వారంతా విద్యాధికులే..! ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి.. | - | Sakshi
Sakshi News home page

వారంతా విద్యాధికులే..! ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి..

Published Sat, Nov 18 2023 1:50 AM | Last Updated on Sat, Nov 18 2023 8:05 AM

- - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌/మంచిర్యాల: వారంతా విద్యాధికులే.. ఉన్నత లక్ష్యంతో డిగ్రీ, పీజీ, ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసినవారే. వివిధ వృత్తులు, వ్యాపారాలు చేస్తూనే ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చారు. ఆయా పార్టీలో చేరి ప్రస్తుతం అసెంబ్లీ బరిలో నిలిచారు. పార్టీ అభ్యర్థులుగా, స్వతంత్రులుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

మంచిర్యాల నియోజకవర్గంలో..
మంచిర్యాల నియోజకవర్గంలో పోటీ చేస్తున్న వివిధ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు 17 మంది బరిలో నిలువగా ఇందులో సగానికి పైగా ఉన్నత విద్యను అభ్యసించినవారే. ప్రధాన పార్టీల అభ్యర్థులు డిగ్రీ, ఆపైన చదివిన వారుండగా, ఉన్నత చదువు చదివి, మంచి ఉద్యోగాలు, వృత్తుల్లో ఉన్నవారు ప్రజాసేవ చేసేందుకు ఎన్నికల బరిలో నిలిచారు. వీరిలో 25 నుంచి 71 ఏళ్లవారున్నారు.

వయస్సు, చదువుతో నిమిత్తం లేకుండా రాజకీయాల్లో రాణిస్తున్న వారెందరో ఉండగా, మంచిర్యాల నియోజకవర్గంలో మాత్రం ఉన్నత చదువులతో పాటు, మంచి వృత్తిలో ఉన్నవారు కూడా ఈసారి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి, ప్రజాసేవ చేసేందుకు సిద్ధమవుతున్నారు. 51 ఏళ్లున్న బీజేపీ అభ్యర్థి రఘునాథ్‌ వెరబెల్లి అమెరికా యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసి పలు కంపెనీలను నెలకొల్పారు. ప్రస్తుతం ప్రజాసేవ చేసేందుకు ఎన్నికల బరిలో నిలిచారు. 63 ఏళ్లున్న కాంగ్రెస్‌ అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు బీఎస్సీ చదివి వ్యాపారం చేస్తున్నారు.

71 ఏళ్లున్న బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నడిపెల్లి దివాకర్‌రావు బీఏ చదివారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రజాసేవ చేస్తున్నారు. 41 ఏళ్లున్న బీఎస్పీ అభ్యర్థి తోట శ్రీనివాస్‌ బీఎస్సీ చదివి ఆర్‌ఎంపీగా, నస్పూర్‌ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. 48 ఏళ్లున్న బహుజన రిపబ్లికన్‌ సోషలిస్ట్‌ పార్టీ అభ్యర్థి చెరుకూరి శాంతశ్రీ ఎమ్మెస్సీ ఎల్‌ఎల్‌బీ చదివి సోషల్‌ వర్క్‌ చేస్తున్నారు. 39 ఏళ్లున్న ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ అభ్యర్థి దొమ్మటి రవికుమార్‌ ఎమ్మెస్సీ చదివి వ్యవసాయం చేస్తూ బరిలో నిలిచారు.

బెల్లంపల్లి నియోజకవర్గంలో..
బెల్లంపల్లి బరిలో ప్రధాన పార్టీల అభ్యర్థులు నలుగురు తలపడుతున్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ, బీఎస్పీ అభ్యర్థులుగా దుర్గం చిన్నయ్య, గడ్డం వినోద్‌, అమురాజుల శ్రీదేవి, జాడి నర్సయ్య పోటీలో ఉన్నారు. చిన్నయ్య, గడ్డం వినోద్‌, శ్రీదేవి ఇదివరకే ఎమ్మెల్యేలుగా గెలిచి చట్టసభలో అడుగు పెట్టారు. 52 ఏళ్లున్న బీఆర్‌ఎస్‌ అభ్యర్థి దుర్గం చిన్నయ్యది వ్యవసాయ కుటుంబం.

ఐటీఐ చదివి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. భార్య, ఇద్దరు కుమార్తెలు కలిగిన చిన్నయ్య మూడోసారి బరిలో ఉన్నారు. 67 ఏళ్లున్న కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం వినోద్‌ రాజకీయ, పారిశ్రామిక కుటుంబంలో జన్మించారు. డిగ్రీ చదివిన వినోద్‌కు భార్య, కుమార్తె ఉన్నారు. చెన్నూర్‌ నియోజకవర్గం నుంచి రెండుసార్లు పోటీ ఓసారి విజయం సాధించారు. ప్రస్తుతం బెల్లంపల్లి నుంచి రెండోసారి పోటీ చేస్తున్నారు.

51 ఏళ్లున్న బీజేపీ అభ్యర్థి అమురాజుల శ్రీదేవి సాధారణ కుటు ంబంలో జన్మించారు. డిగ్రీ వరకు చదివారు. ఆమె భర్త రాజేశ్వర్‌ సింగరేణిలో అధికారిగా పని చేస్తున్నారు. ఆమెకు నలుగురు సంతానం. మూడుసార్లు ఎన్నికల్లో పోటీ చేసిన శ్రీదేవి పాత ఆసిఫాబాద్‌ నియోజకవర్గం నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం నాలుగోసారి బరిలో ఉన్నారు.

నిర్మల్‌ నియోజకవర్గంలో..
74 ఏళ్లున్న నిర్మల్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఎల్‌ఎల్‌బీ పూర్తిచేసి న్యాయవాద వృత్తి స్వీకరించిన తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారు. 54 ఏళ్లున్న బీజేపీ అభ్యర్థి ఏలేటి మహేశ్వర్‌రెడ్డి డిగ్రీ పూర్తి చేశారు. 62 ఏళ్లున్న కాంగ్రెస్‌ అభ్యర్థి కూచాడి శ్రీహరిరావు ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి కొంతకాలం న్యాయవాద వృత్తిలో ఉండి రాజకీయాల్లోకి వచ్చారు. అ లాగే బీఎస్పీ అభ్యర్థి డీ జగన్మోహన్‌ ఎల్‌ఎల్‌బీ, ఆ లిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ అభ్యర్థి స్వదేశ్‌ పరికిపండ్ల, యుగ తులసి, ధర్మ సమాజ్‌, అలయన్స్‌ ఆఫ్‌ డెమొక్రటిక్‌ రీఫామ్స్‌ అభ్యర్థులు, స్వతంత్రులుగా బరిలో నిలిచిన వారంతా డిగ్రీ, పీజీ పూర్తి చేసినవారే.

ముధోల్‌ నియోజకవర్గంలో..
69 ఏళ్లున్న బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గడ్డిగారి విఠల్‌రెడ్డి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి దాదాపు 20 ఏళ్ల పాటు భైంసాలో న్యాయవాదిగా పనిచేశారు. భైంసా వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా చేశారు. 2009లో పీఆర్పీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన విఠల్‌రెడ్డి, 2014లో కాంగ్రెస్‌ నుంచి పోటీచేసి గెలుపొందారు. తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరి, 2018లో గెలిచారు.

64 ఏళ్లున్న కాంగ్రెస్‌ అభ్యర్థి భోస్లే నారాయణరావుపటేల్‌ ఇంటర్‌ పూర్తి చేశారు. ముధోల్‌ ఎమ్మెల్యేగా రెండుసా ర్లు పని చేశారు. 69 ఏళ్లున్న బీజేపీ అభ్యర్థి పవార్‌ రామారావుపటేల్‌ డిగ్రీ పూర్తి చేశారు. 2018లో కాంగ్రెస్‌లో చేరి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. అదే ఏడాది ముధోల్‌ బరిలో నిలిచి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తదనంతరం డీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతూ గతేడాది బీజేపీలో చేరారు.

సిర్పూర్‌ నియోజకవర్గంలో..
 
68 ఏళ్లున్న సిర్పూర్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కోనేరు కోనప్ప ఇంటర్‌ వరకు కాగజ్‌నగర్‌లో చదివారు. 48 ఏళ్లున్న కాంగ్రెస్‌ అభ్యర్థి రావి శ్రీనివాస్‌ 1 నుంచి 10వ తరగతి వరకు కాగజ్‌నగర్‌ జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించారు. హైదరాబాద్‌లో ఇంటర్‌, డిగ్రీ బీఏ చదివారు. 44 ఏళ్లున్న బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీశ్‌బాబు కాగజ్‌నగర్‌లోని ఫాతిమా కాన్వెంట్‌లో ప్రాథమిక విద్య పూర్తి చేశారు. 2004లో ఎంబీబీఎస్‌, 2010లో ఎంఎస్‌(ఆర్ధోసిడిక్స్‌) పూర్తి చేశారు.

2011లో నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ నుంచి డీఎన్‌బీ పట్టా పొందారు. 56 ఏళ్లున్న బీఎస్పీ అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ 1 నుంచి 10వ తరగతి వరకు ఆలంపూర్‌లోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో పూర్తి చేశారు. వెటర్నరీ వైద్య వృత్తి కోర్సును హైదరాబాద్‌ ఎన్టీరంగ యూనివర్సిటీలో చదివారు. 1995లో ఐపీఎస్‌గా ఎంపికయ్యారు. హార్వర్డ్‌ యూనివర్సిటీ ఇన్‌ పబ్లిక్‌లో ఉన్నత చదువు పూర్తిచేశారు. 2020 ఆగస్ట్‌ 8న తన ఉద్యోగానికి రాజీనామా చేసి బీఎస్పీలో చేరి రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలో..
54 ఏళ్లున్న ఆసిఫాబాద్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కోవ లక్ష్మి పదో తరగతి చదివారు. 36 ఏళ్లున్న బీజేపీ అభ్యర్థి అజ్మీరా ఆత్మారాంనాయక్‌ బీఎస్సీ(బీజెడ్సీ), మాస్టర్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్స్‌ విద్యనభ్యసించారు. 53 ఏళ్లున్న కాంగ్రెస్‌ అభ్యర్థి అజ్మీరా శ్యాంనాయక్‌ బీఈ, బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ జర్నలిజం (ఉస్మానియా), ఎల్‌ఎల్‌బీ శాతవాహన యూనివర్సిటీలో పూర్తిచేశారు. ఎంవీఐగా పనిచేసి ప్రజాసేవ చేసేందుకు కాంగ్రెస్‌లో చేరారు. ఆయన భార్య రేఖానాయక్‌ ఖానాపూర్‌ ఎమ్మెల్యే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement