పాడేరు మండలం కుమ్మరిపుట్టులో కళకళలాడుతున్న రాజ్‌మా పైరు
సాక్షి,పాడేరు : ఏజెన్సీలో గిరి రైతుకు రాజ్‌మా సాగు లాభదాయకంగా మారింది. వాణిజ్య పంటగా ఎరుపు రకాన్ని సాగు చేస్తున్నారు. ప్రభుత్వం అన్నివిధాలుగా సహకారం అందించడంతో సాగు విస్తీర్ణం పెరుగుతోంది. ప్రభుత్వం 90 శాతం రాయితీపై 18,212 ఎకరాలకు అవసరమైన 4,555 క్వింటాళ్ల రాజ్‌మా విత్తనాలను ఈ ఏడాది ముందుగానే పంపిణీ చేసింది. సేంద్రియ విధానంలో మెట్ట, కొండపోడు భూముల్లో సాగు చేపట్టారు. రాజ్‌మా విత్తనం కిలో అసలు ధర రూ.154 కాగా ప్రభుత్వం రూ.15.40కు పంపిణీ చేసింది. ఎకరాకు 20 కిలోల విత్తనం అవసరం. అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వం సరఫరా చేసింది. ఈ సాగుపై సుమారు 7వేల మంది గిరి రైతులు ఆధారపడ్డారు.
గంజాయి సాగుకు ప్రత్యామ్నాయంగా..
గంజాయి సాగుకు ప్రత్యామ్నాయంగా పోలీసుశాఖ రాజ్‌మా సాగును పోత్సహిస్తోంది. పెదబయలు, జి.మాడుగుల, ముంచంగిపుట్టు, జీకేవీధి, చింతపల్లి మండలాల్లోని మారుమూల గ్రామాల గిరిజనులు ఇప్పటికే విత్తనాలు పొంది సాగు చేపట్టారు. మెట్ట ప్రాంతంలో పండించే రాజ్‌మా సాగుకు వాతావరణ పరిస్థితులు అనుకూలించాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ఎంతగానే మేలు చేశాయి. మొక్కదశలో పైరు కళకళలాడుతోంది. నవంబర్ నెలాఖరు నుంచి డిసెంబర్ మొదటి వారంలోగా పంట దిగుబడి రావొచ్చని గిరి రైతులు అంచనా వేస్తున్నారు.
దిగుబడి పెరిగే అవకాశం
రాజ్‌మా గింజలకు మార్కెట్లో మంచి ధర పలుకుతోంది. ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నా యి. విత్తనాలు ముందుగానే సరఫరా చేయడంతో ఇప్పటికే చాలా చోట్ల సాగు చేపట్టారు. పైరు మొక్క దశలో కళకళలాడుతోంది. సేంద్రియ విధానంలో పండించడం వల్ల మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. మెరుగైన ధర లభించే అవకాశం ఉంది. – ఎస్‌బీఎస్ నందు,
జిల్లా వ్యవసాయాధికారి, పాడేరు
రాయితీతో ఆదా
ప్రభుత్వం 90 శాతం రాయితీపై విత్తనాలు సరఫరా చేయడం వల్ల పెట్టుబడి పరంగా ఎంతో ఆదా అవుతోంది. ప్రైవేటు మార్కెట్‌లో కిలో రూ.120 నుంచి రూ.150కు విక్రయిస్తున్నారు. ప్రభుత్వం రాయితీ మినహాయించి కిలో రూ.15.40కు సరఫరా చేసింది. 50 కిలోల విత్తనం పొందా. ప్రస్తుతం మూడు ఎకరాల్లో సాగు చేపట్టా. – రేగం మంగ్లన్న,
నేరేడివలస, గబ్బంగి, పాడేరు మండలం
Comments
Please login to add a commentAdd a comment