బాధిత ప్రాంతాల వైపు కన్నెత్తి చూడని సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు
చంద్రబాబు వన్‌మ్యాన్ ‘షో’తో అంటీముట్టనట్లుగా అధికారులు
బాధితులకు భరోసానిచ్చే వారే కరువు
వార్డు సచివాలయ కార్యదర్శులు ఇద్దరు, ఓ కానిస్టేబుల్ మాత్రమే ముంపు ప్రాంతాల్లో ఉన్నారు
తమను ఎవరూ పట్టించుకోవడంలేదంటూ దుమ్మెత్తిపోస్తున్న బాధితులు
అన్నం తిని నాలుగు రోజులైంది
ఇప్పటికి ఆరు రోజులు అవుతున్నా మమ్మల్ని పట్టించుకునేవారే లేరు. ఇంట్లో ఉన్నవి రెండ్రోజులపాటు తిన్నాం. అన్నం తిని నాలుగు రోజులైంది. ఎవరైనా వచ్చి ఆహారం ఇస్తారని ఎదురుచూస్తున్నాం. కానీ, ఒక్కరంటే ఒక్కరూ రావడంలేదు. సచివాలయం వాళ్లు వచ్చి మంచినీళ్లు, బిస్కట్ ప్యాకెట్లు ఇచ్చి వెళ్తున్నారు. వీటితో రోజంతా ఉండాలంటే ఎలా? ఇంట్లో చంటిబిడ్డలు ఉన్నా సరే ఎవరికీ కనికరం కూడా లేదు. – రమణమ్మ, ప్రశాంతి నగర్, విజయవాడ
(విజయవాడ వరద బాధిత ప్రాంతాల నుంచి ‘సాక్షి’ బృందం) : వరద బాధితులకు సహాయ, పునరావాస చర్యల్లో సీఎం చంద్రబాబు ప్రభుత్వం మాటలు కోటలు దాటుతున్నా.. చేతలు బాధితుల గడపకు చేరడంలేదు. అంత చేశాం.. ఇంత చేస్తున్నాం అని ప్రగల్భాలు పలుకుతున్న సర్కారు.. ఆచరణలో మాత్రం బాధితులను వరదకు వదిలేసింది. చంద్రబాబు, మంత్రులు, అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా బాధిత ప్రాంతాల వద్దే మకాం వేశామని మీడియాలో ఊదరగొడుతున్నారు.
అధికార యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టించి సహాయక చర్యలు చేపడుతున్నామని సొంత డబ్బా కొడుతున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. ఎవ్వరూ పత్తాలేరు. విజయవాడలోని వరద బాధిత ప్రాంతాల్లో ‘సాక్షి ప్రతినిధుల బృందం’ శుక్రవారం ఉ.9 గంటల నుంచి సా.4 గంటల వరకు పర్యటించింది. ఎక్కడా కూడా ప్రభుత్వ ప్రతినిధులుగానీ ఉన్నతాధికారులుగానీ కనిపించనేలేదు. కనీసం ఆహార పదార్థాలు అందించే దిక్కులేక బాధితులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న దయనీయ దృశ్యాలు అంతటా కనిపించాయి.
ప్రజా ప్రతినిధులు ఎక్కడ!?
సీఎం చంద్రబాబు, ఆయన మంత్రివర్గ సభ్యులు, అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒక్కరంటే ఒక్కరు కూడా బాధితులను పట్టించుకోవడంలేదు. విజయవాడలోని వరద బాధిత ప్రాంతాలన్నీ వరుసగా ఆరో రోజు కూడా పూర్తిగా నీటమునిగి ఉన్నాయి. రాజీవ్‌నగర్, ప్రకాశ్‌నగర్, ఇందిరా నాయక్ నగర్, పాయకాపురం, అంబాపురం, నందమూరి నగర్, కండ్రిక, నున్న, పైపులరోడ్డు, వాంబే కాలనీ, వడ్డెర కాలనీ, లూనా సెంటర్ తదితర ప్రాంతాలకు ప్రభుత్వ ప్రతినిధులు ఒక్కరంటే ఒక్కరు కూడా రాలేదు. ఆ ప్రాంతాల్లో ఉన్న దాదాపు లక్షమందిని వరదకే వదిలేయడం విస్మయపరుస్తోంది. కనీసం 10శాతం మందిని కూడా పునరావాస ప్రాంతాలకు తరలించనే లేదు.
ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న వారు ఎలా ఉన్నారని మంత్రులుగానీ అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలుగానీ పట్టించుకోవడమే లేదు. ఇక సహాయ, పునరావాస చర్యలను ప్రత్యక్షంగా పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారుల తీరూ అలానే ఉంది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, విజయవాడ మున్సిపల్ కమిషనర్, పోలీస్ కమిషనర్, ఆర్డీవో, తహశీల్దార్లు.. ఇలా ఏ ఒక్క అధికారి కూడా వరద ముంపు ప్రాంతాల్లో కనీసం అడుగుపెట్టనే లేదు. దీంతో సహాయ, పునరావాస చర్యలపై సరైన పర్యవేక్షణ లేకుండాపోయింది. నిజానికి.. పూర్తిగా నీట మునిగి ఉన్న ఆ కాలనీల్లోకి ట్రాక్టర్లపై వెళ్లాల్సిందే. కార్లు, జీపులు, ఇతర ప్రభుత్వ వాహనాల్లో వెళ్లేందుకు అవకాశంలేదు.
దీంతో తమకెందుకు.. బాధితులు ఏమైపోతే మాకేంఅన్నట్లుగా మంత్రులు, ఉన్నతాధికారుల వ్యవహారశైలి ఉంది. ఇక నున్న రోడ్‌లో కొంతవరకు సీఐలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లు, కొందరు కిందిస్థాయి వైద్య సిబ్బంది వచ్చారు. కానీ, వారు ముంపు ప్రాంతాలకు చాలా దూరంగానే నిలిచిపోయారు. ప్రభుత్వం, దాతలు సమకూర్చిన మంచినీటి బాటిళ్లు, ఇతర సామగ్రి అంతా నున్న రోడ్డులో వృథాగా పడి ఉంటున్నాయి. మంత్రులు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్, జేసీ, కమిషనర్ వంటి వారు క్షేత్రస్థాయిలో పర్యటించి ఉంటే ఆ విషయాన్ని గుర్తించగలిగేవారు.
బాధితుల ఆకలి కేకలు..
మరోవైపు.. విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో వేలాదిమంది బాధితులు ఆకలి కేకలు పెడుతున్నా ప్రభుత్వం అస్సలు పట్టించుకోవడంలేదు. నీట మునిగిన ఇళ్లలోనో.. మొదటి అంతస్తులోకి చేరిన బాధితులు ఎవరైనా వచ్చి ఆదుకుంటారేమోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. వీధిలోకి ఏదైనా ట్రాక్టర్ వస్తే.. ఆహార ప్యాకెట్లు తీసుకువచ్చారేమోనని మహిళలు, వృద్ధులు, చిన్నారులు మోకాలిలోతు నీటిలో ఆశతో వస్తున్నారు.
కానీ, వీరికి నిరాశే ఎదురవుతోంది. ప్రభుత్వం కేవలం మంచినీటి ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు మాత్రమే అందించి సరిపుచ్చుతోంది. ఫలితంగా.. లక్షలాది మంది నాలుగైదు రోజులుగా కనీసం అన్నం కూడా కడుపునిండా తినకుండా వరదల్లో కొట్టుమిట్టాడుతున్న దయనీయ దృశ్యాలు అడుగడుగునా కనిపిస్తున్నాయి.
ఊరట కలిగిస్తున్న సచివాలయ సిబ్బంది..
బాధ్యత కలిగిన వారు ముఖం చాటేసినా సరే.. వార్డు సచివాలయ సిబ్బంది మాత్రం ‘మేమున్నామంటూ’ బాధితులకు అండగా నిలుస్తుండటం కొంత ఊరట కలిగిస్తోంది. సాక్షి ప్రతినిధులు శుక్రవారం పర్యటించిన పలు ప్రాంతాల్లో కేవలం వార్డు సచివాలయాల్లోని సంక్షేమ కార్యదర్శి, మౌలిక సదుపాయాల కార్యదర్శి, రెవెన్యూ కార్యదర్శి, ఒక కానిస్టేబుల్, ఇద్దరు ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది మాత్రమే కనిపించారు.
అంటే.. ఆ కాలనీల్లో దాదాపు లక్షమంది ప్రజలు వరద ముంపులో చిక్కుకుంటే.. కేవలం ఆరుగురు కిందిస్థాయి సిబ్బంది మాత్రమే బాధితులకు బిస్కట్లు,మంచినీటి ప్యాకెట్లు అందిస్తూకనిపించారు. వారికి ప్రభుత్వం ఆహార ప్యాకెట్లు సమకూర్చకపోవడంతో అవి అందించలేదు. కనీసం తహశీల్దార్, ఆర్డీఓ స్థాయి అధికారి కూడా సహాయక చర్యల్లో పాల్గొనకపోవడం చంద్రబాబు సర్కారు వైఫల్యానికి అద్దంపడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment