వినతిపత్రాలతో పోటెత్తారు
కళ్యాణదుర్గం: నియోజకవర్గ కేంద్రంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’కు అర్జీలు వెల్లువెత్తాయి. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించిన కార్యక్రమానికి ఏకంగా 662 వినతిపత్రాలు అందాయి. కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్, ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు, డీఆర్‌ఓ మలోల, ఆర్డీఓ వసంతబాబు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శిరీష, డీపీఓ నాగరాజు నాయుడు, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి ఉమా మహేశ్వరమ్మ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. భూ సంబంధిత సమస్యలపై ఎక్కువగా వినతిపత్రాలు అందాయి.
వినతుల్లో కొన్ని..
● కళ్యాణదుర్గం మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ భార్గవ్‌పై ఎస్సీ, ఎస్టీ జేఏసీ నాయకులు చెలిమప్ప, దొణతిమ్మప్ప, చనమల్లి, నరసింహులు, నారాయణ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మున్సిపాలిటీలో పనిచేస్తున్న 10 మంది పారిశుధ్య కార్మికులను అకారణంగా విధుల నుంచి తొలగించి వారి పొట్ట కొట్టారన్నారు. బడా బాబుల ఇళ్ల నిర్మాణాలకు ముడుపులు తీసుకుని నిబంధనలను తుంగలోకి తొక్కుతున్నారని, పేదల ఇళ్లను మాత్రం కూల్చివేస్తున్నారని, తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
● డీఎంహెచ్‌ఓ ఈబీ దేవి అవినీతి, అక్రమాలపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఏపీ వైద్య, ఆరోగ్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకుడు బత్తుల కోదండరామిరెడ్డి కోరారు. జిల్లాలో 11 పీహెచ్‌సీల పరిధిలో 33 మందిని నిబంధనలకు విరుద్ధంగా డిప్యుటేషన్ వేసుకున్నారని, దీని వెనుక భారీ ఎత్తున డబ్బు చేతులు మారిందన్నారు. తనిఖీల ముసుగులో ప్రైవేట్ నర్సింగ్ హోం యజమానులతో సైతం లంచాలు తీసుకుంటున్నారని తెలిపారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులతో డబ్బు వసూలు చేస్తున్నారని, చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
● 85 శాతం వికలత్వం ఉన్న తనకు పింఛన్ ఇప్పించాలని బ్రహ్మసముద్రం మండలం సంతేకొండాపురానికి చెందిన సురేష్ విన్నవించారు.
● కళ్యాణదుర్గం మండలం ముద్దినాయనపల్లిలో ప్రభుత్వ గిరిజన గురుకుల పాఠశాల నిర్మాణ పనులు మధ్యలోనే ఆగిపోయాయని, వాటి పూర్తికి చర్యలు తీసుకోవాలని కళ్యాణదుర్గం సబ్ డివిజినల్ ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు మోహన్ విన్నవించారు. కళ్యాణదుర్గం మారెంపల్లి కాలనీలోని గురుకుల పాఠశాలలో 40 మందికి ఒకే బాత్‌రూం, వ్యక్తిగత మరుగుదొడ్డి ఉండటంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
● కంబదూరు మండలం తిమ్మాపురం బాలికల గురుకుల పాఠశాలలో మురుగునీరు నిలిచి అపరి శుభ్రత తాండవిస్తున్నా ప్రిన్సిపాల్ పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు, పాఠశాల కమిటీ చైర్మన్ రాములు ఫిర్యాదు చేశారు. విద్యార్థినులు జ్వరాల బారిన పడినా కనీసం సమాచారం ఇవ్వడం లేదన్నారు. తల్లిదండ్రుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని చెప్పారు. కలెక్టర్ స్పందిస్తూ త్వరలో పాఠశాలను తనిఖీ చేసి సమస్యలను పరిష్కరించాలని డీసీ ఓను ఆదేశించారు.
మండలాలకు జిల్లా యంత్రాంగం
సమస్యలకు పరిష్కారం చూపడం కోసం ఇకనుంచి మండలాలకు జిల్లా యంత్రాంగం వెళ్తుందని కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ‘ప్రజాసమస్యల పరిష్కార వేదిక’పై అధికారుల సమీక్షలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు ప్రయాస తగ్గించేందుకే రెవెన్యూ డివిజన్ల పరిధిలో కార్యక్రమం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అర్జీలను పరిశీలించి త్వరితగతిన పరిష్కారం చూపాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీసు శాఖలో వచ్చే అర్జీలు సైతం నమోదు చేయాలని సూచించారు. సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రజలకు చక్కని అవకాశమని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పేర్కొన్నారు. అనంతరం ఐసీడీఎస్ శాఖ ఆధ్వర్యంలో బాల్య వివాహ రహిత పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో ఏపీఎస్‌పీడీసీఎల్ ఎస్‌ఈ సంపత్‌కుమార్, డీఆర్‌డీఏ పీడీ ఈశ్వరయ్య, ఎల్‌డీఎం నర్సింగరావు, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ శ్రీధర్, మైనర్ ఇరిగేషన్ ఎస్‌ఈ విశ్వనాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కిటకిటలాడిన ‘దుర్గం’
ప్రజాసమస్యల పరిష్కార వేదిక
భూ సంబంధిత సమస్యలే అధికం
Comments
Please login to add a commentAdd a comment