారు. మొదటి శాతకర్ణి తర్వాత వరుసగా పూర్ణోత్సంగ, స్కందస్తంబి పరిపాలించారు. తర్వాత రెండో శాతకర్ణి రాజ్యానికి వచ్చాడు. ఇతడు సుదీర్ఘ కాలం 56 సంవత్సరాలు పరిపాలించాడు. ఇతడు ఒడిశా/కళింగ, పాటలీపుత్రం ప్రాంతాలను జయించినట్లుగా ఆనందుడు అనే కవి పేర్కొన్నాడు. ఇతని తర్వాత వరుసగా లంబోదరుడు, అప్పీలకుడు, మేఘస్వాతి, స్వాతి, స్కందస్వాతి, మృగేంద్రుడు రాజ్యానికి వచ్చారు. మృగేంద్రుడి కాలంలోనే బేత్లేహాంలో ఏసుక్రీస్తు జన్మించాడు (ఏసుక్రీస్తుకు సమకాలీకుడుగా మృగేంద్రుడు ప్రసిద్ధి).
కుంతల శాతకర్ణి (13వ రాజు):
కుంతల శాతాకర్ణి ఆస్థానంలోని వాత్సాయనుడు కామసూత్ర అనే గ్రంథాన్ని (దీన్ని ప్రపంచంలోని 57 భాషల్లోకి అనువాదం చేశారు) రాశాడు. ఈ గ్రంథంలో 64 కళలు ముఖ్యంగా సంగీతం, చిత్రలేఖనం గురించి వివరణ ఉంది. ఇతనితర్వాత పులోమావి-1 పాలనలోకి వచ్చాడు. ఇతనికి కవివత్సలుడు అనే బిరుదు ఉంది (ఈ బిరుదు హాలునికి కూడా ఉంది). ఇతడు పాటలీపుత్రంపై దాడిచేసి మగధ, తెలంగాణ, ఉత్తర మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, మాళ్వ ప్రాంతాలను తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు.పులోమావి-1 తర్వాత హాలుడు (ఇతనికి కవివత్సలుడు అనే బిరుదు కలదు) రాజ్యానికి వచ్చాడు. ఇతడు 17వ శాతవాహన రాజు. ఇతడు గొప్పకవి. గాథాసప్తశతి అనే గ్రంథాన్ని ప్రాకృత భాషలో రాశాడు.
దీనిలో 700 కథలు ఉన్నాయి. ఇందులో తెలంగాణలోని గ్రామీణ కథల గురించి పూర్తి వివరాలను పేర్కొన్నాడు. హాలుని వివాహం లీలావతితో ద్రాక్షారామంలో జరిగిందని కుతూహాలుడు తన గ్రంథంలో పేర్కొన్నాడు. కాని ఇక్కడ గమనించాల్సిన అంశం.. ద్రాక్షారామం అంటే ప్రస్తుత రాజమండ్రి ప్రాంతాలోనిది కాదు. డాక్టర్ సంగన భట్ల నర్సయ్య చెప్పినట్లు కరీంనగర్ జిల్లాలోని ధర్మపురికి సమీపంలోని వేంపల్లి వెంకటరావు పేట దగ్గర గోదావరి తీరంలో ఉన్న భీమేశ్వరాలయం. ఇక్కడ గోదావరి ఏడు పాయలుగా చీలి ఉంటుంది. హాలుని తర్వాత వరుసగా మందూలక, పురేంద్ర సేన, సుందర శాతకర్ణి, చకోర శాతకర్ణి, శివస్వాతి పాలించారు. సుందర శాతకర్ణి కాలంలోనే క్షహారాట/క్షాత్రప/శక రాజ వంశీయులు భూమక నాయక త్వంలో సౌరాష్ట్ర, మాళ్వ, అజ్మీర్ భూభాగాలను ఆక్రమించి రాజ్య స్థాపన చేశారు. ఈ వంశంలో నహాపాణుడు గొప్పవాడు.
గౌతమీపుత్ర శాతకర్ణి:
గౌతమీ పుత్ర శాతకర్ణి విజయాలు గౌతమి బాలాశ్రీ నాసిక్ శాసనంలో ఉన్నాయి. సకూర రాజ్యం: రాజస్థాన్, శతగిరి: నాగార్జునకొండ. వైజయంతి: కర్నాటక రాజ్యాలను జయించినట్లుగా ఈ శాసనం పేర్కొంటుంది. ఏక బ్రాహ్మణ, క్షత్రీయ దర్పమాన, ద్విజకుల మర్దన మొదలైన బిరుదులు కూడా ఉన్నట్లు తెలుపుతుంది. తల్లి పేరుతో ‘మాతృసంజ’్ఞను ధరించాడు. బెనకటకంను నాసిక్ (మహారాష్ట్ర) ప్రాంతంలో నిర్మించి ‘గనబెనటక స్వామి’గా ప్రసిద్ధి చెందాడు. ‘జోగల్తంబి’ వద్ద ఇతని నాణేలు లభించాయి. నహాపాణుడుని ఓడించి అతని నాణేలను తిరిగి తన పేరుతో ముద్రించాడు. గౌతమీ పుత్రశాతకర్ణిని ‘పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ిసీ’ గ్రంథంలో గ్రీకు మాంబరస్గా ఒక గ్రీకు నావికుడు పేర్కొన్నాడు. తర్వాత రెండో పులోమావి (వశిష్ట పుత్ర పులోమావి-24వ రాజు), శివశ్రీ శాతకర్ణి (25వ రాజు), శివస్కంద శాతకర్ణి (26వ రాజు) పాలించారు.
యజ్ఞశ్రీ శాతకర్ణి:
27వ శాతవాహన రాజు. చివరి శాతవాహనులలో గొప్పవాడు. ఇతనికి ‘త్రిసముద్రాధిపతి’,‘నవనగరస్వామి’ అనే బిరుదులు ఉన్నాయని హర్షుడి ఆస్థానంలోని బాణుడు అనే కవి తన ‘కాదంబరి’ గ్రంథంలో పేర్కొన్నాడు. కాకులం-థాయిలాండ్, త్రి లింగా-బర్మా, తామ్రపర్ణి-శ్రీలంక, రజతక దేశం-అరకాన్ దేశాలతో సంబంధాలు కలిగి ఉన్నాడు. ఇతడు మత్స్యపురాణాన్ని క్రోడీకరించి బౌద్ధ మత వ్యాప్తికి తోడ్పడ్డాడు. అమరావతి స్థూపాన్ని, నాగార్జునకొండలోని మహా చైత్యాన్ని నిర్మించాడు. ఇతని కాలంలో బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని నిరసిస్తూ ‘చిత్తశుద్ధి’ అనే గ్రంథాన్ని ఆర్య దేవుడు రాశాడు. శాతవాహనులలో చివరి రాజు మూడో పులోమావి.
పాలనాంశాలు:
శాతవాహనుల పాలనకు కౌటుల్యుని అర్థ్ధశాస్త్రం,ఆపస్తంభ శాస్త్రం మార్గదర్శకంగా నిలిచాయి. రాజరికం పితృస్వామంపై ఆధారపడి ఉండేది. రాజ్యాన్ని ఆహారాలుగా విభజించారు. ‘నిగమసభ (పట్టణ పాలన), గుల్మిక (గ్రామ పెద్ద), అక్షపటాల’ (రాజు ఆదేశాలను అమలుచేసే అధికారి) పాలనలో ముఖ్యులు. వ్యవసాయంపై 1/6 వంతు అంటే 18 శాతం పన్ను విధించే వారు. రజువాహాక భూమిని సర్వేచేసే అధికారి. నిష్టి శేద్య బానిసలు, ఆద్యాంతిక, వర్తక సంఘాలు కూడా ముఖ్యపాత్ర పోషించేవి. ‘సుహానక’ స్వర్ణకారులు రోమ్ నుంచి వచ్చే బంగారంతో అనేక ఆభరణాలు చేసేవారు. బరుకచ్చ, సోపార, కళ్యాణి, కోరంగి, అరికరుడు మొదలైన ఓడరేవు కేంద్రాలు ఉండేవి. రాజభాగం, దేయమేయం ప్రధానమైన పన్నులు. వీటితోపాటు వృత్తి పన్నులు (కారుకర) కూడా విధించే వారు.
శాతవాహనులు కటక స్కందావారాన్ని (మిలటరీ క్యాంపులు) పోషించేవారు. వీరి కాలంలో అమరావతి ప్రసిద్ధ విద్యా కేంద్రం. నాగార్జున కొండలో విశ్వవిద్యాలయాన్ని నాగార్జునుడు స్థాపించాడు. నాగార్జునుడు రాసిన ‘ఆకుతోభయమనే’ వ్యాఖ్యానం ప్రసిద్ధి. సాంఖ్యశాస్త్రం, వైశేషిక శాస్త్రాలను ఖండిస్తూ ఆర్యదేవుడు చిత్తశుద్ది గ్రంథం రాశాడు. గుణాడ్యుడు తొలి తెలంగాణ కవి. ఇతడు బృహత్కథను పైశాచి ప్రాకృత భాషలో రాశాడు. దీనిలోని కథలు నైతిక విలువలతో కూడుకున్నవి. జైనం, బౌద్ధ్దం, శైవం, భాగవత మతాలను పోషించారు. బౌద్ధ్దంలో పూర్వ శైలులు, అపర శైలులు, ఉత్తర శైలులు, రాజగిరికలు, సిద్ధ్దార్దిక శైవులతోపాటు ప్రాజ్ఞావాదం, మోగాచార వాదం, జ్ఞానవాదం మొదలైన సిద్ధాంతాలు అభివృద్ధి చెందాయి. ప్రసిద్ధ ఫణిగిరి బౌద్ధ స్థూపం (నల్లగొండ జిల్లా) ఈ కాలం నాటిదే.
శిల్పకళ - చిత్రకళ:
శాతవాహనుల కాలంలో తెలంగాణాలో శిల్పకళ బాగా అభివృద్ధి చెందింది. నాగార్జున కొండ, కొండాపురం, గాజులబండతోపాటు, ఆంధ్రాలోని అమరావతి, జగ్గయ్యపేట, భట్టిప్రోలు, ఘంటసాల, గుడివాడ మొదలైన ప్రాంతాల్లో కూడా వీరి శిల్పకళ బాగా ప్రాచుర్యం పొందింది. శాతవాహనుల నిర్మాణాల్లో అనేక గదులు వరండాలతో కూడా ఉండేవి. నిద్రించడానికి వీలుగా రాతి బల్లలతో ‘విహారాలు’ నిర్మించారు. ఈ ‘విహారాలు’ (బౌద్ధ భిక్షువుల విశ్రాంతి మందిరాలు) చతురస్ర ఆకారంలో ఉంటాయి. వీటిలో గ్రీకు, రోమన్’ శిల్పకళ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. అంతేకాకుండా ‘పశు - పక్షాద్యులు’ చిత్రణ కూడా కనిపిస్తుంది. శాతవాహనుల కాలం నాటి బౌద్ధ శిల్పకళకు గౌతమీపుత్ర శాతకర్ణి ఎంతోసేవ చేశాడు. ‘సాంచీ’ స్థూపానికి ‘తోరణాలు’ చెక్కించాడు. తన తల్లి గౌతమి బాలాశ్రీ పేరిట ‘భదయ’నీయ గుహ విహారాన్ని బౌద్ధశాఖ సన్యాసుల కోసం చెక్కించాడు. అజంత గుహలో (పదో గుహ)ని శ్వేత గజం వీరి కాలం నాటిదే.
వాస్తు కళ:
‘చైత్యాలయాలు (బౌద్ధ పూజా మందిరాలు)’ నిర్మాణం లోనూ శాతవాహనుల ‘వాస్తు కళ’ను గమనించవచ్చు. నాగార్జునకొండ, కొండాపూర్‌లలో నిర్మించిన చైత్యాలయాల్లో అద్భుత వాస్తుకళ ఉన్నట్లు ‘ఫెర్గూసన్’ వ్యాఖ్యానించాడు. ఖమ్మం జిల్లాలోని ‘నేలకొండపల్లి’లో బయటపడిన కాల్చిన ఇటుకలతో చేసిన బౌద్ధ స్థూపం అన్నిటి కంటే పెద్దది. శాతవాహనుల కాలానికి చెందిన దాదాపు ‘150’ శాసనాలు మెదక్ జిల్లాలోని జహీరాబాద్, ఆంధోల్, సంగారెడ్డి, రామాయంపేటలో లభించాయి. నల్లగొండ జిల్లాలోని ‘ఫణిగిరి’లో అనేక బౌద్ధ స్థూపాలు బయట పడ్డాయి.
‘ఫణిగిరి’లో లభించిన బౌద్ధ స్థూపాల లక్షణాలు:
ప్రాకారంపై చెక్కిన జంతువుల శిల్పాలు
ద్వార స్తంభాలపైన చెక్కిన చక్రాలు, అంగుళీకాలు
ఉపరి భాగాన చెక్కిన తోరణాల మాదిరిగా కనిపించే యక్షులమూక
స్థూపంపైన వృత్తాకార, అర్ధవృత్తాకార పళ్లాల్లో ఉన్న
‘పద్మాలు’
కొండాపూర్, కోటిలింగాల, ఫణిగిరిల్లో లభించిన వస్తువులను బట్టి ‘చేతి పనుల్లో వారి నైపుణ్యం తెలుస్తుంది. కొండాపూర్‌లో సీసం, కంచు నాణేలు లభించాయి. ఈ ప్రదేశం చైత్యాలయాలకు, ఆరామ, విహారాలకు నిలయంగా ఉండేది. ఒక ‘టంకశాల’ను కూడా ఇక్కడ నిర్మించారు.
శాతవాహనుల అనంతర శిల్పకళ:
శాతవాహనులు ప్రాచుర్యం కల్పించిన ‘బౌద్ధ శిల్పకళను ’ తర్వాత వచ్చిన ఇక్ష్వాకులు ఉన్నతస్థితికి తీసుకెళ్లి బౌద్ధులకు స్వర్ణయుగంగా చేశారు. వీరికాలం నాటి శిల్పకళకు‘విజయపురి’కి ఉన్న ప్రాకారాలు, ఆగడ్త, కోటలోపలి పలు భవనాలను నిదర్శనంగా పేర్కొనవచ్చు. ఏహుంవల ఛాంతామూలుడు కాలంలోనే ‘దేవాలయ నిర్మాణాలు’ ముమ్మరంగా సాగాయి. నాగార్జునకొండలోని కార్తికేయ, పుష్పభద్ర, హారతి, అష్టభుజస్వామి, కుబేర, నవగ్రహాలయాలు ఇందుకు చక్కని ఉదాహరణలు.
వీరపురుష దత్తుడు నాగార్జునకొండల్లో ‘ఐదు’ ప్రసిద్ధ శిల్పాలు నిర్మించాడు. అవి.
1.బుద్ధుడు స్వర్గం నుంచి కిందికి దిగుతున్నట్లు ఉంటుంది. రాజు బుద్ధుని వద్దకు వెళుతూ ఉంటాడు. ఐదుగురు రాణులు అతన్ని నివారిస్తూ ఉంటారు.
2.రాణులు ఆటంకాలను నివారిస్తూ రాజు బుద్ధునికి సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్లు ప్రతిమ ఉంటుంది.
3.రాజు బుద్ధుడిని సమీపిస్తూ తన కుడికాలుతో పెక్కు పడగలతో రక్షితమైన శివలింగాన్ని అణగదొక్కే దృశ్యం ఉంది. అణగదొక్కిన మతం బ్రహ్మమతం. మహస్త్రశ్వర పూజ అయి ఉండొచ్చు. ఈ దృశ్యాన్ని తిలకించే వారిలో రాజదర్బారు సభ్యులందరూ ఉన్నారు. 9వ స్థూపం వద్ద ఇలాంటి శిల్పమే ఉంది. 4.రాజు సాధారణ వస్త్రాలతో ఎనిమిది మంది అనుచరులతో బౌద్ధ సన్యాస ఆశ్రమానికి వెళతాడు.
5.రాజు తన వద్ద ఉన్న ధనాన్ని ‘బౌద్ధ భిక్షువులకు’, పేదలకు దానం ఇస్తున్నట్లు శిల్పాలు ఉన్నాయి.
ఇక్ష్వాకులు తమ శిల్ప నిర్మాణానికి లేత ఆకుపచ్చని పాలరాతిని వినియోగించే వారు. ఇక్కడ శిల్పాల్లో మరొకటి ‘కవచం, ఉష్ణీవం ధరించిన సిథియన్ సైనికుని’ శిల్పం ప్రసిద్ధి చెందింది. ‘సతీ సహగమనం’ ఆచారాన్ని తెలియజేసే ఏకైక శిల్పం ఇదే! (సతీసహగమనం’ గురించి వివరాలు అందిం చే ఏకైక శాసనం ‘ఎరాన్’. ఇది గుప్తుల కాలం నాటిది. సతీసహగమనాన్ని రద్దు చేసింది భారత తొలి గవర్నర్ జనరల్ అయిన విలియం బెంటింక్, 1829 డిసెంబర్ 4న).
పుట్టు పూర్వోత్తర సిద్ధాంతాలు
హన్మంత రావు: శాతవాహనులను ‘ఆర్యులు’ అని పేర్కొన్నాడు. అగస్త్యుడు ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం వైపు వచ్చి ‘దక్షిణ భారతదేశ వాస్కోడిగామా’ గా ప్రసిద్ధి చెందాడు అని తెలిపాడు. ‘ఐతరేయ బ్రహ్మణం’లో సంబంధించిన వివరాలు ఉన్నాయి.ఆర్.ఎస్. బ్రహ్మ: శాతవాహనులను ఆర్య మతం స్వీకరించిన ‘ద్రవిడులు’గా పేర్కొన్నాడు.
ప్రొఫెసర్ వి.వి.మోరాశి: శాతవాహనులను మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతానికి చెందిన వారిగా పేర్కొన్నాడు.
వి.ఏ.స్మిత్: శాతవాహనులను ‘తెలంగాణ’వారని పేర్కొన్నాడు. వీరి తొలి రాజధాని కోటిలింగాల(కరీనంగర్).