కూచువారిపల్లెలో పోలీసులను అడ్డుకుంటున్న స్థానికులు
చంద్రగిరి మండలం కూసువారిపల్లెలో ఒక కారు దగ్థం, మరొకటి ధ్వంసం
నలుగురు అనుచరులకు గాయాలు
దాడిలో స్వయంగా పాల్గొన్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని
తిరుపతి రూరల్/చంద్రగిరి: తిరుపతి జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిపై చంద్రగిరి మండలం కూచువారిపల్లెలో సోమవారం టీడీపీ గూండాలు దాడికి తెగబడ్డారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ఈ దాడిలో పాల్గొని మోహిత్‌రెడ్డి కారును దగ్థం చేసి ఆయన అనుచరులపై రాడ్లు, కర్రలు, రాళ్లతో దాడులకు పాల్పడ్డారు.
అసలేం జరిగిందంటే..
చంద్రగిరి మండలం రామిరెడ్డిగారిపల్లె వైఎస్సార్‌సీపీ నేత, సర్పంచ్ కొటాల చంద్రశేఖర్‌రెడ్డిపై టీడీపీకి చెందిన కొందరు సోమవారం సాయంత్రం దాడికి పాల్పడ్డారు. అతన్ని పరామర్శించేందుకు మోహిత్‌రెడ్డి తన సోదరుడు హర్షిత్‌రెడ్డితో కలిసి రామిరెడ్డి పల్లెకు బయల్దేరారు. ఆ గ్రామానికి ముందు కూచువారిపల్లెలో టీడీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు గుమికూడి రోడ్డు మధ్యలో మోహిత్‌రెడ్డి కారును అడ్డుకున్నారు. చంద్రశేఖర్‌రెడ్డిని పరామర్శించడానికి వెళ్లొద్దని చుట్టుముట్టారు. తమ నాయకుడిని పరామర్శించడానికి మీ అనుమతేంటని మోహిత్‌రెడ్డి వారిని ప్రశ్నించారు. దీంతో మోహిత్‌రెడ్డి కారును కదలనివ్వకుండా చుట్టుముట్టారు. అదే సమయంలో టీడీపీ ఎమ్మె ల్యే అభ్యర్థి పులివర్తి నాని అక్కడకు చేరుకున్నాడు. దూకుడుగా వచ్చి మోహిత్‌రెడ్డి అనుచరులు కౌలిక్ పై దాడిచేశాడు.
ముఖంపై పిడిగుద్దులు గుద్దాడు. రక్తం కారేలా గాయపరిచాడు. మోహిత్‌రెడ్డిపై కూడా దాడి చేయడంటూ అనుచరులను రెచ్చగొట్టాడు. దీంతో ఆయన అనుచరులు, టీడీపీ శ్రేణులు రెచ్చిపోయారు. మోహిత్‌రెడ్డిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. కానీ, మోహిత్‌రెడ్డి గన్‌మెన్లు అతనికి రక్షణగా నిలబడి దాడిని అడ్డుకుని ఆయన సురక్షితంగా పక్కకు తీసుకొచ్చారు. దీంతో టీడీపీ గూండాలు మోహిత్‌రెడ్డి కారును దగ్థంచేశారు. మరో కారును కూడా ధ్వంసం చేయడంతో వేరే కారులో మోహిత్‌రెడ్డిని గన్‌మెన్లు రామిరెడ్డిపల్లెకు తీసుకెళ్లారు. ఆ తర్వాత కూడా నాని, ఆయన కుమారుడు, అనుచరులు 2 గంటలపాటు అక్కడే ఉండి టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టారు. రాత్రి 10.30 గంటలకు పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితి అదుపులోకి తెచ్చారు.
సర్పంచ్‌పై దాడి.. ఇల్లు ధ్వంసం
రాత్రి 11:30 గంటలకు కూచువారిపల్లెలో సర్పంచ్ కొటాల చంద్రశేఖర్‌రెడ్డి ఇంటిపై 500 మందికిపైగా టీడీపీ గూండాలు దాడి చేసి ఇంటిని ధ్వంసం చేశారు. ఎడ్ల బండ్లనూ తగలబెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment