మమకారంతో వెళ్లి.. మృత్యు ఒడికి...
కొత్తపల్లి :భవాని మాలధారణ చేయాలని అతడు సంకల్పించాడు. మనవరాలి పుట్టిన రోజుకు వెళ్లలేనేమోనని భావించి, ఈలోగా చూసొద్దామని ఆ చిన్నారిపై ఉన్న మమకారంతో కుమార్తె ఇంటికి వచ్చాడు. వారితో ఆనందంగా గడిపి, స్వగ్రామానికి బైక్పై తిరుగుపయనమయ్యాడు. వారంతా అతడికి సంతోషంగా వీడ్కోలు పలికారు. అదే అతడికి తుది వీడ్కోలు అయింది.
ఉప్పాడ-పిఠాపురం రోడ్డులో యండపల్లి జంక్షన్ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ భవన నిర్మాణ కార్మికుడు మరణించాడు. అతడి బంధువులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజమండ్రి రూరల్ మండలంలోని పాత చింతల నామవరానికి చెందిన కడియపు సత్యనారాయణ (55) తాపీ పని చేస్తుంటాడు. సోమవారం అతడు భవాని మాలధారణ వేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. ఈ నెల 24వ తేదీన తన మనవరాలి పుట్టిన రోజు చేస్తున్నారు.
ఆ కార్యక్రమానికి వెళ్లలేనని భావించి, ఈలోగా మనవరాలితో పాటు అల్లుడు, కుమార్తెను చూసొద్మాని ఆదివారం ఉదయం వారి ఊరైన కొత్తపల్లికి బయలుదేరాడు. కొత్తపల్లిలో ఉన్న అల్లుడు శ్రీనివాస్, కుమార్తెను కలుసుకున్నాడు. ఐదేళ్ల మనవరాలిని ఎత్తుకుని కొద్దిసేపు గారాబం చేశాడు. స్వగ్రామానికి వెళ్తేందుకు బైక్పై తిరుగు పయనమయ్యాడు. ఉప్పాడ-పిఠాపురం రోడ్డులో యండపల్లి జంక్షన్ శివారున అతడి బైక్ను వెనుక నుంచి ట్రాక్టర్ ఢీకొని, ఆగకుండా వెళ్లిపోయింది. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికుల సహకారంతో 108లో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు చనిపోయాడు. అతడికి భార్య, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఎస్సై ఎన్.కొండయ్య కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పని చేయని ఆక్సిజన్ సిలిండర్
సంఘటనలో సత్యనారాయణకు తీవ్ర గాయాలు కాగా, 108లో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించేందుకు సిబ్బంది అంబులెన్సలో ఎక్కించారు. అతడికి ఆక్సిజన్ ఎక్కించేందుకు వైద్య సిబ్బంది ప్రయత్నించగా సిలిండర్ ఓపెన్ చేసే బటన్ విరిగి ఉంది. స్థానికంగా ఉన్న నాగులాపల్లి రక్షిత మంచినీటి పథకం కాంట్రాక్ట్ సిబ్బంది సిలిండర్ బటన్ను ఓపెన్ చేశారు. సమయానికి ఆక్సిజన్ అంది ఉంటే అతడు చనిపోయి ఉండేవాడు కాదని స్థానికులు పేర్కొన్నారు.