సబ్సిడీ ధరలకు నిత్యావసరాలు
● ఉల్లి, టామాటా, నూనెల విక్రయానికి ప్రత్యేక కౌంటర్లు ● ధరల నియంత్రణకు నిరంతర తనిఖీలు ● అధికారులు, వ్యాపారుల సమావేశంలో జేసీ జాహ్నవి
తుమ్మపాల: నిత్యావసరాల ధరల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్టు జాయింట్ కలెక్టర్ జాహ్నవి చెప్పారు. కలెక్టరేట్‌లో నిత్యావసర సరకులు ధరల నియంత్రణపై పౌర సరఫరాలు, మార్కెటింగ్, తూనికలు కొలతల శాఖల అధికారులు, హోల్‌సేల్ వ్యాపారులు, షాపింగ్ మాల్స్ ప్రతినిధులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఉల్లిపాయలు, టమాటా, వంటనూనెలను ప్రత్యేక కౌంటర్ల ద్వారా అమ్మకాలు నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. కౌంటర్లలో సరుకులను సాధ్యమైనంత తక్కువ ధరలకు అందించాలని వ్యాపారులకు సూచించారు. సరకుల కృత్రిమ కొరత సృష్టించకుండా అధికారుల కమిటీ తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. సరుకుల స్టాకు, అమ్మకాలపై రోజువారీ నివేదిక అందించాలని తూనికలు కొలతల శాఖ అధికారులను ఆదేశించారు. ప్రత్యేక కౌంటర్లలో సరుకుల విక్రయాలకు హోల్‌సేల్ మార్కెట్లో సమాచారం సేకరించి సరకుల ధరలు నిర్ణయించాలని మార్కెటింగ్ శాఖల అధికారులను ఆదేశించారు. పౌర సరఫరాలు, మార్కెటింగ్, లీగల్ మెట్రాలజీ శాఖల ఆధ్వర్యంలో అనకాపల్లి, నర్సీపట్నం, యలమంచిలిలో సబ్సిడీ ధరలపై ఉల్లిపాయలు, టమాటా, వంటనూనెల విక్రయాలకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అనకాపల్లి, నర్సీపట్నం, యలమంచిలి హోల్‌సేల్ మార్కెట్‌లు, అనకాపల్లి బెల్లం మార్కెట్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఉల్లిపాయలు కేజీ రూ.60, టమాటా రూ.52, పామోలిన్ నూనె లీటరు రూ.117, ఫ్రీడం సన్‌ఫ్లవర్ ఆయిల్ లీటరు రూ.126, వేరుసెనగనూనె రూ.155 చొప్పున అమ్మకాలు జరుగుతాయని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గల మోర్, రిలయన్స్, డీమార్ట్, విశాల్ అవుట్‌లెట్‌లలో కూడా ఇవే ధరలకు సరుకులు లభిస్తాయన్నారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి టి.వి.ఎల్.ఎన్.మూర్తి, సివిల్ సప్లయి జిల్లా మేనేజర్ పి.జయంతి, మార్కెటింగ్, తూనికలు కొలతల శాఖల అధికారులు, హోల్‌సేల్ వ్యాపారులు, షాపింగ్ మాల్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment