విజయవాడకు ఐదుగురు సీడీపీఓలు
● మాతాశిశు సంరక్షణలో వెనుకడినట్లు గుర్తింపు
అనంతపురం సెంట్రల్: జిల్లాలో ఐదు ప్రాజెక్టుల పరిధిలో చిన్నారుల ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారులు గుర్తించారు. ఉరవకొండ, శింగనమల, అనంతపురం రూరల్, గుత్తి, కణేకల్లు ప్రాజెక్టుల్లో చిన్నారుల పరిస్థితి బాగోలేదని తేలింది. ఈ క్రమంలో సంబంధిత సీడీపీఓలు శ్రీదేవి, ఉమాశంకరమ్మ, ధనలక్ష్మి, లక్ష్మీ ప్రసన్న, ఢిల్లీశ్వరి విజయవాడకు రావాలని ఐసీడీఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో హుటాహుటిన సంబంధిత సీడీపీఓలు, వారి సిబ్బంది బయలుదేరి వెళ్లారు.
రూ. కోట్లు వెచ్చిస్తున్నా వెనుకబాటే.. : అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా మాతాశిశువుల సంరక్షణ కోసం రూ. కోట్ల నిధులు వెచ్చిస్తున్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తున్నారు. అయితే ఫలితాలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. గతేడాది జిల్లావ్యాప్తంగా చిన్నారులకు పరీక్షలు నిర్వహించారు. ఎత్తుకు తగ్గ బరువు, వయసుకు తగ్గ ఎత్తు ఉన్నారా లేదా అనే వివరాలు సేకరించారు. ఈ విషయంలో ఆయా ప్రాజెక్టులు వెనుకబడినట్లు గుర్తించారని, దీంతోనే విజయవాడకు రావాలని ఆదేశాలు వచ్చాయని తెలిసింది.
అవార్డులు అందుకున్నా అంతే! : ‘ఉత్తమ’ అవార్డులు అందుకున్న రెండు ప్రాజెక్టుల సీడీపీఓలకు ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి ఆదేశాలు అందడం తీవ్ర చర్చనీయాంశమైంది. మెరుగైన పనితీరు కనబరిచారంటూ ఉరవకొండ సీడీపీఓ శ్రీదేవి, గుత్తి సీడీపీఓ ఢిల్లీశ్వరికి గతంలో అవార్డులు అందజేశారు. అలాంటి వారే ఇప్పుడు ముందువరసలో ఉండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రాజెక్టు ప్రగతి పథంలో నడిపిస్తున్నట్లు కేవలం కాగితాల్లో చూపి అవార్డులు అందుకున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
అశ్రునయనాలతో అంత్యక్రియలు
పెనుకొండ రూరల్: సామాజిక ఉద్యమకారుడు నరేంద్ర సింగ్ బేడీ అంత్యక్రియలు మంగళవారం అశ్రునయనాల మధ్య సాగాయి. పెనుకొండ మండలం గుట్టూరు రెవెన్యూ పరిధిలో నరేంద్రసింగ్ బేడి ఎంతో ఇష్టంగా ఏర్పాటు చేసుకున్న యంగ్ ఇండియా ఫామ్ హౌస్‌లో కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు ప్రాంతాలకు చెందిన స్వచ్చంద సేవా సంస్థల ప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. కాగా, 1975–76లో గుట్టూరు కేంద్రంలో యంగ్ ఇండియా ప్రాజెక్ట్‌ను బేడీ ప్రారంభించారు. అనంతరం సేవాకార్యక్రమాలను ఉమ్మడి అనంతపురం జిల్లాకు మాత్రమే పరిమితం చేయకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని 13 జిల్లాలకు విస్తరించారు. గ్రామీణులకు ఉపాధి, భూహక్కు చట్టాలపై పోరాటాలు సాగించిన సామాజిక ఉద్యమకారుడిగా ఆయన ఖ్యాతిగడించారు. కాగా, సోమవారం ఆయన మృతి తెలుసుకున్న మంత్రి సవిత, మడకశిర నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సుధాకర్... యంగ్ ఇండియా ఫామ్ హౌస్‌కు చేరుకుని నరేంద్రసింగ్ బేడీ మృతదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. మంగళవారం ఉధయం బేడి నివాసానికి వైఎస్సార్ సీపీ వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పొగాకు రామచంద్ర చేరుకుని నివాళులర్పించారు. ఆర్డీటీ ప్రోగ్రామ్ డైరెక్టర్ మాంఛోఫెర్రర్, ఆయన తల్లి అన్నే ఫెర్రర్, డైరెక్టర్ మల్లారెడ్డి, టింబక్ట్ డైరెక్టర్ బబ్లూ, మేరి, యంగ్ ఇండియా మాజీ ఉద్యోగులు, నల్గొండ ఆచార్య, ప్రసాద్, ప్రమీల, రామగిరి మండలం రామప్ప, గార్లదిన్నె రవి, కిష్టప్ప, బాలరాజు, వాసు, ధర్మవరం కిష్టప్ప, గుట్టూరు సూర్యనారాయణ, మంజునాథ్, కొండారెడ్డి, డ్వాక్రా రామాంజనేయులు, కోగిర జయచంద్ర, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా రాజేష్
అనంతపురం టవర్‌క్లాక్: బీజేపీ జిల్లా నూతన అధ్యక్షుడిగా ఉరవకొండ ప్రాంతానికి చెందిన కొనకొండ్ల రాజేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం అనంతపురంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో నూతన కమిటీ ఎన్నిక నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, రజక కార్పొరేషన్ చైర్మన్ సావిత్రి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment