సాక్షి, అమరావతి: కళ్లు మూయకుండా అబద్ధాలు చెప్పడంలో సిద్ధహస్తుడిగా పేరొందిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బాటలోనే ఆయన సతీమణి భువనేశ్వరి కూడా ప్రయాణిస్తున్నారు. సోమవారం కాకినాడ జిల్లా జగ్గంపేటలో తెలుగుదేశం పార్టీ నాయకులను కలిసి తొలిసారిగా రాజకీయ ప్రసంగం చేస్తూ అబద్ధాలను అలవోకగా వల్లెవేశారు.
స్కిల్ కుంభకోణాన్ని కప్పిపుచ్చుకునేందుకు అమాంతంగా తమ హెరిటేజ్ కంపెనీ విలువను పెంచేశారు. రూ.371 కోట్ల కోసం తాము కక్కుర్తి పడ¯నక్కర్లేదని, హెరిటేజ్‌లో రెండు శాతం వాటా అమ్ముకుంటే తమకు రూ.400 కోట్లు వస్తాయంటూ కార్యకర్తలను నమ్మించే ప్రయత్నం చేశారు. రెండు శాతానికి రూ.400 కోట్లు అంటే హెరిటేజ్ కంపెనీ విలువ రూ.20,000 కోట్లుగా ఉండాలి.
కానీ సోమవారం స్టాక్ మార్కెట్ గణాంకాల ప్రకారం హెరిటేజ్ మార్కెట్ క్యాప్ అంటే కంపెనీ మొత్తం విలువ రూ.2,171 కోట్లు మాత్రమే. ఈ ప్రకారం చూస్తే రెండు శాతం వాటా విక్రయిస్తే భువనేశ్వరి చేతికి వచ్చేది కేవలం రూ.43.2 కోట్లు మాత్రమే. మరి రెండు శాతం అమ్మితే రూ.400 కోట్లు వస్తాయంటూ ఎలా చెప్పారంటూ స్టాక్ మార్కెట్ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
మా కంపెనీలో 2% వాటా అమ్మినా రూ.400 కోట్లు వస్తాయ్..
జగ్గంపేట/అన్నవరం: మా కంపెనీ(హెరిటేజ్)లో 2 శాతం వాటా అమ్మినా రూ.400 కోట్లు వస్తాయని.. బినామి కంపెనీ పేరుతో చంద్రబాబు కోట్లాది రూపాయలు కాజేశారన్న ఆరోపణల్లో నిజం లేదని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చెప్పారు. చంద్రబాబు అరెస్టుకు నిరసగా కాకినాడ జిల్లా జగ్గంపేటలో జరుగుతున్న నిరాహర దీక్షల శిబిరాన్ని ఆమె సోమవారం సందర్శించారు. శిబిరంలో పాల్గొని సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల సొమ్ము తమకు వద్దని.. తమ కుటుంబం ప్రజా సేవకే అంకితమైందని, తన భర్త చంద్రబాబు ఏ తప్పు చేయలేదని.. అయినా జైల్లో పెట్టారని చెప్పారు. ఓట్ల తొలగింపునకు కుట్ర జరుగుతోందని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి ఓట్లు పోకుండా కాపాడుకోవాలని సూచించారు. అనంతరం టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో చేపట్టిన లక్ష సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు.
అనంతరం జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం జరిగే అన్న సంతర్పణ కార్యక్రమాన్నీ ప్రారంభించారు. ఇదిలా ఉండగా, నారా భువనేశ్వరి రత్నగిరిపై సత్యదేవుని దర్శించుకున్నారు. చంద్రబాబు వెంటనే జైలు నుంచి విడుదలవ్వాలని పూజలు చేశారు. వేదపండితులు ఆమెకు ఆశీస్సులు అందజేశారు. ఆమె వెంట పార్టీ నేతలు యనమల రామకృష్ణుడు, వరుపుల సత్యప్రభ, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment