మెరుస్తాయ్.. మురిపిస్తాయ్..
ఏమిటివి.. చీకట్లో మెరుస్తున్నాయ్.. లైట్లయితే కావు.. ఇవి నియాన్ నిట్రో ఐస్‌క్రీములు.. అయితే.. చీకట్లో లైట్లలా మెరుస్తాయి.. అంటే.. చిమ్మచీకట్లోనూ మనకిష్టమైన ఐస్‌క్రీమ్‌లను లాగించేయొచ్చన్నమాట. ఇవి మనక్కావాలంటే ఆస్ట్రేలియా వెళ్లాల్సిందే. మెల్బోర్న్లోని ‘196 బిలో’ ఐస్‌క్రీమ్ షాపు యజమానులు స్టీవ్ ఫెలీస్, గ్లెన్ స్టోరీలు వీటి సృష్టికర్తలు. స్టీవ్‌కు చిన్నప్పటి నుంచి నియాన్ లైట్లంటే తెగ ఇష్టమట. దీంతో గ్లెన్‌తో కలిసి ఐస్‌క్రీమ్ పార్లర్ ప్రారంభించినప్పుడు ఏదైనా కొత్తగా చేయాలని తలంచాడు. చీకట్లో మెరిసే నియాన్ లైట్లలా.. ఐస్‌క్రీమ్ కూడా మెరిస్తేనో అనుకున్నాడు.
అంతే.. ప్రత్యేకమైన యూవీ రియాక్టివ్ ఫుడ్ కలరింగ్ సాయంతో ఈ నియాన్ నిట్రో ఐస్‌క్రీమ్‌లను తయారుచేశాడు. మూడు రకాల ఫ్లేవర్లలో లభిస్తాయి. ఈ ఐస్‌క్రీమ్‌లు తినడంపై భయాలేవీ పెట్టుకోనక్కర్లేదని.. ఆ ప్రత్యేకమైన ఫుడ్ కలరింగ్ సురక్షితమేనని ఆస్ట్రేలియా ప్రభుత్వ విభాగం సర్టిఫికేట్ కూడా ఇచ్చేసింది.