కిటకిటలాడిన కలెక్టరేట్
ఈమె పేరు రత్నకుమారి. గుత్తి ఆర్‌ఎస్ మంచాలనగర్‌లో నివాసముంటోంది. ఈమె కుమార్తె లిఖిత మానసిక వికలాంగురాలు. నాలుగు నెలల క్రితం వరకు పింఛను వచ్చేది. అయితే నకిలీ సదరం సర్టిఫికెట్ అంటూ ఇటీవల తొలగించారు. పిల్లలు మానసిక వికలాంగురాళ్లంటూ భర్త తనను వదిలేసి వెళ్లాడని, తన బిడ్డకు పింఛను
పునరుద్ధరించి ఆదుకోవాలని కలెక్టర్ వినోద్‌కుమార్‌ను
కన్నీళ్లతో రత్నకుమారి వేడుకుంది.
ఈ దివ్యాంగురాలి పేరు గంగరత్నమ్మ. ఈమెది ధర్మవరం మండలం రావులచెరువు గ్రామం. 90 శాతం వైకల్యం ఉండడంతో రూ.15 వేల పింఛనుకు అర్హత పొందింది. మెడికల్ బోర్డు సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. రూ.15 వేల పింఛను మంజూరైనట్లు అధికారులు చెప్పారని, అయితే డబ్బు మాత్రం ఇవ్వడం లేదని కలెక్టర్ వినోద్‌కుమార్ ఎదుట గంగరత్నమ్మ వాపోయింది.
అనంతపురం అర్బన్: అర్జీదారులతో కలెక్టరేట్ కిటకిటలాడింది.తమ మొర విని కష్టాలు తీర్చాలంటూ కలెక్టర్ వి.వినోద్‌కుమార్‌ను ప్రజలు వేడుకున్నారు. కళ్ల ముందే వికలత్వం కనిపిస్తున్నా లేని పోని కారణాలతో తమ పింఛన్లు తొలగించారంటూ పలువురు దివ్యాంగులు ఆవేదన చెందారు. కలెక్టర్ వినోద్‌కుమార్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, అసిస్టెంట్ కలెక్టర్ బి.వినూత్న, డీఆర్‌ఓ ఎ.మలోల, డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్, తిప్పేనాయక్, శిరీష, మల్లికార్జున, వ్యవసాయాధికారి ఉమామహేశ్వరి వినతులు స్వీకరించారు. మొత్తం 520 అర్జీలు అందాయి. వ్యయ ప్రయాసలకోర్చి వచ్చామని, సమస్యలకు పరిష్కార చూపాలని ప్రజలు వేడుకున్నారు. కార్యక్రమం అనంతరం అర్జీల పరిష్కారంపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఫిర్యాదు దారులు సంతృప్తి చెందేలా ప్రతి అర్జీకి నాణ్యమైన పరిష్కారం చూపించడంతో పాటు ఎండార్స్‌మెంట్ ఇవ్వాలని ఆదేశించారు.
వినతుల్లో కొన్ని...
● అధికారులు, సర్పంచ్ చుట్టూ తిరిగినా తన ఇంటికి కొళాయి కనెక్షన్ ఇవ్వలేదంటూ తాడిపత్రి మండలం చిన్నపొలమడ గ్రామానికి చెందిన సూర్యప్రకాష్ వాపోయాడు. కొళాయి కనెక్షన్ ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరాడు.
● భూ సేకరణ కింద రోడ్డు నిర్మాణానికి తన భూమి తీసుకున్నప్పటికీ పరిహారం ఇవ్వలేదని తాడిపత్రి మండలం గన్నేవారిపల్లెకు చెందిన పుల్లయ్య ఫిర్యాదు చేశాడు. జాతీయ రహదారి 544 డీ నిర్మాణం కోసం తన 1.19 ఎకరాల భూమిని తీసుకున్నారని, అయితే పరిహారం జమ చేయలేదని చెప్పాడు. తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు.
‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’కు వినతుల వెల్లువ
పింఛన్లు తొలగించారంటూ దివ్యాంగుల ఆవేదన
పరిష్కారం చూపాలంటూ దీనంగా వేడుకోలు
Comments
Please login to add a commentAdd a comment