గిరిజనులకు తప్పని డోలీమోత | - | Sakshi
Sakshi News home page

గిరిజనులకు తప్పని డోలీమోత

Published Fri, Oct 11 2024 1:30 AM | Last Updated on Fri, Oct 11 2024 1:30 AM

-

మహిళ మృతదేహాన్ని

అవస్థలు పడి తరలించిన గిరిజనులు

చింతపల్లి: గిరిజనులకు డోలీమోతలు తప్పడం లేదు. అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రులకు వెళ్లేందుకు, ఆస్పత్రుల నుంచి ఇళ్లకు వచ్చేందుకు డోలీలపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఇటీవల పాముకాటుకు గురైన గిరిజన మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించగా ఆమె మృతదేహాన్ని రహదారి, రవాణా సదుపాయం లేకపోవడంతో రెండు కిలోమీటర్ల మేర గిరిజనులు డోలీలో మోసుకుని ఇంటికి తీసుకువెళ్లాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది. లంబసింగి పంచాయతీ జలగలగెడ్డ గ్రామానికి చెందిన గిరిజన మహిళ కొర్రా నీలమ్మ(40) గతనెల 11న పాముకాటుకు గురైంది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు గ్రామస్తుల సహకారంతో లంబసింగి పీహెచ్‌సీకి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్సకోసం నర్సీపట్నం, ఆ తర్వాత విశాఖ కేజీహెచ్‌కు తీసుకువెళ్లారు. అక్కడ 22 రోజులు చికిత్స పొందిన ఆమె పరిస్థితి విషమించడంతో ఈనెల ఒకటిన మృతి చెందింది. ఆమెను కుటుంబ సభ్యులు అంబులెన్సులో లంబసింగి తీసుకువచ్చారు. గ్రామానికి రోడ్డు సదుపాయం లేకపోవడంతో ఈనెల 2న డోలీలో గ్రామస్తుల సహకారంతో కుటుంబ సభ్యులు ఇంటికి తరలించారు. ఈ హృదయ విదారక ఘటన మన్యంలో గిరిజనుల దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement