
మునియప్పను సత్కరిస్తున్న మంత్రి కారుమూరి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా లబ్ధిదారుల ఇళ్లకు ఎండీయూల్లో రేషన్ అందించడం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని కర్ణాటక రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి కె.హెచ్.మునియప్ప ప్రశంసించారు. తమ రాష్ట్రంలో కూడా ఇలాంటి విధానాన్ని ప్రవేశపెట్టే దిశగా అధ్యయనం చేస్తామని చెప్పారు.
ఆయన శుక్రవారం విజయవాడలో పౌరసరఫరాల శాఖ గోడౌన్ల నిర్వహణ, ఎండీయూ వాహనాలు, రేషన్ సరుకుల ప్యాకేజింగ్, పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావుతో కలిసి పరిశీలించారు. పేదలకు పౌష్టికాహార బియ్యంతో పాటు రాయలసీమ జిల్లాల్లో చిరుధాన్యాలు, పట్టణ ప్రాంతాల్లో ఫోర్టిఫైడ్ గోధుమపిండి పంపిణీ గురించి తెలుసుకుని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఆయన్ని మంత్రి కారుమూరి సత్కరించారు. ఈ కార్యక్రమాల్లో పౌరసరఫరాల శాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్, పౌరసరఫరాల సంస్థ ఎండీ వీరపాండియన్ తదితరులు పాల్గొన్నారు.