సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద నగరంగా విశాఖపట్నం భాసిల్లుతోంది. త్వరలో కార్యనిర్వాహక రాజధానిగా కూడా ప్రత్యేకతను సంతరించుకోనున్న విశాఖపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఐటీ హబ్‌గా నగరాన్ని అభివృద్ధి చేసేందుకు వడివడిగా అడుగులు ముందుకేస్తోంది.
ఈ నేపథ్యంలోనే బీచ్ ఐటీ కాన్సెప్‌్టని ప్రమోట్ చేస్తోంది. దీంతో దిగ్గజ సంస్థలు విశాఖ వైపు ఆసక్తి కనబరుస్తున్నాయి. దీంతో ఐటీ సంస్థల్లో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు కల్పించడానికి ప్రభుత్వం నడుం బిగించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ సహకారంతో విశాఖలో జాబ్ ఫెయిర్ నిర్వహణకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.
జూలై 21, 22 తేదీల్లో గ్రూప్ స్నాప్ ఫెస్ట్–2023 పేరుతో జరిగే ఈ కార్యక్రమానికి దిగ్గజ ఐటీ, ఐటీ అనుబంధ సంస్థలు హాజరుకానున్నాయి. దీనికి సంబంధించిన బ్రోచర్, వెబ్‌సైట్‌ని విశాఖలో ఐటీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఆదివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఏజెన్సీస్ (ఎపిటా), వి ఇన్ఫో టెక్నాలజీస్ ప్రతినిధులు పాల్గొన్నారు.
త్వరలో దిగ్గజ సంస్థల కార్యకలాపాలు..
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 300కి పైగా ఐటీ కంపెనీలుండగా.. ఇందులో 80 శాతం వరకు విశాఖ కేంద్రంగానే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఈ నెల 28న దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్.. డెవలప్‌మెంట్ సెంటర్‌ని ప్రారంభించనుంది. ఇదే బాటలో టాటా కన్సల్టెన్సీ సర్వి సెస్ (టీసీఎస్), విప్రో కూడా పయనించనున్నాయి. ఈ నేపథ్యంలో.. రాష్ట్రంలో ఉన్న గ్రాడ్యుయేట్స్‌కు, ఐటీ, ఐటీ అనుబంధ సంస్థలకు మధ్య బాండింగ్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త కాన్సెప్ట్ తీసుకొస్తోంది.
ఎపిటా, రాష్ట్ర ఐటీ విభాగం సహకారంతో వి ఇన్ఫో టెక్నాలజీస్ ఆధ్వర్యంలో గ్రూప్ స్నాప్ ఫెస్ట్–2023ని నిర్వహించనుంది. ఐటీ, ఐటీ అనుబంధ రంగ కంపెనీలకే కాకుండా.. ఫార్మా సంస్థలు, స్టార్టప్ సంస్థలకు ఏ విధమైన నైపుణ్యాలున్న మానవ వనరులు అవసరం?.. ఉద్యోగ అవకాశాలు పొందాలంటే ఎలాంటి కోర్సులు చేయాలి? టెక్నాలజీని ఎలా అందిపుచ్చుకోవాలి వంటి అంశాలను గ్రాడ్యుయేట్స్‌తో పాటు 10వ తరగతి, ఇంటర్ విద్యార్థులకు వివరించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ‘స్ప్రెడ్ యువర్ వింగ్స్’ అనే పేరుతో రెండు రోజుల పాటు విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు.
అలాగే ఈ కార్యక్రమానికి హాజరైన యువత నుంచి సీవీలు తీసుకొని.. అక్కడే ప్రముఖ కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నాయి. ఎంపికైనవారికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయి. జాబ్ ఫెయిర్‌కు టెక్ మహీంద్ర, టీసీఎస్, ఎల్ అండ్ టీ, కాన్సెంట్రిక్స్, కాండ్యుయెంట్, చెగ్, డబ్ల్యూఎన్‌ఎస్, సెయింట్, పాత్రా, ఫ్లూయెంట్‌గ్రిడ్, పల్సస్ వంటి 40 వరకూ ఐటీ, అనుబంధ కంపెనీలు, పైజర్, అరబిందో వంటి 10 ఫార్మా సంస్థలు, 54 యూనివర్సిటీలు, కళాశాలలతో పాటు 10 స్టార్టప్ కంపెనీలు హాజరు కానున్నాయి.
విశాఖ ఐటీలో అపార అవకాశాలు..
విశాఖ ఐటీలో అపార అవకాశాలున్నాయి. కానీ.. వాటిని ఎలా అందిపుచ్చుకోవాలన్న అంశంపై గ్రాడ్యుయేట్స్‌కు సందేహాలున్నాయి. ఐటీ సంస్థలకు కూడా మానవవనరుల కొరత ఉంది. వాటిని తీర్చేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ సహకారంతో నిర్వహిస్తున్నాం. విశాఖ నగరంలో ఉన్న ఐటీ కంపెనీల గురించి అందరికీ తెలియజేయడం ఒక లక్ష్యం కాగా.. వాటిలో ఉపాధి అవకాశాలను ఇక్కడి యువతకు కల్పించడాన్ని మరో లక్ష్యంగా నిర్దేశించుకున్నాం.
రెండు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో ప్రతి సంస్థ 15 నిమిషాల పాటు విద్యార్థులతో అనుసంధానమవుతుంది. తమ సంస్థ గురించి తెలియజేయడమే కాకుండా.. అందులో ఉద్యోగం సాధించేందుకు ఎలాంటి అర్హతలు కావాలో అవగాహన కల్పిస్తాయి. ప్రభుత్వం బీచ్ ఐటీ విధానం తీసుకొచ్చాక విశాఖలో పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. – సాయికుమార్, సీఈవో, వి ఇన్ఫో టెక్నాలజీస్
Comments
Please login to add a commentAdd a comment