బత్తలపల్లి: మేమంతా సిద్ధం బస్సుయాత్రకు హాజరైన అశేష జనవాహినికి అభివాదం చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బస్సు యాత్రలో జనగర్జన
పెత్తందారులపై పోరుకు మేమంతా సిద్ధం అని నినాదాలు
పోటెత్తిన ప్రజాభిమానం.. ఇసుకేస్తే రాలనంతగా జనం
ఊరూరా గజమాలలతో ఘన స్వాగతం
మహిళా కూలీలతో సీఎం జగన్ మాటామంతి
సామాన్య జనంతో మాట కలిపి మమేకం
సీఎంతో మాట్లాడేందుకు పోటీ పడిన అక్కచెల్లెమ్మలు
బస్సు వెంట పరుగులు తీసిన యువకులు
ముదిగుబ్బ నుంచి కదిరికి వెళ్లే మార్గం మధ్యలో నడిమిపల్లి వద్ద బస్సు దిగిన సీఎం.. ఓ వృద్ధురాలితో ఆప్యాయంగా మాట్లాడారు. ‘మీకు వలంటీర్ల ద్వారా పెన్షన్ ఇంటి దగ్గర ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుకున్నాడు. ఈసీకి ఫిర్యాదు చేసి ఇంటి దగ్గరకు పెన్షన్ పంపిణీ నిలిపివేయించాడు’ అని చెప్పారు. ఈ క్రమంలో వృద్ధురాలు మాట్లాడుతూ.. ‘చంద్రబాబుతో మాకు పనిలేదు. ఎన్నాళ్లు ఆపుతాడు? మాకు నువ్వే కావాలి. నువ్వుంటే మాకు ఏ కష్టం ఉండదు’ అంటూ ఆమె భావోద్వేగానికి గురైంది.
(మేమంతా సిద్ధం బస్సు యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో ప్రజాభిమానం పోటెత్తింది. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర ఐదో రోజు సోమవారం విజయవంతంగా కొనసాగింది. కిలోమీటర్ల కొద్దీ జనం రోడ్డుకు ఇరువైపులా బారులు తీరారు. మండుటెండను కూడా లెక్క చేయకుండా బస్సు వెనుక యువత పరుగులు తీయడం గ్రామ గ్రామాన కనిపించింది. శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం సంజీవపురంలోని బస కేంద్రం నుంచి ఉదయం 10.30 గంటలకు బస్సు యాత్ర మొదలైంది.
అయితే ఉదయం 6 గంటల నుంచే బస కేంద్రం వద్దకు జనం భారీగా తరలివచ్చారు. అనంతపురం–చెన్నై జాతీయ రహదారిపైకి పెద్ద ఎత్తున వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, సాధారణ ప్రజలు చేరుకోవడంతో పండుగ వాతావరణం తలపించింది. రోడ్‌షో బత్తలపల్లి మండల కేంద్రానికి చేరుకునేలోపే రోడ్డుపై ఇసుకేస్తే రాలనంత మంది సీఎం జగన్‌కు ఘన స్వాగతం పలికారు. బత్తలపల్లి జంక్షన్, ప్రభుత్వ పాఠశాల ఎదురుగా భారీ గజమాలలతో ప్రజలు సీఎంను సత్కరించారు. అంజినమ్మ అనే మహిళ తన పొలంలో పండిన వేరుశనగ పంటను సీఎంకు అందించింది.
ఈ క్రమంలో ఇన్‌పుట్ సబ్సిడీ, రైతు భరోసా ఇతర పథకాలు అందాయా.. అని ఆమె కుటుంబ యోగ క్షేమాలను సీఎం జగన్ అడిగి తెలుసుకున్నారు. అప్పస్వామి అనే వ్యక్తి సీఎం జగన్‌కు గొంగడి (కంబడి), గొర్రె పిల్లను బహూకరించారు. జన సముద్రాన్ని తలపించిన బత్తలపల్లి జంక్షన్‌లో సీఎం కాన్వాయ్ ఎంతో కష్టంతో ముందుకు వెళ్లాల్సి వచ్చింది. 11.20 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు సీఎం రోడ్‌షో ఆ ఊరిలోనే కొనసాగిందంటే ఎంతగా అభిమాన జనం అడ్డుపడ్డారో అర్థం చేసుకోవచ్చు. పెత్తందారులతో పోరుకు మీ వెంటే అంటూ జనం నినాదాలు చేశారు. మేమంతా సిద్ధం అంటూ గర్జించారు. కాన్వాయ్‌తో సమాంతరంగా పరుగులుపెట్టారు.
మురిసిన ముదిగుబ్బ
బత్తలపల్లి నుంచి ముదిగుబ్బ మధ్య రామాపురం, కట్టకిందపల్లి, రాళ్ల అనంతపురం సహా పలు గ్రామాల ప్రజలు జాతీయ రహదారిపైకి చేరుకుని సీఎంకు ఘన స్వాగతం పలికారు. రామాపురంలో బస్సు దిగి సీఎం జగన్ ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. ముదిగుబ్బకు చేరుకునేలోపే ప్రజలు పెద్ద ఎత్తున రోడ్డుపై బారులు తీరారు. అమ్మ ఒడి, ఆరోగ్యశ్రీ, రైతు భరోసా, జగనన్న చేదోడు తదితర పథకాలను ప్రవేశపెట్టి ఆర్థికంగా తాము నిలదొక్కుకోవడానికి, గౌరవ ప్రదమైన జీవనం కొనసాగించడానికి దోహదపడ్డ నాయకుడిని ఒక్కసారైనా చూడాలనే పట్టుదలతో ఆ ప్రాంత ప్రజలు పోటీపడ్డారు.
మధ్యాహ్నం 2.50 గంటలకు ముదిగుబ్బ చేరుకున్న సీఎంకు గజమాలతో స్వాగతం చెప్పారు. పెద్ద ఎత్తున కదలివచ్చిన జనానికి బస్సుపై నుంచి సీఎం అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. 3.27 గంటల వరకు సుమారు 37 నిమిషాలు సీఎం జగన్ ముదిగుబ్బ జనంతో మమేకమయ్యారు. అక్కడి నుంచి కదిరికి బయలుదేరిన సీఎం జగన్‌ను గ్రామగ్రామాన ప్రజాభిమానం అడ్డుకుంది. నాగారెడ్డిపల్లి గ్రామస్తులు భారీ గజమాలతో సీఎంకు స్వాగతం పలికారు.
శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు స్వాగతం పలుకుతున్న అశేష జనసందోహంలో ఓ భాగం
కదం తొక్కిన కదిరి
కదిరి పట్టణంలోకి వస్తున్న సీఎం జగన్‌కు ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. సీఎం రాక నేపథ్యంలో నేల ఈనిందా అన్నట్టు జనంతో కదిరి రోడ్లు కిటకిటలాడాయి. జగన్ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ ప్రజలు కదం తొక్కారు. సీఎం వస్తున్నారని ఉదయం నుంచే కదిరి పట్టణంలో పెద్ద ఎత్తున కోలాహలం నెలకొంది. ప్రజాభిమానం అడ్డు పడటం వల్ల నిర్దేశించిన షెడ్యూల్ కంటే మూడు గంటలు పైనే ఆలస్యం అయినప్పటికీ, తమ అభిమాన నేతను చూడాలన్న ఆశతో ప్రజలు ఓపికతో వేచి చూశారు. సాయంత్రం 5:45 గంటలకు కదిరిలోకి ప్రవేశించిన సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.
తమ సెల్‌ఫోన్‌లలోని టార్చ్‌లైట్‌లను ఆన్ చేసి ప్రజలు సీఎం జగన్ యాత్రకు సంఘీభావం తెలిపారు. ఇలా రాత్రి 7.55 గంటల వరకు సీఎం జగన్ రోడ్‌షో రెండు గంటల పాటు కదిరిలోనే కొనసాగింది. అనంతరం బస్సుపై నుంచి రోడ్‌షో నిర్వహించిన సీఎం జగన్.. పీవీఆర్ కళ్యాణ మండపంలో ముస్లిం సోదరులతో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ‘సాధారణంగా ఎన్నికల సమయంలో మీకు ఫలానా మేలు చేస్తాం.. మాకు ఓటు వేయండి’ అని ప్రజలకు నాయకులు హామీ ఇవ్వడాన్ని చూస్తుంటాం. అయితే బస్సు యాత్రలో సీఎం జగన్‌ను కలిసిన పలువురు ‘మీ పాలనలో ఏదో ఒక రూపంలో మా ఇంటికి మేలు జరిగింది.
వచ్చే ఎన్నికల్లో తిరిగి మిమ్మల్నే గెలిపించుకుంటాం’ అని హామీ ఇస్తున్నారు. అటువైపు బీజేపీ, టీడీపీ, జనసేన, ఇలా ఎన్ని పార్టీలు, ఎంత మంది వ్యక్తులు కలిసి వచ్చినా మీ వెంట మేమంతా ఉన్నామంటూ ప్రజలు సీఎంకు భరోసానిచ్చారు. కదిరి నుంచి నల్లచెరువు, తనకల్లు మండల కేంద్రాల మీదుగా రాత్రి 10 గంటలకు చీకటివానిపల్లె విడిది కేంద్రానికి సీఎం జగన్ చేరుకున్నారు. షెడ్యూల్ కంటే నాలుగు గంటలు ఆలస్యమైనా ప్రజలు, మహిళలు దారి పొడవునా వేచి చూశారు.
ఇదే మా హామీ
వితంతు మహిళనైన నాకు ఈ ప్రభుత్వంలో ఇంటి స్థలం ఇచ్చారు. ఇంటి నిర్మాణానికి అండగా నిలిచారు. వితంతు పెన్షన్‌ను నెలనెలా ఒకటో తేదీనే ఇంటికి పంపారు. ఇంత మేలు చేసిన ఆయన్ను గెలిపించుకోకుంటే ఇంకెవరిని గెలిపించుకుంటాం? ఇది జగనన్నకు మా హామీ.
– వెంకటలక్ష్మి, బత్తలపల్లి
మళ్లీ జగన్‌ను గెలిపించుకుంటాం
నాకు 60 ఏళ్లు పైనే ఉన్నాయి. కర్రసాయం లేనిదే నడవలేని పరిస్థితి. నా కొడుకు చనిపోయాడు. ఈ క్రమంలో నెలనెలా రూ.3 వేల పెన్షన్‌ను ఇంటికి పంపి పెద్ద కొడుకులా సీఎం జగన్ నన్ను సాదుకొచ్చాడు. ఆ టీడీపీ వాళ్లు వలంటీర్లతో పెన్షన్ పంచకుండా అడ్డుపడ్డారట. ఏం పర్లేదు. ఒకటి రెండు నెలలేగా.. మళ్లీ నా పెద్ద కొడుకు జగన్ ఇంటి దగ్గరకే పెన్షన్ పంపుతాడు. ఆయన్ను మేం గెలిపించుకుంటాం.
– సాకలి చెన్నప్ప, కదిరి శివారు గ్రామం కుటగుళ్ల
ఏమ్మా.. తల్లీ ఎలా ఉన్నారు?
‘ఏమ్మా తల్లీ.. ఎలా ఉన్నారు? ప్రభుత్వ పథకాలు అందరికీ అందుతున్నాయా? వాటిని సద్వినియోగం చేసుకుంటున్నారా’ అంటూ మహిళా కూలీలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముచ్చటించారు. బస్సు యాత్ర బత్తలపల్లి సమీపంలోకి వచ్చినప్పుడు సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని చూడాలన్న తపనతో పొలంలో వేరుశనగ తొలగిస్తున్న కూలీలు పరుగు పరుగున రోడ్డుపైకి చేరుకున్నారు. వారిని గమనించిన సీఎం వైఎస్ జగన్... బస్సు ఆపించి వారితో మాట్లాడారు. ‘ఆసరా డబ్బులు చేతికి అందాయా తల్లీ.. పొదుపు సంఘాలు ఎలా నడుస్తున్నాయి.. అమ్మఒడి వస్తోందా...’ అని ఆరా తీశారు. తమను అంత ఆప్యాయంగా పలకరించే సరికి సంబరపడిన కూలీలు..‘మన ప్రభుత్వంలో అన్నీ అందుతున్నాయి సార్..’ అని బదులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment