ఆరు నెలల చిన్నారి అదర గొట్టేసింది..!
ఆరు నెలల చిన్నారి అంటే సరిగా పదాలు కూడా పలకడం రాని వయసు. కానీ, చిన్నారి మాత్రం నిజంగానే మిరాకిల్ చేసింది. ఆ పాప విన్యాసం చూస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. జైలా సెయింట్ ఆంగే అతి చిన్న వయసులో వాటర్ స్కీయింగ్ చేసి రికార్డులు తిరగరాసింది. జైలా తల్లిదండ్రులు ప్రొఫెషనల్ వాటర్ స్కయర్స్. దీంతో తమ చిన్నారితో అద్భుతం చేయించాలని భావించారు. జైలాకు ఎలాగోలాగ శిక్షణ ఇచ్చి ఒంటరిగా ఓ సరసులో స్కీయింగ్ చేయించారు. పింక్ కలర్ డ్రెస్ లో ఉన్న జైలా నీటిపై వచ్చే అలలను చీల్చుకుంటూ, తన చిన్ని స్కీయింగ్ వాహనంపై దూసుకెళ్లింది. సిల్వర్ లేక్ 686 అడుగుల మేరకు స్కీయింగ్ చేసిందని జైలా నీటిపై విన్యాసాన్ని చేస్తూండగా తీసిన వీడియోను యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు.
ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. స్కీయింగ్ చేస్తున్న జైలా ఏ మాత్రం భయపడకుండా అలా దూసుకెళ్తుంటే.. చిన్నారిని అలా చూసిన వాళ్లు మాత్రం టెన్షన్ పడ్డారు. ఇంకా సరిగా నడక కూడా నేర్చుకోని తన పాప ప్రపంచంలోనే అత్యంత పిన్న వయసున్న వాటర్ స్కీయింగ్ అని జైలా తండ్రి కీత్ సెయింగ్ ఆంగే అంటున్నాడు. కొందరు జైలా విన్యాసాన్ని మెచ్చుకుంటుండగా, మరికొందరు మాత్రం పాప జీవితాన్ని రిస్క్ లో పెట్టారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే జైలాతో వాటర్ స్కీయింగ్ చేయించామని కూతురి రికార్డుతో తండ్రి కీత్ ఆనందంగా ఉన్నట్లు తెలిపాడు.