అతిగా మద్యం తాగి యువకుడి మృతి
ఉరవకొండ: తక్కువ ధరకు అందుబాటులో ఉన్న మద్యం అతిగా తాగి ఓ యువకుడు మృతి చెందాడు. ఫలితంగా ఆ కుటుంబం రోడ్డు పాలైంది. వివరాలు... ఉరవకొండలోని 5వ వార్డులో నివాసముంటున్న కురుబ శంకర్ (35)కు భార్య చంద్రకళ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆటో డ్రైవర్‌గా కుటుంబాన్ని పోషించుకునే శంకర్... గత ఆరు నెలలుగా మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో మంగళవారం అతిగా మద్యం సేవించి నరసమ్మ మఠం సమీపంలో కుప్పకూలిపోయాడు. గమనించిన పరిచయస్తులు సమాచారం ఇవ్వడంతో కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకుని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనతో భార్యాపిల్లల రోదనలు మిన్నంటాయి.
రైతు ఆత్మహత్య
పెద్దపప్పూరు: అప్పులు తీర్చే మార్గం కానరాక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు... పెద్దపప్పూరు మండలం చెర్లోపల్లికి చెందిన నారాయణరెడ్డి, నాగేంద్రమ్మ దంపతులకు ఒక్కగానొక్క కుమారుడు కుమ్మెత చంద్రశేఖరరెడ్డి (40) ఉన్నారు. తనకున్న పొలంలో మిరప, వంగ తదితర పంటలు సాగు చేశాడు. పంటల సాగుకు ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేశాడు. ఈ క్రమంలో తెగుళ్ల బెడదతో పాటు మార్కెట్‌లో గిట్టుబాటు ధర లభ్యం కాక నష్టపోయాడు. దీంతో అప్పులు ఎలా తీర్చాలో తెలియడం లేదంటూ బంధుమిత్రులతో చెప్పుకుని బాధపడేవాడు. అప్పులు తీర్చకపోతే గ్రామంలో పరువు పోతుందని భయపడిన చంద్రశేఖరరెడ్డి మంగళవారం విషపు గుళికలు మింగాడు. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆయనను గమనించిన కుటుంబసభ్యులు వెంటనే పెద్దపప్పూరులోని పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు 108 అంబులెన్స్‌లో తాడిపత్రిలోని ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. ఆయన భార్య రాదిక, ఇంటర్ చదువుతున్న కుమారుడు జితేంద్రరెడ్డి ఉన్నారు. ఘటనపై ఎరస్‌ఐ నాగేంద్రప్రసాద్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment