సాయంత్రం 4.25 గంటలకు కాకినాడ జిల్లా పిఠాపురంలో సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచార సభకు హాజరైన అశేష జనసందోహంలో ఓ భాగం
చిలకలూరిపేట, కైకలూరు, పిఠాపురం ఎన్నికల సభల్లో సీఎం జగన్
అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, రైతన్నలు, పిల్లల ఉసురు పోసుకుంటున్న చంద్రబాబు కూటమి
హస్తిన పెద్దలకు దాసోహం అంటూ పథకాలను ఆపుతున్నారు
పోలింగ్ ముగిసిన మర్నాడు.. 14న ఖాతాల్లోకి డబ్బులు వేస్తామంటున్నారు.. జగన్ బటన్లు నొక్కినా ఖాతాల్లోకి రాకుండా ఆటంకాలు కల్పిస్తున్నారు
2014లో వంచించిన బాబుకు దత్తపుత్రుడు మరోసారి కత్తి అందించి వెన్నుపోటు పొడవమంటున్నాడు
మీ బిడ్డ కోరుకునేది మీ అందరి సంతోషాన్నే..
మీ జగన్‌కు ఓటు.. ఇంటింటి అభివృద్ధి కొనసాగింపు
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై అడ్డగోలుగా దుష్ప్రచారం
బాలకృష్ణ, పవన్ కొన్న స్థలాలకు ఒరిజినల్ పత్రాలు ఇవ్వలేదా?
కొల్లేరు సర్వే దాదాపు పూర్తి.. మిగులు భూములు పేదలకిస్తాం
మీరు మీ బిడ్డకు 60 నెలలు అధికారవిుస్తే 57 నెలలకే గొంతు నొక్కేస్తున్నారు
జగన్ ఎలాంటివాడో ఐదేళ్లుగా ఏటా నా అక్కచెల్లెమ్మలు చూస్తున్నారు
దత్తపుత్రుడికి ఓటేస్తే పిఠాపురంలో ఉంటాడా?
కార్లు మార్చినట్టు భార్యల్ని మార్చేసే ఆయన ఎమ్మెల్యే అయితే ఎవరికి న్యాయం చేస్తాడు?
ఏ అక్కచెల్లెమ్మకు అయినా కష్టం వస్తే ఆయన్ను కలవడం సాధ్యమేనా?
గీతమ్మను గెలిపించండి.. డిప్యూటీ సీఎంను చేసి నా పక్కనే కుర్చీలో కూర్చోబెట్టుకుంటా
లాండ్ టైటిలింగ్ యాక్ట్, రిజిస్ట్రేషన్లపై ఎంత దుష్ప్రచారాలు చేస్తున్నారో మీరే చూస్తున్నారు. చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణ మొన్ననే విశాఖలోని రుషికొండలో భూములు కొన్నాడు. దత్తపుత్రుడు మంగళగిరిలో భూములు కొన్నాడు. నేను వీళ్లిద్దరినీ అడుగుతున్నా. భూములు కొన్నప్పుడు మీకు ఒరిజనల్ రిజిస్టర్డ్ డీడ్స్ ఇచ్చారా? లేక జిరాక్స్ కాపీలు ఇచ్చారా? రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు చేసుకున్న 9 లక్షల మందికి మనం ఒరిజినల్ రిజిస్టర్డ్ డీడ్స్ ఇస్తే.. జిరాక్స్ కాపీలు ఇస్తున్నారని, వాళ్ల భూములను జగన్ కొట్టేస్తున్నాడంటూ దారుణంగా దుష్ప్రచారాలు చేస్తున్న వీళ్లంతా అసలు మనుషులేనా?
– చిలకలూరిపేట, పిఠాపురం సభల్లో సీఎం జగన్
సాక్షి ప్రతినిధి, గుంటూరు/సాక్షి ప్రతినిధి, ఏలూరు/సాక్షి ప్రతినిధి, కాకినాడ: వివిధ పథకాలతో నేరుగా లబ్ధి చేకూరుస్తూ మీ బిడ్డ బటన్లు నొక్కిన డబ్బులు అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, రైతన్నలు, విద్యార్థులకు అందకుండా చంద్రబాబు కూటమి ఢిల్లీ పెద్దలతో కుట్రలు చేసి దుర్మార్గంగా అడ్డుకుంటోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ఈ కూటమి ఢిల్లీ నుంచి ఎన్నికల కమిషన్ దాకా వీళ్లకున్న పలుకుబడిని ఉపయోగించి ప్రజల గొంతు నొక్కేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజు నుంచి ప్రజలకు మంచి చేసేందుకు మీ బిడ్డ బటన్లు నొక్కుతూనే ఉన్నాడని, ఇప్పటికి 130 సార్లు బటన్లు నొక్కాడని గుర్తు చేశారు.
అలాంటి రొటీన్‌గా జరుగుతున్న కార్యక్రమాన్ని 57 నెలలకే అడ్డుకుని గొంతు నొక్కుతున్నారని ధ్వజమెత్తారు. ‘రెండు నెలల క్రితం వరకు నేరుగా ఇంటివద్దకే వచ్చి అవ్వాతాతలకు పెన్షన్లు ఇచ్చేవారు. ఆ పెన్షన్ వల్ల ఎక్కడ మీ బిడ్డకు మంచి పేరు వస్తుందోనని కుట్రపూరితంగా వలంటీర్లను అవ్వాతాతల ఇంటికి వెళ్లకుండా అడ్డుకుని వారి ఉసురు పోసుకుంటున్నారు. ఏ ప్రభుత్వాన్నైనా 60 నెలల కోసం ఎన్నుకుంటారు. అలాంటిది మన ప్రభుత్వాన్ని 57 నెలలకే గొంతు పట్టుకుని పిసికే కార్యక్రమం చేస్తున్నారు. మీ బిడ్డ బటన్లు నొక్కిన సొమ్ము అందకుండా ఢిల్లీ పెద్దలతో కుట్రలు చేసి అడ్డుకుంటున్నారు.
ఈ డబ్బులు ఎన్నికలు అయిపోయాక ఇస్తారట! పోలింగ్ ముగిసిన మర్నాడు 14వ తారీఖున ఇస్తారట! ఇది కుట్ర కాదా? అయినా ఫర్వాలేదు. నాకు కావాల్సింది నా అక్కచెల్లెమ్మల మొహాల్లో సంతోషం. వారి పిల్లల చదువులకు మంచి జరగడం నాకు కావాలి. నాకు కావాల్సింది రైతన్నల మొహాల్లో సంతోషం. నాకు కావాల్సింది ఇదే! వాళ్లు నొక్కుతున్నది మీ బిడ్డ గొంతు కాదు.. నా అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, రైతన్నలు, పిల్లల గొంతులనే. జగన్ ఎలాంటివాడో నా అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు ఐదేళ్లుగా ఏటా చూస్తూనే ఉన్నారు. మీ బిడ్డ తప్పు చేయలేదు. మీ జగన్ మీ కోసం బటన్లు నొక్కాడు. ఇవి ఎన్నికల కోసం నొక్కిన బటన్లు కావు’ అని పేర్కొన్నారు.
ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నది కులాల మధ్య యుద్ధం కాదని, రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం జరుగుతోందని స్పష్టం చేశారు. పెత్తందార్లతో జరుగుతున్న ఈ యుద్ధంలో మీ జగన్ పేదల పక్షాల పోరాడుతున్నాడని గుర్తు చేశారు. కొల్లేరు ప్రాంతంలో సర్వే దాదాపుగా పూర్తైందని, మీ బిడ్డ ప్రభుత్వం మళ్లీ రాగానే మిగులు భూములను గుర్తించి పేదలకు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. శనివారం పల్నాడు జిల్లా చిలకలూరిపేట కళామందిర్ సెంటర్, ఏలూరు జిల్లా కైకలూరు, కాకినాడ జిల్లా పిఠాపురంలోని ఉప్పాడ సెంటర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో సీఎం జగన్ ప్రసంగించారు. రాష్ట్రంలో ప్రతి గడపకూ 59 నెలలుగా అందిన పథకాలు, ఇంటింటి అభివృద్ధిని కొనసాగించేందుకు ఫ్యాన్ గుర్తుకే రెండు ఓట్లు వేయాలని అభ్యర్థించారు.
పైశాచిక ఆనందం..
ఈ మధ్య అత్యంత హేయంగా జరుగుతున్న కుట్రలు చూస్తుంటే వీళ్లు మనుషులేనా అనిపిస్తోంది. ఢిల్లీ నుంచి వాళ్లకున్న రికమండేషన్లు, అధికారంతో మొన్నటి వరకూ అవ్వాతాతలకు ఇంటికొచ్చి ఇచ్చిన పెన్షన్లను దారుణంగా ఆపించారు. ఆ అవ్వాతాతలు రోడ్డున పడి ఎండలో తిరిగి అగచాట్లు పడుతుంటే చంద్రబాబుకు, ఆయన కూటమికి ఎంత శాడిస్టిక్ ప్లెజర్ (పైశాచిక ఆనందం)? ఈ కుట్రలు ఇంకా కొనసాగిస్తూ మీ బిడ్డ 60 నెలల పాలన పూర్తి కాక ముందే 57 నెలలకే గొంతు నొక్కుతున్నారు.
గీతమ్మను గెలిపిస్తే డిప్యూటీ సీఎంను చేస్తా..
నాకు అక్క లాంటి వంగా గీతమ్మను బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించండి. నా అక్కను డిప్యూటీ సీఎంగా చేసి పిఠాపురానికి పంపిస్తానని మీ అందరికీ మీ బిడ్డ మాటిస్తున్నాడు. మీ కోసం, మీ అభివృద్ధి కోసం పంపిస్తా. మీకు మంచి చేయడం కోసం పంపిస్తా. అక్కను గెలిపించండి. నా పక్కనే డిప్యూటీ సీఎంగా కూర్చోబెట్టుకుని మీ అందరికీ మంచి చేయిస్తా. కూటమి ప్రలోభాలకు మోసపోవద్దని మీ అందరినీ సవినయంగా కోరుతున్నా. జరుగుతున్న మంచి కొనసాగేలా మీ బిడ్డ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించండి.
దత్తపుత్రుడికి ఎందుకు ఓటేయకూడదంటే..
పిఠాపురంలో పోటీ చేస్తున్న ఈ దత్తపుత్రుడికి ఎందుకు ఓటు వేయకూడదో కూడా చెబుతా. 2014లో ఇదే చంద్రబాబు, దత్తపుత్రుడు, బీజేపీ కలసి ఉన్నప్పుడు.. గద్దెనెక్కాక బాబు హామీలను నెరవేర్చకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిస్తే ఆయనకు ఆ కత్తి అందించిన వీళ్లకు భాగస్వామ్యం లేదా? ఇప్పుడు కూడా సాధ్యం కాని హామీలతో చంద్రబాబు మరోసారి మేనిఫెస్టో ఇచ్చాడు. మీ బిడ్డ ఎంతో కష్టపడితే, గతంలో ఎప్పుడూ జరగని విధంగా పారదర్శకంగా పథకాలను అందిస్తుంటే ఏటా రూ.70 వేల కోట్లు ఖర్చు అవుతోంది.
చంద్రబాబు తన మేనిఫెస్టోలో ఏకంగా రూ.1.05 లక్షల కోట్లు ఏటా ఇస్తానని నమ్మబలుకుతున్నాడు. అది సాధ్యం కాదని ఆ కూటమికీ తెలుసు. తెలిసి తెలిసీ అదే చంద్రబాబుకు మళ్లీ కత్తి అందించి రైతన్నలను పొడవండి.. పిల్లలను పొడవండి.. అక్కచెల్లెమ్మలను పొడవండి.. అవ్వాతాతలను పొడవండంటున్నాడంటే ఈ మనిషి రేపొద్దున ఎమ్మెల్యే అయితే ఎవరికి న్యాయం చేస్తాడు? ఎవరికి మేలు చేస్తాడు? ఒక్కసారి అందరూ ఆలోచన చేయండి.
కార్లు మార్చినట్టుగా..
ఐదేళ్లకొకసారి కార్లు మార్చినట్టుగా భార్యలను మార్చే ఈ పెద్దమనిషిని అక్కచెల్లెమ్మలు ఎవరైనా నమ్ముతారా? ఒకసారి జరిగితే పొరపాటు, రెండోసారి జరిగితే గ్రహపాటు, మరి అదే మూడోసారీ, నాలుగోసారీ అంటే అది అలవాటు కాదా? ఇలాంటి వ్యక్తి ఎమ్మెల్యే అయితే ఏ అక్కచెల్లెమ్మయినా కలిసే పరిస్థితి ఉంటుందా? ఇలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి దగ్గరకు వెళ్లి తమకు సాయం చేయమని అడగగలరా? అసలు ఈ పెద్ద మనిషికి ఓటు వేస్తే పిఠాపురంలో ఉంటాడా? ఆ మధ్య జలుబు చేస్తే అప్పటికప్పుడు హైదరాబాద్ వెళ్లిపోయాడు. ఈ పెద్ద మనిషికి ఇప్పటికే గాజువాక, భీమవరం అయిపోయాయి. ఇప్పుడు పిఠాపురం వంతు. ఇలాంటి వ్యక్తికి ఓటేస్తే మీకు నిజంగా న్యాయం జరుగుతుందా? ఒక్కసారి ఆలోచించండి.
Comments
Please login to add a commentAdd a comment