ఆదిలాబాద్: శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈవీఎం(ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్)లపై అధికార యంత్రాంగం అవగాహన కల్పిస్తోంది. ఓటర్ల సందేహాలను నివృత్తి చేస్తోంది. ఓటింగ్‌లో కచ్చితత్వానికి వినియోగిస్తున్న వీవీ పాట్‌లపైనా వివరిస్తోంది. ఈవీఎంలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో చెల్లని ఓట్లకు చెక్ పడింది. భారీయెత్తున కాగితం వినియోగమూ తగ్గింది.
ఎప్పటికప్పుడు మార్పులు..
ఈవీఎంలో కంట్రోల్ యూనిట్, బ్యాలెటింగ్ యూనిట్ ఉంటాయి. ఐదు మీటర్ల కేబుల్‌తో ఈ రెండింటిని అనుసంధానం చేస్తారు. బ్యా లెటింగ్ యూనిట్‌లో 16 మంది అభ్యర్థుల గుర్తులు, పేర్లుంటాయి. 2006 కంటే ముందు ఎం1, ఆ తర్వాత ఎం2 ఈవీఎంలు ఉండగా.. నాలుగు బ్యాలెటింగ్ యూనిట్లను అనుసంధానం చేయడం ద్వారా గరిష్టంగా 64 మంది(నోటాతో కలిపి) అభ్యర్థులు బరిలో ఉన్నా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. 2006 తర్వాత ఎం3 ఈవీఎంలను తయారు చేయగా.. 24 బ్యాలెటింగ్ యూనిట్లను అనుసంధానం చేయడం ద్వారా గరిష్టంగా నోటాతో కలిపి 384 మంది అభ్యర్థులు బరిలో ఉన్నా ఎన్నికలు నిర్వహించవచ్చు. ఒకే కంట్రోల్ యూనిట్ అవసరం అవుతుంది.
అలా మొదలై ఇలా..
బ్యాలెట్ బాక్సు, పేపర్ స్థానంలో ఈవీఎం తీసుకు రావడానికి ఎన్నికల సంఘం 1977లో హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్)ను సంప్రదించింది. దీంతో 1979లో నమూనా ఈవీఎంను రూపొందించింది. దీన్ని ఎన్నికల సంఘం 1980 ఆగస్టు 6న రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ప్రదర్శించింది. ప్రభుత్వ రంగంలోని మరో సంస్థ బెంగళూర్‌లోని భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్(బెల్)తో కలిసి ఈసీఐఎల్ ఈవీఎలను తయారు చేసింది.
వినియోగంలోకి..
1982లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఈవీఎంలను మొదటిసారి వినియోగించారు. కానీ వినియోగానికి సంబంధించి నిర్దిష్ట చట్టం లేకపోవడంతో ఆ ఎన్నికలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో ఎన్నికల్లో ఈవీఎంల వినియోగానికి సంబంధించి ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని పార్లమెంటులో 1989లో సవరించారు. ఆ తర్వాత 1998లో మధ్యప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాల్లోని 25 శాసనసభ నియోజకవర్గాల్లో ఈవీఎంలను వినియోగించారు.
1999 ఎన్నికల్లో 45 పార్లమెంటరీ స్థానాల్లో, 2000లో హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో 45 అసెంబ్లీ స్థానాల్లో వినియోగించారు. 2001లో తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, పశ్చిమబంగాల్ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో అన్ని స్థానాల్లో ఈవీఎంలను ఉపయోగించారు. అప్పటి నుంచి ప్రతీ ఎన్నికల్లో ఎన్నికల సంఘం ఈవీఎంలనే వినియోగిస్తోంది. 2004లో లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో దేశంలోని 543 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఈవీఎంలు వినియోగించారు.
ఓటు కచ్చితత్వం..
ఓటు కచ్చితత్వానికి వీవీ ప్యాట్(ఓటరు వెరిఫైయేబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్) వినియోగిస్తున్నారు. ఓటు వేయగానే ఒక స్లిప్‌పై సీరియల్ నంబరు, అభ్యర్థి పేరు, గుర్తు ప్రింట్ అయి బాక్సులో పడుతుంది. 2000 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంల్లో 315కోట్ల ఓట్లు పోలయ్యాయి.
ఒకే ఎన్నిక.. 25వేల బ్యాలెట్ యూనిట్లు
2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి అత్యధికంగా 185మంది బరిలో నిలిచారు. పార్లమెంటు నియోజకవర్గంలోని 1,788 పోలింగ్ కేంద్రాల్లో మొత్తంగా 25వేల బ్యాలెటింగ్ యూనిట్లు, 2000 కంట్రోల్ యూని ట్లు, 2000 వీవీప్యాట్లు వినియోగించి ఎన్నిక నిర్వహించారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 12బ్యాలెట్ యూనిట్లు, ఒక కంట్రోల్ యూనిట్, ఒక వీవీ ప్యాట్ అమర్చారు. రికార్డు స్థాయిలో అభ్యర్థులు బరిలో నిలిచినా ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించడం దేశంలోనే ఇది మొదటిసారి.
కలెక్టరేట్లలో అవగాహన..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పది అసెంబ్లీ స్థా నాలు ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, ముధోల్, ఖా నాపూర్, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్, ఆసిఫాబాద్, సిర్పూర్ ఉన్నాయి. ఎన్నికలు రానున్న నే పథ్యంలో ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కుమురంభీం జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్లలో ఈవీఎంలను ప్రదర్శిస్తూ సంబంధిత అధికారు లు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment