కలెక్టర్, ఎస్పీ విస్తృత పర్యటన
బొమ్మనహాళ్: సీఎం చంద్రబాబు ఈ నెల 30న జిల్లాలో పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గ్రామాల ఎంపికకు సోమవారం బొమ్మనహాళ్ మండలంలోని ఉద్దేహాళ్, ఉప్పరహాళ్,ఉంతకల్లు,గోవింద వాడలో కలెక్టర్ వినోద్‌కుమార్, ఎస్పీ జగదీష్, సీఎంఓ టూర్ కో ఆర్డినేటర్ ఇక్బాల్ షకీల్, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు విస్తృతంగా పర్యటించారు. ముందుగా ఉద్దేహాళ్‌లోని హైస్కూల్ మైదానాన్ని, రచ్చకట్టలను పరిశీలించారు. అనంతరం ఉప్పరహాళ్, ఉంతకల్లు గ్రామాలలో రచ్చకట్టలను పరిశీలించి అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉండాలనే దానిపై చర్చించారు. పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ప్రజలతో సీఎం ముఖాముఖిగా మాట్లాడ నున్నట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో కళ్యాణదుర్గం ఆర్డీఓ వసంతబాబు, తహసీల్దార్లు మునివేలు, అనిల్‌కుమార్, డీఎస్పీ రవిబాబు, ఎంపీడీఓ దాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
కొనసాగిన ప్రత్యేక డ్రైవ్
అనంతపురం: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా సోమవారం కూడా పోలీసులు జిల్లావ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ప్రతి ఆటోను ఆపి డ్రైవింగ్ లైసెన్స్, తదితర డాక్యుమెంట్స్ పరిశీలించారు. ప్రయాణికులను తరలించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. అత్యాశకు పోయి ఓవర్‌లోడ్‌తో వెళ్లడం వల్ల అటు ప్రయాణికులు, ఇటు డ్రైవర్లు ప్రమాదంలో చిక్కుకుంటున్నారని హితవు పలికారు.
జల్‌జీవన్ మిషన్
పనుల పరిశీలన
గుత్తి రూరల్: మండలంలోని పాత కొత్తపేట గ్రామంలో జరుగుతున్న జల్‌జీవన్ మిషన్ పథకం పనులను కేంద్ర బృందం సభ్యులు డాక్టర్.ఎస్‌కే.కులశ్రేష్ట, జౌళికేశవన్‌లు సోమ వారం పరిశీలించారు. అలాగే స్వచ్ఛభారత్ పథకంలో భాగంగా గ్రామంలో చెత్త సేకరణ గురించి అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికీ తాగునీటిని అందించాలనే ధ్యేయంతో కేంద్ర ప్రభుత్వం జల్‌జీవన్ మిషన్ పథకం ప్రవేశపెట్టి నిధులను మంజూరు చేసిందని, పనులను త్వరగా పూర్తి చేయాలని కేంద్ర బృందం సభ్యులు స్థానిక అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రభాకర్‌నాయక్, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈఈ నసీమా సయ్యద్, ఏఈ రామలింగేశ్వరరెడ్డి, సర్పంచ్ గురుమస్తాన్, కార్యదర్శి వెంకటేష్, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
నాలుగు ఆయుర్వేదిక్
కేంద్రాల మూసివేత
అనంతపురం: నగరంలోని ఆయుర్వేదిక్ మందుల దుకాణాల్లో సోమవారం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.విజిలెన్స్ డీఎస్పీ ఎం. నాగభూషణం, సీఐ కే. శ్రీనివాసులు, ఏఓ జే. వాసు ప్రకాష్, అసిస్టెంట్ డైరెక్టర్ (డ్రగ్స్) రమేష్ రెడ్డి దాడుల్లో పాల్గొన్నారు. ఎలాంటి లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న కమలానగర్ లోని మెహతా ఆయుర్వేద కేంద్రం,రామచంద్ర నగర్ మెయిన్ రోడ్‌లోని సుశ్రత ఆయుర్వేద హాస్పిటల్, అరవింద నగర్‌లోని కేరళ ఆయుర్వేదం, సాయి నగర్‌లోని ధన్వంతరి మల్టీ స్పెషాలిటీ అండ్ ఆయుర్వేదిక్ హాస్పిటల్‌ను మూసివేశారు. చట్టపరమైన చర్యల నిమిత్తం ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు ప్రాంతీయ విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి ప్రసాద్ తెలిపారు. మొత్తం 6 ఆయుర్వేదిక్ షాపుల్లో తనిఖీ చేసి, నాలుగు షాపులను మూసివేసినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment