వెంటాడిన పాపం..
పుట్టపర్తి టౌన్: భార్యపై అనుమానం పెంచుకున్న భర్త చివరకు కన్నకొడుకును హతమార్చి అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఒకటి.. రెండేళ్లు కాదు.. ఏకంగా 26 ఏళ్ల తర్వాత చేసిన పాపం పండింది. పేరు మార్చుకుని కర్ణాటకలో తలదాచుకున్న నిందితుడి ఆచూకీని పోలీసులు పసిగట్టి సోమవారం అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. వివరాలను జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రత్న వెల్లడించారు.
ఏం జరిగింది?
శ్రీసత్యసాయి జిల్లా గుడిబండ మండలం దిన్నేహట్టి గ్రామానికి చెందిన గొల్ల తిప్పేస్వామికి అదే గ్రామంలో నివాసముంటున్న మేనత్త పల్లెమ్మ కుమార్తె కరియమ్మతో 30 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు. 1998 ఏప్రిల్‌లో జన్మించిన రెండో కుమారుడికి శివలింగమయ్య అనే పేరు పెట్టి పెంచుకోసాగారు. ఈ క్రమంలో కరియమ్మ ప్రవర్తనపై తిప్పేస్వామికి అనుమానం మొదలైంది. రెండో కుమారుడు తనకు పుట్టలేదని, ఎలాగైనా ఆ పసివాడిని మట్టుబెట్టాలని అనుకున్నాడు. 1998 అక్టోబర్ 2న దసరా పండుగ సందర్భంగా ఉదయం కులాచారం మేరకు ఆరు నెలల పసికందును కరియమ్మ ఎత్తుకుని మారెమ్మ జమ్మి చెట్టు వద్ద ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో తిప్పేస్వామి బలవంతంగా లాక్కొని పక్కనే ఉన్న మామిడి తోటలోకి తీసుకెళ్లి గొంతు పిసికి చంపేశాడు. అక్కడే గొయ్యి తీసి పాతిపెట్టి పారిపోయాడు. ఘటనపై కరియమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
పేరు మార్చుకుని.. పెళ్లి చేసుకుని
పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుపోయిన తిప్పేస్వామి కర్ణాటకలోని హసన్ జిల్లా న్యామనహళ్లిలో స్థిరపడ్డాడు. తన పేరును కృష్ణగౌడ్‌గా మార్చుకుని రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు కాగా, ఇటీవల తన పెద్ద కుమార్తె పెళ్లి కుదరడంతో ఆహ్వాన పత్రికను దిన్నేహట్టిలోని తన స్నేహితుడు నాగరాజుకు తిప్పేస్వామి అలియాస్ కృష్ణగౌడ్ పంపాడు. ఎస్పీ రత్న ఆదేశాలతో పాత కేసుల దర్యాప్తు చేపట్టిన పెనుకొండ డీఎస్పీ వెంకటేశ్వర్లు.. విచారణలో భాగంగా కొన్ని రోజుల క్రితం దిన్నేహట్టి గ్రామానికి వెళ్లి తిప్పేస్వామి గురించి ఆరా తీశారు. ఆ సమయంలో నాగరాజు ఇంట్లో తిప్పేస్వామి కుమార్తె వివాహ ఆహ్వాన పత్రిక లభ్యమైంది. దీని ఆధారంగా తిప్పేస్వామి ఆచూకీని పోలీసులు గుర్తించారు.
పట్టుబడ్డాడు ఇలా...
తిప్పేస్వామి ఆచూకీని పసిగట్టిన తర్వాత న్యామనహళ్లికి వెళ్లి అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అయితే..తన తమ్ముడు చిత్తప్పతో భూమి భాగ పరిష్కారం కోసం స్వగ్రామానికి వచ్చిన తిప్పేస్వామి సోమవారం ఉదయం పెద్ద మనుషుల కోసం మందలపల్లి బస్టాండ్ వద్ద వేచి ఉండగా సీఐ రాజ్‌కుమార్ గుర్తించి అదుపులోకి తీసుకుని ఎస్పీ ఎదుట హాజరుపరిచారు. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో చేసిన నేరాన్ని అంగీకరించాడు.
26 ఏళ్ల క్రితం ఆరు నెలల పసిబిడ్డను హతమార్చిన తండ్రి
అప్పటి నుంచి అజ్ఞాతంలోనే నిందితుడు
పేరు మార్చుకుని కర్ణాటకలో తలదాచుకున్న వైనం
నిందితుడి ఆచూకీ
బయటపెట్టిన పెళ్లి కార్డు
Comments
Please login to add a commentAdd a comment