వరదలకు నష్టపోయిన రైతులకు అందిస్తాం: సీఎం చంద్రబాబు
ఏలూరు, కాకినాడ జిల్లాల్లో పర్యటన
17 నాటికి పరిహారం అందించేలా చర్యలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ /కిర్లంపూడి, సాక్షి ప్రతినిధి, ఏలూరు: వరదలకు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేలు చొప్పున నష్ట పరిహారం ఇస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. వరద ప్రాంతాల సందర్శన సందర్భంగా బుధవారం ఏలూరు, కాకినాడ జిల్లాల్లో ఆయన పర్యటించారు. ఏలూరులో తమ్మిలేరు కాల్వను బ్రిడ్జి నుంచి పరిశీలించిన అనంతరం సీఆర్ రెడ్డి ఆడిటోరియంలో ఎంపిక చేసిన వరద బాధితులను కలిశారు.
ఏలేరు వరదతో ముంపునకు గురైన వరి పొలాలు, నీట మునిగిన ఇళ్లను కిర్లంపూడి మండలం రాజుపాలెంలో పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. దెబ్బతిన్న ఇళ్ల స్థానంలో కొత్తవి నిర్మిస్తామని చెప్పారు. వరదల్లో దెబ్బతిన్న ఒక్కో వాహనానికి రూ.10 వేలు, దుస్తులు, ఇంటి సామాన్ల కోసం ప్రతి కుటుంబానికి రూ.10 వేలు చొప్పున ఆర్థిక సాయం చేస్తామన్నారు. పైసా ఖర్చు కూడా లేకుండా తోపుడు బళ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు.
జగ్గంపేట, పెద్దాపురం, సామర్లకోట, గొల్లప్రోలు, పిఠాపురం ప్రాంతాలు బాగా దెబ్బతిన్నాయన్నారు. ఏలేరు వరదతో జిల్లాలో 65 వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడిందన్నారు. 17వ తేదీలోపు అన్ని నష్టాలను అంచనా వేసి నష్టపరిహారాన్ని అందించే బాధ్యత తీసుకుంటామన్నారు. గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏలేరు ఆధునికీకరణ కోసం మంజూరు చేసిన నిధులను ఖర్చు చేయకుండా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని చంద్రబాబు విమర్శించారు.
బుడమేరుపై ఆర్మీ వాళ్లే చేతులెత్తేస్తే తాము విజయవంతంగా గండ్లు పూడ్చామని చెప్పారు. ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న బోట్లన్నీ వైఎస్సార్ సీపీకి చెందినవారివేనని, దొంగ ఇసుక వ్యాపారం చేయడానికి వాటిని వినియోగించారని ఆరోపించారు. రాష్ట్రంలో ఒక పనికి మాలిన ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నారంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రజలు తమ ఫోన్ నుంచి నేరుగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిని సంప్రదించేలా ఒక యాప్ రూపొందిస్తున్నట్లు ప్రకటించారు.
ఏలూరు అష్ట దిగ్బంధం
ముఖ్యమంత్రి చంద్రబాబు ఏలూరు పర్యటన సందర్భంగా నగరమంతా అష్ట దిగ్బంధంతో ప్రజలు అవస్థలు ఎదుర్కొన్నారు. అడుగడుగునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ముఖ్యమంత్రి పర్యటన ఎక్కడో సీఆర్ రెడ్డి కళాశాల దగ్గర కాగా ఫైర్ స్టేషన్ సెంటర్ నుంచి ఆంక్షలు విధించారు. కాలేజీకి వెళ్లే విద్యార్థులు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు, వృద్ధులు నానా అగచాట్లు పడ్డారు. ప్రతి రోడ్డుపై బ్యారికేడ్లు పెట్టారు. నగరంలోని ఆర్‌టీసీ బస్టాండ్ కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించింది. ప్రయాణికులు బస్సులు లేక ప్లాట్‌ఫామ్‌లపై పడిగాపులు కాశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఏలూరులో ట్రాఫిక్ ఆంక్షలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment