గిరిజన రైతుపై విద్యుత్ అఽధికారుల కర్కశం
కళ్యాణదుర్గం రూరల్: గిరిజన రైతుపై విద్యుత్ శాఖ అధికారుల కర్కశంగా వ్యవహరించారు. సాగుచేసిన పంటకు నీరు అందించే వీలు లేకుండా విద్యుత్ సరఫరా కాకుండా అడ్డుకుంటున్నారు. బాధిత రైతు తెలిపిన మేరకు... కళ్యాణదుర్గం మండలం లక్ష్మీపురం తండాకు చెందిన లక్ష్మానాయక్ తనకున్న నాలుగు ఎకరాల్లో మిరప, టమాట పంటలు సాగు చేశాడు. ఈ క్రమంలో రెండు బోరుబావులు ఏర్పాటు చేసుకుని విద్యుత్ సరఫరా కోసం నిబంధనల మేరకు డీడీలు చెల్లించి, సర్వీసును పొందాడు. గత ఎన్నికల సమయంలో వైఎస్సార్‌సీపీకి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నాడనే అక్కసుతో స్థానిక టీడీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గిన విద్యుత్ శాఖ అధికారులు ఉన్నఫళంగా లక్ష్మానాయక్ పొలానికి ఉన్న విద్యుత్ సర్వీసు వైర్లను సోమవారం తొలగించారు. ఇదేమని ఏఈ సలీం, జూనియర్ లైన్‌మెన్ కలసి బాధిత రైతు ప్రశ్నిస్తే... బోరుబావులకు సంబంధించిన విద్యుత్ సర్వీసు లైన్ వేరే డీపీకి అనుసంధానమై ఉందని అక్కడి నుంచి లైన్ తీసుకోవాలంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. పంట చేతికొస్తున్న సమయంలో ఇలా చేయడం భావ్యం కాదని వేడుకున్నా అధికారులు కనికరించలేదు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో తనకు ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదని, ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని బాధిత రైతు వేడుకుంటున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment