● ‘పది’ ఫలితాల్లో తెలుగులోనే ఎక్కువ మంది ఫెయిల్‌ ● ఇంగ్లిష్‌లోనూ అదే పరిస్థితి ● సబ్జెక్టు టీచర్ల కొరత, ప్రాథమిక అంశాలపై పట్టు లేకపోవడంతోనే.. | Sakshi
Sakshi News home page

● ‘పది’ ఫలితాల్లో తెలుగులోనే ఎక్కువ మంది ఫెయిల్‌ ● ఇంగ్లిష్‌లోనూ అదే పరిస్థితి ● సబ్జెక్టు టీచర్ల కొరత, ప్రాథమిక అంశాలపై పట్టు లేకపోవడంతోనే..

Published Mon, May 6 2024 10:35 AM

● ‘పది’ ఫలితాల్లో తెలుగులోనే ఎక్కువ మంది ఫెయిల్‌ ● ఇంగ్

ఆదిలాబాద్‌టౌన్‌: పదో తరగతి ఫలితాల్లో జిల్లా విద్యార్థులు మాతృభాషలోనే తడబడ్డారు. ఎక్కువ మంది ప్రథమ భాషలో ఫెయిల్‌ అవ్వగా, ఇంగ్లిష్‌లోనూ రాణించలేకపోయారు. దీంతో జిల్లా ఉత్తీర్ణత శాతంపై ప్రభావం చూపింది. గతేడాదితో పోల్చితే రాష్ట్రస్థాయిలో రెండు స్థానాలు ఎగబాకినా 17వ స్థానంలో నిలవడం గమనార్హం.

తెలుగని తేలికగా.. ఇంగ్లిష్‌ అంటే భయం

జిల్లాలో ఈ ఏడాది రెగ్యులర్‌ విద్యార్థులు 10,374 మంది పరీక్షలకు హాజరయ్యారు. 92.93 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఎక్కువ శాతం మంది విద్యార్థులు తెలుగు, ఇంగ్ల్లిష్‌ సబ్జెక్టుల్లోనే ఫెయిల్‌ అయ్యారు. ఈ సారి తెలుగులో 286 మంది, ఇంగ్ల్లిష్‌లో 261 మంది పరీక్ష తప్పారు. ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతే ప్రధాన కారణంగా తెలుస్తోంది. అంతేకాకుండా ఇంగ్ల్లిష్‌ మీడియం విద్యార్థులు తెలుగు సబ్జెక్టుపై పట్టు సాధించకపోవడం, మొదటి పరీక్ష అనే భయం, రీడింగ్‌ స్కిల్స్‌ లేకపోవడం, తెలుగు అని తేలికగా తీసుకోవడంతోనే ఎక్కువ మంది ఈ సబ్జెక్టులో ఫెయిల్‌ అయినట్లు తెలుస్తోంది. జిల్లాలో 45 శాతంకు మించి విద్యార్థులు మాతృభాషలో చదవడం, రాయడం రాకపోవడంతో రాణించలేకపోతున్నారు. అలాగే ప్రాథమిక అంశాలపై పట్టు లేకపోవడం, కొంత మంది ఉపాధ్యాయులు పాఠ్యాంశాలు సరిగా చెప్పకపోవడం కారణంగా తెలుస్తోంది. ఇంగ్ల్లిష్‌ విషయానికొస్తే ప్యాసేజ్‌, ప్యారాగ్రాఫ్‌ క్వశ్చన్స్‌ ఎక్కువగా ఉంటాయి. చదివిన అంశాన్ని విద్యార్థులు స్వతహాగా రాయలేకపోతున్నారు. తెలుగు మీడియం వారికి ఎక్కువగా ఇంగ్ల్లిష్‌ అంటేనే భయం. అలాగే ఉపాధ్యాయులు అర్థమయ్యే రీతిలో బోధించకపోవడం, ఎక్కువ మంది ఇంగ్ల్లిష్‌ సబ్జెక్టును కూడా తెలుగులో చెప్పడంతో విద్యార్థులు నేర్చుకోలేక పోతున్నారు. ఇక హిందీలో పది మంది, గణితంలో 144 మంది, సామాన్య శాస్త్రంలో 178 మంది, సాంఘిక శాస్త్రంలో 59 మంది ఫెయిలయ్యారు. ఏటా ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నా వాటిని సద్వి నియోగం చేసుకోకపోవడం ఫలితాలపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.

ఉత్తీర్ణత పెంపు కోసమే ఉపాధ్యాయుల దృష్టి

పదో తరగతి పరీక్షలకు సంబంధించి సమావేశాలు నిర్వహించినప్పుడు ఉన్నతాధికారులు పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించినా ఆచరణలో మాత్రం కానరావడం లేదు. కొంతమంది ఉపాధ్యాయుల ఫలితాలు తగ్గితే పాఠశాల పరువు పోతుందనే ఉద్దేశంతో విద్యార్థులను చూచిరాతకు ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్నేళ్లుగా జిల్లాలో జరుగుతున్న ఈ తీరు అందరికీ తెలిసిందే. ఎక్కువ జీపీఏ రావడంతో తల్లిదండ్రులు సంతోషపడుతున్నారే తప్పా వారిలో విషయ పరిజ్ఞానం లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కష్టపడి చదివిన విద్యార్థులు ఈ తీరుతో కొంత నారాజ్‌ అవుతున్నారు. గతంలో 80 శాతం మించని జిల్లా ఉత్తీర్ణత, గడిచిన మూడునాలుగేళ్లుగా అధికారులు కేవలం ఉత్తీర్ణత శాతంపైనే దృష్టి పెడుతున్నారు. కొంతమంది ఇన్విజిలెటర్లు, సీఎస్‌, డీవోలకు చూసీచూడనట్లుగా ఉండాలని చెప్పడంతో ఉత్తీర్ణత పెరిగినట్లు తెలుస్తోంది. గడిచిన నాలుగేళ్లలో ఒక్క విద్యార్థి కూడా మాస్‌కాపీయింగ్‌కు పాల్పడుతూ పట్టుబడ్డ దాఖలాలు లేవంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మూడేళ్లుగా జిల్లా ఉత్తీర్ణత శాతం పరిశీలిస్తే అంకెల్లో మాత్రం పర్వాలేదనిపిస్తోంది. 2021–22లో 95.34 ఉత్తీర్ణత శాతం, 2022–23లో 88.68 శాతం, 2023–24లో 92.93 శాతం సాధించడం గమనార్హం.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement