సంకటహర.. సాయిగోపాలా
ప్రశాంతి నిలయం: సత్యసాయిబాబా 99వ జయంత్యుత్సవాలు సోమవారం అంతర్జాతీయ అధ్యాత్మిక ధామం ప్రశాంతి నిలయంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. వేడుకలను పురస్కరించుకుని సత్యసాయి మహా సమాధిని సర్వాంగసుందరంగా అలంకరించారు. సాయికుల్వంత్ సభా మందిరాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. సాయికుల్వంత్ సభా మందిరంలోని సత్యసాయి మహాసమాధి చెంత ఉదయం 8 గంటలకు వేదపఠనంతో సత్యసాయి జయంత్యుత్సవాలు ప్రారంభమయ్యాయి. వేదపండితులు పూజల అనంతరం సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. దేశ విదేశాలకు చెందిన 2,700 మంది వ్రతంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదపండితులు సత్యనారాయణ రాజుగా పిలవబడే సత్యసాయి బాబా అవతార వైభవాన్ని, ఆయన లీలామృతాన్ని వివరించారు.
పురవీధుల్లో ఊరేగిన వేణుగోపాలుడు..
సాయికుల్వంత్ సభా మందిరంలోని మూలవిరాట్టు వేణుగోపాల స్వామికి, ఉత్సవ మూర్తులైన సీతారామ, లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద మంత్రోచ్ఛారణల నడుమ పండితులు సీతారాముల కల్యాణం నిర్వహించారు. మూలవిరాట్టును, ఉత్సవమూర్తులను పల్లకీలో ఊరేగింపుగా ప్రశాంతి నిలయం ఉత్తర గోపురం వద్దకు తీసుకువచ్చి వేణుగోపాలుడిని రథంలో కొలువుదీర్చారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జె.రత్నాకర్ రాజు, ట్రస్ట్ సభ్యుడు నాగానంద, పలువురు ట్రస్ట్ సభ్యులు పూజలు నిర్వహించి రథోత్సవాన్ని ప్రారంభించారు. దేశ విదేశాల నుంచి తరలివచ్చిన భక్తులు సాయిగోపాలుని నామాన్ని స్మరిస్తూ ముందుకుసాగారు. ప్రజలు అడుగడుగునా నారికేళాలు సమర్పిస్తూ మొక్కులు తీర్చుకున్నారు. రథోత్సవంలో సత్యసాయి బాలవికాస్ చిన్నారులు నెమలి నాట్యం, మహిళలు కోలాటం, కళాకారుల గరగ నృత్యం అందరినీ అలరించారు. కాగా, సత్యసాయి జయంత్యుత్సవాల్లో భాగంగా ప్రశాంతి నిలయంలోని నార్త్ బిల్డింగ్స్ వెనుక ఉన్న మైదానంలో మహానారాయణ సేవ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నెల 24 వరకు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అన్న ప్రసాద వితరణ చేయనున్నారు.
ప్రారంభమైన సత్యసాయి
99వ జయంత్యుత్సవాలు
Comments
Please login to add a commentAdd a comment