మహారాణిపేట (విశాఖ): చంద్రబాబు ‘స్కిల్’ దొంగేనని, ఆయన అమాయక చక్రవర్తి అని ఏ కోర్టూ సర్టిఫికెట్ ఇవ్వలేదని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి గుడివాడ అమర్‌నాథ్ చెప్పారు. చంద్రబాబు అన్ని కేసుల్లోనూ బెయిల్ తెచ్చుకొని బయట తిరుగుతున్నారని తెలిపారు. మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో సుప్రీం కోర్టు ఇచ్చింన తీర్పు ఒకటైతే.. ఎల్లో మీడియా మరో రకంగా ప్రచారం చేస్తోందని అన్నారు. కొన్ని చానళ్లు బాబు గొప్ప విజయం సాధించారని, ఆయనకు ఏదో ఊరట కలిగిందని, ఆయన సుప్రీం కోర్టులో వేసిన కేసులో ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింనట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు.
2019లో చంద్రబాబుకు వచ్చిన 23 సీట్లను గొప్ప విజయంగా చూపిస్తే ఏ రకంగా ఉంటుందో.. నేడూ అదే విధంగా కనిపిస్తోందన్నారు. సుప్రీం కోర్టు తీర్పులో చంద్రబాబుకు ఏ రకమైన రిలీఫ్ కలగలేదన్నారు. వాస్తవానికి ముందుగా గమనించాల్సింది సెక్షన్ 17 ఏ వర్తిస్తుందా లేదా అనేది ఒక ప్రొసీజరల్ సెక్షన్ మాత్రమే అని అన్నారు. 2018లో అమల్లోకి వచ్చింన ఈ సెక్షన్ ఈ కేసుకు వర్తించదని, స్కిల్ స్కాం 2015 ప్రాంతంలోనే జరిగిందని చెప్పారు.
చంద్రబాబు, పార్టీ నాయకులు తప్పు చేయలేదని వారి లాయర్లు కూడా ఎక్కడా అనడంలేదన్నారు. రూ. 370 కోట్ల ప్రజాధనాన్ని దోచుకోలేదని ఎక్కడా వారి వాదనల్లో చెప్పలేదని గుర్తు చేశారు. గవర్నర్ అనుమతి లేదనో, స్పీకర్‌కు చెప్పలేదనో 17 ఏని చూపించి క్వాష్ చేయాలని కోరారని తెలిపారు. రిమాండ్ ప్రక్రియలో లోపం లేదని ఇద్దరు న్యాయమూర్తులు ఏకాభిప్రాయాన్ని చెప్పారని, 17 ఏ వర్తించే విషయంలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారని చెప్పారు. రిమాండ్ అంతా పద్ధతి ప్రకారమే జరిగిందని ఇద్దరు జడ్జిలూ చెప్పారన్నారు.
గతంలోనూ ఇదే ధోరణి
చంద్రబాబు గతంలో ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయినప్పుడు కూడా ఇదే రకమైన వాదనలు చేశారని, సెక్షన్ 8 అమల్లో ఉందని, మీకూ పోలీసులున్నారని.. మాకూ ఉన్నారని.. మీకూ ఏసీబీ ఉందని.. మాకూ ఉంది అంటూ చంద్రబాబు మాట్లాడారని మంత్రి గుర్తు చేశారు. ఇలాంటి వితండ వాదం చేసి తప్పించుకునే ప్రయత్నం చేశారని చెప్పారు. గతంలో కేసులకు సెక్షన్ 17ఏ వర్తించదని దాదాపు ఆరు కోర్టులు చెప్పాయన్నారు. అంత క్లియర్‌గా ఉందని అన్నారు. ఈ రోజు వచ్చింన తీర్పు చూసిన తర్వాత చంద్రబాబు న్యాయస్థానంలో బోనులో, విచారణ సంస్థల ముందు దొంగలా నిలబడి సమాధానం చెప్పాల్సిందేనన్నారు. బాబు 52 రోజులు జైలు శిక్ష అనుభవించి, ఆరోగ్య కారణాలు చెప్పి బెయిల్‌పై ఉన్న ఒక దొంగే తప్ప నిజాయితీపరుడు, అమాయక చక్రవర్తి అని న్యాయస్థానాలు చెప్పలేదని మంత్రి అన్నారు.
లేని పార్టీకి ఎవరు అధ్యక్షులయితే మాకేంటి?
ఈ రాష్ట్రంలో లేని పార్టీకి ఎవరు అధ్యక్షులు అయితే మాకేంటి అని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి మంత్రి వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వచ్చిన ఓట్లు 0.4 శాతమేనని, నోటా కంటే తక్కువని అన్నారు. అటువంటి పార్టీ గురించి చర్చించుకోవడం అనవసరమన్నారు. రాజకీయాల్లో ఉన్న వాళ్లకు చాలా మందికి తోబుట్టువులు ఉంటారని, వారంతా ప్రధానులు, రాష్ట్రపతులు కాలేరు కదా అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కి సీట్లు కాదు కదా ఓట్లేసే వారూ లేరన్నారు. ఈ రాష్ట్రానికి వారు చేసిన అన్యాయమే అందుకు కారణమన్నారు. కలిసి నిర్మించుకున్న ఉమ్మడి రాష్ట్రాన్ని విడగొట్టి, రాష్ట్ర భవిష్యత్తును గొడ్డలితో నరికిన పార్టీ కాంగ్రెస్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి పార్టీ ఈ రాష్ట్రానికి ఉండకూడదని ప్రజలు అనుకున్నారని, అలానే లేకుండా చేశారని మంత్రి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment