డిగ్రీ మొదటి సెమిస్టర్ ఫలితాల విడుదల
అనంతపురం ఎడ్యుకేషన్: స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో గత డిసెంబర్లో నిర్వహించిన డిగ్రీ మొదటి సెమిస్టర్ ఫలితాలను సోమవారం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పద్మశ్రీ విడుదల చేశారు. బీఏలో 62 శాతం, బీకాంలో 57, బీఎస్సీలో 60, బీబీఏలో 48 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొదటి సెమిస్టర్‌తో పాటు నవంబరు 2024లో నిర్వహించిన మూడు, ఐదో సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి రీవాల్యుయేషన్ కోసం ఈనెల 29 నుంచి ఫిబ్రవరి 4 వరకు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ పద్మశ్రీ సూచించారు. కార్యక్రమంలో కళాశాల కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ రామకృష్ణ, పరీక్షల విభాగం అధికారులు చలపతి, శ్రీనివాసులు, నాగా ర్జున, వివిధ విభాగాధిపతులు పాల్గొన్నారు.
నిబంధనలు పాటిస్తే
ప్రమాదాలు దూరం
● ఎస్పీ జగదీష్
అనంతపురం సెంట్రల్: రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు దూరమవుతాయని ఎస్పీ జగదీష్ పేర్కొన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకొని రవాణాశాఖ ఆధ్వర్యంలో సోమవారం నగరంలో కేఎస్ఆర్ జూనియర్ కళాశాల వద్ద నుంచి టవర్‌క్లాక్ వరకూ మెగా వాకథాన్(ర్యాలీ) నిర్వహించారు. టవర్‌క్లాక్ వద్ద మానవహారం ఏర్పాటు చేసి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసే సమయంలో ప్రతి ఒక్కరూ హెల్మెట్, సీటు బెల్టు ధరించాలన్నారు. సెల్‌ఫోన్ వాడుతూ వాహనాలు నడుపుతుండటంతో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్‌శర్మ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలపై ప్రజలను జాగృతం చేయడానికి ఈనెల 16 నుంచి ఫిబ్రవరి 15 వరకూ రోడ్డు భద్రతా మాసోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిబంధనలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలన్నారు. ఉప రవాణా కమిషనర్ వీర్రాజు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు విపత్తులా తయారయ్యాయన్నారు. ప్రమాదాల్లో వ్యక్తి మృతి చెందితే కుటుంబ సభ్యుల పరిస్థితి వర్ణనాతీతంగా మారుతోందన్నారు. రోడ్డు భద్రత నిబంధనలపై అవగాహన పెంచేందుకు మాసోత్సవాలు నిర్వహింస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీఓలు సురేష్‌నాయుడు, రమేష్, ఎంవీఐలు శ్రీనివాసులు, సునీత, మనోహర్‌రెడ్డి, రఘునాథ్, లహరి, కేఎస్ఆర్ కళాశాల ఎన్సీసీ విద్యార్థులు, ఆటోమొబైల్ డీలర్లు, డ్రైవింగ్ స్కూల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
నంది విగ్రహం అపహరణ
గుంతకల్లు రూరల్: మండలంలోని మొలకలపెంట గ్రామ సమీపంలో బసవేశ్వరుడి సమాధిపై ఏర్పాటు చేసిన నంది విగ్రహాన్ని ఆదివారం రాత్రి దుండగులు అపహరించారు. గతంలో ఈ సమాధికి అనుకుని ఉన్న పొలం రైతు వద్ద ఉన్న ఎద్దు కరువు సమయంలో కాలు దువ్వి రంకె వేస్తే ఆ రోజు కచ్చితంగా వర్షం పడుతుండేది. దీంతో ఆ ఎద్దును మహిమాన్వితంగా భావిస్తూ గ్రామస్తులు పూజించేవారు. ఈ క్రమంలోనే ఎద్దు మృతి చెందిన తర్వాత పొలం పక్కనే ఖననం చేసి సమాధి నిర్మించి, దానిపై నంది విగ్రహాన్ని ఏర్పాటు చేసి, అప్పటి నుంచి ఇప్పటి వరకూ పూజలు చేస్తూ వస్తున్నారు. శ్రీరామ నవమి రోజు గుంతకల్లు మండలంలోని అమీన్‌పల్లి గ్రామస్తులందరూ అక్కడకు చేరుకుని వంటవార్పు చేపట్టి బసవేశ్వరుడికి నైవేద్యం సమర్పించి భోజనాలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి సమాధిపై ఉన్న నంది విగ్రహాన్ని దుండగులు పెకలించుకుని వెళ్లడంతో స్థానికులతో పాటు చుట్టుపక్కల గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. ఘటనపై కసాపురం పోలీసులకు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment